breaking news
Volunteer teachers
-
ఆమె చదువుకు ఆటంకాలెన్నో..!
సాక్షి, సిటీబ్యూరో : ఓవైపు చదువులో అమ్మాయిలు దూసుకెళ్తున్నప్పటికీ... మరోవైపు గ్రామాల్లో పరిస్థితులు ఇంకా మెరుగుపడాల్సి ఉందంటున్నారు ఆర్జీరావు ట్రస్ట్ నిర్వాహకులు బొంత దామోదర్‌రావు. పదేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో విద్యాసేవలు అందిస్తున్న ఆయన... అమ్మాయిల చదువుకు ఎదురవుతున్న అడ్డంకులు, తన అనుభవాలు, ఆలోచనలు ‘సాక్షి.. నేను శక్తి’ శీర్షికతో పంచుకున్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే... ఓ గ్రామంలోని అమ్మాయికి ఖరగ్‌పూర్ ఐఐటీలో సీటొచ్చింది. అంత దూరం ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపిస్తామంటూ? తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఈ విషయం తెలిసి మా మేనేజర్ వెళ్లి వాళ్లను కన్విన్స్ చేసి, ఒప్పించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అడ్మిషన్ టైమ్ అయిపోయింది. ప్రస్తుత విద్యావ్యవస్థ రోజురోజుకూ ఖరీదెక్కి, వసతులతో కూడిన నాణ్యమైన విద్య సామాన్యులు అందుకోలేనిదే.! అన్నట్టుగా మారింది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు అబ్బాయిల చదువుపై చూపిస్తున్న ఆసక్తి.. అమ్మాయిల విషయంలో చూపడం లేదు. పిల్లల చదువు ఆగిపోకూడదని, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవాలని మేం ఏర్పాటు చేసిన కార్పస్ ఫండ్‌తో ట్రస్ట్ తరఫున అవసరమైన పుస్తకాలు కొనివ్వడం, హాస్టల్ ఫీజు కట్టడం తదితర చేస్తున్నాం. అయితే మేం 100 మంది పిల్లలకు చేయూతనందిస్తుంటే, అందులో 30శాతం వరకే కొనసాగుతున్నారని తేలింది. డ్రాపవుట్ అవుతున్న వారిలో అత్యధికులు ఆడపిల్లలే. దీనికి కారణాలేమిటని విశ్లేషిస్తే.. ఆడపిల్లల విద్యకు సంబం«ధించి తల్లిదండ్రుల్లో అవగాహన, ఆసక్తి పెరగకపోవడమే ప్రధానంగా కనిపించింది. వివాహంతో చదువుకు విడాకులు తల్లిదండ్రులు గట్టిగా అనుకుంటే ఇప్పుడున్న స్థితిలో పిల్లలను చదివించకుండా ఉండే పరిస్థితి నిజానికి లేదు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్య, మాలాంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఓ స్థాయి వరకు సులభంగానే చదివించొచ్చు. అయితే ఆడపిల్ల పెళ్లికిస్తున్న ప్రాధాన్యత చదువుకు ఇవ్వడం లేదు. గ్రామాల్లో తల్లిదండ్రులు ఇప్పటికీ ఆడపిల్లను బరువుగానే భావిస్తున్నారు. మంచి సంబంధం వస్తే చాలు కూతురి చదువుకు గుడ్‌బై చెప్పించేస్తున్నారు. ‘ఓ అమ్మాయి చాలా బాగా చదివేది. మేం కూడా