breaking news
vyapam scame
-
'ఆయన కూడా అలాగే చెప్పేవారు'
న్యూఢిల్లీ: రెండేళ్ల పాలనలో అన్నివర్గాలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రతువుగా మారారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అన్నివర్గాలు అభద్రతా భావంతో బతుకుతున్నాయని ధ్వజమెత్తారు. మన్మోహన్ సింగ్ మాదిరిగానే మోదీ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. 'అతినీతిపరున్ని కాదని మన్మోహన్ సింగ్ చెప్పేవారు. తన హయాంలో కుంభకోణాలపై మౌనంగా ఉండేవారు. మోదీ కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. వ్యాపమ్, డీడీసీఏ, లలిత్ గేట్ స్కాములపై మోదీ సైలెంట్ గా ఉన్నార'ని కేజ్రీవాల్ విమర్శించారు. కేంద్రంలో మోదీ పాలనకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా కేజ్రీవాల్ ట్విటర్ లో పలు ప్రశ్నలు సంధించారు. * కొత్త కోర్టులు ఏర్పాటు చేస్తామని, జడ్జిల సంఖ్య రెట్టింపు చేస్తామని రెండేళ్ల క్రితం హామీయిచ్చారు. న్యాయమూర్తులు కన్నీళ్లు పెట్టుకున్నా మీరు కార్యాచరణ ప్రారంభించలేదు. * దళితులందరికీ విద్య అందిస్తామని రెండేళ్ల క్రితం వాగ్దానం చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్యపై కనీసం స్సందించలేదు. * రైతులకు పెట్టుబడుల్లో కనీసం 50 శాతం లాభం వచ్చేట్టు చేస్తామని చెప్పారు. అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నా చేష్టలుడిగి చూస్తున్నారు. * బ్యాంకుల నిరర్ధక ఆస్తులు తగ్గిస్తామని హామీయిచ్చారు. కానీ విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోవడానికి అనుమతించారు. * పాలన ప్రధానికే పరిమితం కాదని, ముఖ్యమంత్రుల సలహాలు తీసుకుంటామని రెండేళ్ల క్రితం అన్నారు. కానీ ముఖ్యమంత్రులను అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నారు. -
వ్యాపం స్కాంలో ఎ-10 గవర్నరేనా?
దేశాన్నే వణికిస్తున్న వ్యాపం స్కాంలో పెద్దవాళ్లు ఎవరినీ వదల్లేదని, అందరినీ బుక్ చేస్తున్నామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెబుతున్నా.. ఈ కేసులో మాత్రం ఓ పెద్ద చేప విచారణ నుంచి తప్పించుకుందనే అంటున్నారు. గవర్నర్ రాం నరేష్ యాదవ్‌ను ఈ కేసులో ఎ-10గా చేర్చారని, అయితే.. రాజ్యాంగపరమైన రక్షణ ఉండటంతో ఆయనపై విచారణను చేపట్టకుండా ఆపేశారని అంటున్నారు. ఈ విషయాన్ని ఓ పోలీసు అధికారి బయటపెట్టారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. దొరికిన ఆధారాలను బట్టి చూస్తే గవర్నర్‌పై విచారణ చేపట్టాల్సిందేనని, ఇప్పుడు అలా చేయకపోవడం చూస్తుంటే ముఖ్యమంత్రిని రక్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలు వస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ స్కాంలో సీఎం చౌహాన్‌తో పాటు ఆయన భార్య కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్‌ను తొలగించాల్సిందేనని, అలా చేస్తే ఆయన మొత్తం గుట్టంతా విప్పుతారనే బీజేపీ భయపడుతోందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషన్ విమర్శంచారు. గవర్నర్ పదవి నుంచి రాం నరేష్ యాదవ్‌ను తొలగించాలంటూ దాఖలైన కేసుపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది.