పవర్ వస్తే ఐసిస్‌పై యుద్ధమే: ట్రంప్
న్యూయార్క్: ఫ్రాన్స్‌లోని నీస్‌లో జరిగిన దాడిపట్ల అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ పార్టీ తరుపున పోటీలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తాను అధికారంలోకి వస్తే ఇస్లామిక్ స్టేట్ తో యుద్ధం చేస్తానని అన్నారు. తనను ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంటే ఇస్లామిక్ స్టేట్ పై ప్రత్యక్ష యుద్ధం చేసే తీర్మానం తీసుకొచ్చి దాని ఆమోదించాలని అమెరికా కాంగ్రెస్ ను కోరతానని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్రాన్స్ దాడికి సంబంధించి మాట్లాడారు.
’ఇదొక యుద్ధం. ఇస్లామిక్ స్టేట్ పై యుద్ధం చేయాల్సిందే. ఇదొక క్యాన్సర్ లాంటిది. దీనికోసం నాటోను కూడా ఉపయోగించాలి’ అని ట్రంప్ చెప్పారు. ’మీరు చూస్తునే ఉన్నారు. ఇది వివిధ ప్రాంతాల నుంచి కమ్ముకొస్తున్న యుద్ధం. మనం మన దేశంలోకి వచ్చేవారు ఎలాంటి వారు అనే ఆలోచనే లేకుండా పేపర్ వర్క్ లేకుండా అనుమతిస్తున్నాం. సరైన నిబంధనలు పాటించకుండా, వివరాలు సేకరించకుండా వేలమందిని ఒబామా సర్కార్ అనుమంతించగా.. హిల్లరీ మాత్రం అంతకంటే ఎక్కువ మందినే అనుమతించాలని చూస్తోంది. ప్రపంచం మొత్తాన్ని వేధిస్తున్న క్యాన్సర్ లాంటి ఐసిస్ ను అంతమొందించాలంటే మనం నాటో సహాయం కూడా తీసుకోవాలి’ అని ట్రంప్ చెప్పారు.