breaking news
water ground level
-
భూగర్భ శోకం
జిల్లాలో వ్యవసాయ బోర్లు దాదాపు 1.75 లక్షలు ఉన్నాయి. భూగర్భజలాలు పడిపోవడం వల్ల ప్రస్తుతం చాలా వరకు ఎత్తిపోయాయి. మంచి వర్షాలు వస్తే గానీ ఇవి రీచార్జ్ అయ్యే పరిస్థితి లేదు. కర్నూలు(అగ్రికల్చర్):జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో వివిధ కారణాల వల్ల భూగర్భ జలాలు పెరిగినా..అత్యధిక ప్రాంతాల్లో మాత్రం గత ఏడాదితో పోలిస్తే అట్టడుగుకు చేరుకున్నాయి. వెయ్యి అడుగులకు పైగా బోర్లు వేసినా నీటిధార బయటకు రావడం లేదు. జల సంరక్షణ పేరుతో మూడేళ్లుగా ఫాంపాండ్లు, చెక్‌డ్యాంల మరమ్మతులు, బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లు తదితర పనులను చేపడుతున్నారు. మరోవైపు నీరు–చెట్టు కార్యక్రమం కింద కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇవేవీ భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడలేదు. జల సంరక్షణ పనులన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. నిధులన్నీ అధికార పార్టీ నేతలు, కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లినట్లు విమర్శలున్నాయి. వర్షాభావమే కారణం 2018–19లో నందికొట్కూరు, పాములపాడు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన 52 మండలాల్లో వర్షాలు నామమాత్రంగానే కురిశాయి. ఆదోని డివిజన్లో 51 శాతం, కర్నూలు 39 శాతం,నంద్యాల డివిజన్లో 59 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తమ్మీద సాధారణం కంటే 48.3 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. దీనివల్ల చెరువులు, కుంటలు, వాగులు, వంకల్లో చుక్కనీరు లేకుండా పోయింది. వర్షాలు తగ్గిపోవడం, జల సంరక్షణ పనులు అంతంత మాత్రం కావడంతో భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ 15తో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో సగటున 3.29 మీటర్ల మేర పడిపోయాయి. గత ఏడాది సగటున 8.86 మీటర్ల లోతులో ఉండగా..ఈసారి 12.15 మీటర్లకు చేరాయి. ఈ మండలాల్లో ఆందోళనకరం 14 మండలాల్లో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. హొళగుందలో సగటున 15.02 మీటర్లు, ఆళ్లగడ్డ 17.30, మిడుతూరు 16.35, ఆస్పరి 15.87, కొలిమిగుండ్ల 19.26, రుద్రవరం 17.13, మద్దికెర 20.10, ఓర్వకల్లు 16.80, నందికొట్కూరు 23.55, బేతంచెర్ల 24.13, పాములపాడు 31.30, డోన్ 31.35, ప్యాపిలి 31.40, కోసిగిలో సగటున 32.90 మీటర్ల లోతుకు భూగర్భజలాలు తగ్గిపోయాయి. 147 ఫిజోమీటర్ల ద్వారా పరిశీలన 147 గ్రామాల్లోని బోర్లకు ఫిజో మీటర్లు అమర్చి.. వాటిని ఆన్‌లైన్‌తో అనుసంధానం చేశారు. వీటి ద్వారా భూగర్భజలాల పరిస్థితిపై వివరాలు ప్రతి రెండు గంటలకు ఒకసారి సీఎం డ్యాష్ బోర్డుకు చేరతాయి. ఫిజో మీటర్లతో పాటు గత నెల నుంచి మాన్యువల్‌గానూ భూగర్భజలాల స్థితిని పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టులు, నీటి పారుదల వసతి ఉన్న కొన్ని ప్రాంతాల్లో కొంత మేర పెరిగినా.. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ వేగంగా పడిపోతున్నాయి. దీనివల్ల వందలాది గ్రామాల్లో ప్రజలు కన్నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. 15 రోజులకు ఒకసారి కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఉంది. గ్రామాల్లో దాహం దాహం పల్లెల్లో నీటి కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ఇప్పటికే దాదాపు 90 గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. మరో 50 గ్రామాలకూ ట్యాంకర్లు పంపాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మొత్తమ్మీద 250కు పైగా గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. కర్నూలు, డోన్, గూడూరు తదితర పట్టణాల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శివారు ప్రాంతాల్లో మరీ కష్టంగా మారుతోంది. పరిస్థితి ఆందోళనకరం భూగర్భజలాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. హంద్రీ–నీవా, ఇతర నీటిపారుదల వల్ల ఆరు మండలాల్లో మెరుగ్గా ఉన్నా.. మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఆందోళనకరమే. గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ సారి 3.26 మీటర్ల లోతుకు పడిపోయాయి. వేసవిలో తాగునీటి అవసరాలకు మినహా ఇతరత్రా బోర్లు వేయరాదు. – రఘురామ్, డిప్యూటీ డైరెక్టర్,భూగర్భ జలవనరుల శాఖ మండలాల వారీగా భూగర్భజలాల పరిస్థితి 0–8 మీటర్ల లోతులో ఉన్న మండలాలు సి.బెళగల్, కృష్ణగిరి, కర్నూలు, వెలుగోడు, ఆలూరు, చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి, మంత్రాలయం, బండిఆత్మకూరు, గోస్పాడు, కోవెలకుంట్ల, నంద్యాల, అవుకు 8–15 మీటర్లలో.. ఆత్మకూరు, గూడూరు, జూపాడుబంగ్లా, కల్లూరు, కోడుమూరు, కొత్తపల్లి, పగిడ్యాల, వెల్దుర్తి, ఆదోని, గోనెగండ్ల, కౌతాళం, నందవరం, పత్తికొండ, పెద్దకడబూరు, తుగ్గలి, ఎమ్మిగనూరు, బనగానపల్లె, చాగలమర్రి, దొర్నిపాడు, మహానంది, పాణ్యం, సంజామల, ఉయ్యలవాడ, శిరివెళ్ల, గడివేముల 15– 20 మీటర్లలో.. మిడుతూరు, ఓర్వకల్లు, శ్రీశైలం, ఆస్పరి, హొళగుంద, ఆళ్లగడ్డ, రుద్రవరం, కొలిమిగుండ్ల 20 మీటర్ల కంటే లోతులో.. బేతంచెర్ల, నందికొట్కూరు, పాములపాడు, ప్యాపిలి, డోన్, కోసిగి, మద్దికెర -
పాతాళానికి పోవాల్సిందే!
వేసవికి ముందే పడిపోతున్న భూగర్భ జల మట్టం ఆదిలాబాద్ జిల్లా బజర్‌హత్నూర్‌లో పాతాళానికి నీళ్లు 8 జిల్లాల్లో గత ఏడాది కంటే పడిపోయిన భూగర్భ జలాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలాలు అంతకంతకు పడిపోతున్నాయి. వేసవి రాకముందే పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ ఏడాది జనవరికి సంబంధించి భూగర్భ జలాల పరిస్థితిని వివరిస్తూ భూగర్భ జల శాఖ సోమవారం ఒక నివేదిక విడుదల చేసింది. ఆ ప్రకారం రాష్ట్రంలో గత ఏడాది జనవరిలో రాష్ట్రంలో 10.97 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు లభించగా... ఈ ఏడాది అదే నెలలో 13.75 మీటర్ల లోతుల్లోకి చేరాయి. అత్యధికంగా మెదక్ జిల్లాలో గత ఏడా ది జనవరిలో 16.45 మీటర్ల లోతుల్లో నీరు లభ్యంకాగా... ఈ ఏడాది జనవరిలో 23.82 మీటర్ల లోతుల్లోకి దిగజారిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది జనవరిలో 12.13 మీటర్ల లోతుల్లో నీరు లభ్యం కాగా... ఈ ఏడా ది అదే నెలలో 18.35 మీటర్ల లోతుల్లోకి చేరాయి. ఆదిలాబాద్ జిల్లా బజ ర్‌హత్నూర్ మండల కేంద్రంలో గత ఏడాది జనవరిలో 6.1 మీటర్ల లోతు ల్లో భూగర్భ జలాలు లభ్యంకాగా... ఈ ఏడాది అదే నెలలో ఏకంగా 26.12 మీటర్ల లోతుల్లోకి పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే అత్యంత దారుణంగా భూగర్భ జలాలు అడుగంటినట్లు అధికారులు చెబుతున్నారు. తీవ్ర వర్షాభావం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని భూగర్భ జల శాఖ స్పష్టం చేసింది. 20 మీటర్లకుపైగా భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాలు అధికంగా మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉండగా... రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ఉన్నాయి.