అన్ని రకాలుగా ప్రోత్సహించాం. అయితే ఫైనల్ ఇయర్లో అడుగుపెడుతుందనగా పెళ్లి కుదరింది. అంతే... తల్లిదండ్రులు చదువు మాన్పించేశారు. మేం ఎంత కన్విన్స్ చేసినా వినలేదు. ఆ అమ్మాయి కోసం మేం పడిన వ్యయప్రయాసలన్నీ వృథా అయ్యాయి. ’ వసతుల లేమి.. దూరభారం.. దాదాపు 70శాతం గ్రామీణ పాఠశాలల్లో మరుగుదొడ్ల లాంటి కనీస వసతులు లేవు. వీటి నిర్మాణ, నిర్వహణలకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న నిధులు వృథా అవుతున్నాయి. ఈ కారణంతో యుక్త వయసు తర్వాత ఆడపిల్లలను బడికి పంపడానికి తల్లిదండ్రులు సంశయిస్తున్నారు. అదే విధంగా చాలా పల్లెల్లో పాఠశాలలు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండడంతో రాకపోకలకు సంబంధించి తల్లిదండ్రుల్లో ఎన్నో రకాల భయాలున్నాయి. ఈవ్‌టీజింగ్ లేదా మరే పెద్ద, చిన్న సమస్య వచ్చినా స్కూల్/కాలేజ్‌కి గుడ్‌బై చెప్పించేసి ఇంటి దగ్గర కూర్చోబెడుతున్నారు. వీటికి తోడు ఇంగ్లిష్ చదువులు అమ్మాయిలకు ఎందుకనే భావన, ఎప్పటికైనా ఆడపిల్లే కదా.. అనే చులకన లాంటివన్నీ ఆడపిల్లల చదువుకు గండికొడుతున్నాయి. స్వచ్ఛందంగా కదలాలి.. సరిదిద్దాలి.. స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, విద్యావేత్తలతో కలిసికట్టుగా అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతులు చేపట్టాం. కస్తూర్బా బాలికల పాఠశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన నైపుణ్యాలు ఉండవు. అలాంటి వాళ్లకు వందేమాతరం ఫౌండేషన్‌తో కలిసి శిక్షణనిస్తున్నాం. ప్రస్తుతం రాజన్న సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాం. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అంగీకరిస్తే ట్రస్టు ఆధ్వర్యంలో ఆయా పాఠశాలల విద్యార్థులను విభిన్న అంశాల్లో సమర్థులుగా తీర్చిదిద్దేందుకు ట్రిపుల్ ఎల్ (లాంగ్వేజ్, లాజిక్, లెర్నింగ్) పేరుతో లైఫ్‌స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ తీసుకుంటున్నాం. సహజంగా పాఠశాల చివరి పీరియడ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి... దాన్ని ఉపయోగించుకుంటున్నాం. కస్తూర్బా స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని అమలు చేస్తున్నాం. విద్యార్థినులకు గైడెన్స్ అందించేందుకు ‘నిర్మాణ్’ సంస్థతో కలిసి టోల్‌ఫ్రీ నెంబర్(1800–425–2425) ఏర్పాటు చేశాం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కొంతకాలం పనిచేస్తే ఆడపిల్లల చదువుకు అడ్డంకుల్ని అధిగమించొచ్చు. -
స్వచ్ఛంద బోధకులు...
మనవద్ద ఉన్నదేదైనా ఇతరులకు ఇచ్చేస్తూ పోతే చివరకు మనమే లేమిలో కూరుకుపోతాం. డబ్బుదస్కాలకు, ఆస్తిపాస్తులకు ఈ సూత్రం వర్తిస్తుంది. అయితే ఇతరులకు పంచే కొద్దీ పెరిగేది, మనల్ని మరింత ఉన్నతులుగా తీర్చిదిద్దేదీ ఒకటుంది. అదే.. విద్య. దీనిని గుర్తిస్తున్న ‘సిటీ’జనులు వాలంటరీ టీచింగ్‌పై మక్కువ పెంచుకుంటున్నారు. తమ విజ్ఞానాన్ని విద్యార్థులకు పంచడానికి ఆరాటపడుతున్నారు. జీతభత్యాలు లేకున్నా, తమ విలువైన సమయాన్ని బోధన కోసం వెచ్చిస్తూ అమూల్యానుభవాలను పోగు చేసుకుంటున్నారు. స్వచ్ఛంద బోధన చేస్తున్న వారిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మొదలుకొని గృహిణుల వరకు వివిధ నేపథ్యాలకు చెందిన వారు ఎందరో ఉన్నారు. భావితరానికి మార్గదర్శకులుగా ఉంటున్న వీరి అనుభవాలు వారి మాటల్లోనే.. ఆసక్తి ఉంటే చాలు... ఇప్పుడిప్పుడే నగరంలో స్వచ్ఛంద ఉపాధ్యాయ విధులపై ఆసక్తి పెరుగుతోంది. విభిన్న వృత్తి వ్యాపకాల్లో బిజీగా ఉండే వారు సైతం వాలంటరీ టీచింగ్‌కు సై అంటున్నారు. ‘‘మేం కొన్ని నెలల క్రితమే సిటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది పూర్తిగా వాలంటరీ టీచర్ల మీదే ఆధారపడిన కార్యక్రమం తొలుత 10 స్కూళ్లను ఎంచుకున్నాం. అయితే యువత నుంచి వచ్చిన స్పందన అనూహ్యంగా ఉండడంతో... ఏడాదిలోపు 100 స్కూల్స్‌కు మా సేవలు విస్తరింపజేయాలనుకుంటున్నాం’’అని టీచ్ ఫర్ చేంజ్ (www.teachforchange.in, www.facebook.com/teachforchange.officia) ప్రోగ్రామ్ నిర్వాహకులు చైతన్య చెప్పారు. స్కూల్‌డేస్ గుర్తొస్తున్నాయి.. బోయినపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నా. నా క్లాస్‌లో 50 మంది దాకా స్టూడెంట్స్ ఉన్నారు. నేను వెళ్లగానే పిల్లలంతా లేచి గుడ్‌మార్నింగ్ టీచర్ అని విష్ చేస్తుంటే మా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. ఇంగ్లిష్ పాఠాలతో పాటు పిల్లలకు ప్రవర్తన, పరిశుభ్రతలనూ తెలియజేస్తున్నా. మొదట వారానికి ఒకరోజు వెళతానని మాట ఇచ్చా. అయితే, ఈ వ్యాపకానికి ఎంతగా అలవాటు పడ్డానంటే, ఇప్పుడు వారానికి నాలుగైదు రోజులు వెళుతున్నా. టీచింగ్‌ని అద్భుతమైన జాబ్ అని ఎందుకంటారో ఇప్పుడర్థమవుతోంది. -హేమ, గృహిణి. బోయినపల్లి. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా.. వీకెండ్స్‌లో ఫిలింనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి పిల్లలకు పాఠాలు చెబుతున్నా. బస్తీ పిల్లలను హ్యాండిల్ చేయడం, వాళ్లకు అర్థమయ్యేలా విషయాలు చెప్పడం అంత తేలిక కాదు. ఒక్కో సెక్షన్లో 70 మంది వరకు పిల్లలుంటారు. వారి ఆహారం, అలవాట్లు చూశాక నాలో మరింత పట్టుదల పెరిగింది. నా వల్ల ఒక్క స్కూడెంట్ బాగుపడినా చాలు కదా అనుకున్నా. మొదట్లో పిల్లలు సరిగా మాట వినడం లేదని కొంత డిజప్పాయింట్ అయినా, ఇప్పుడిప్పుడే వారిని మచ్చిక చేసుకోవడం ఎలాగో తెలుసుకుంటున్నా. - నివేదిత, ఐటీ అనలిస్ట్, కొండాపూర్. పని ఒత్తిడి హుష్‌కాకి... వీకెండ్స్‌లో క్లాస్‌రూమ్‌లోకి అడుగుపెడుతూనే ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ కలుగుతుంది. పిల్లల నవ్వు ముఖాలు, వారు మనపై చూపే ప్రేమతో అన్ని ఒత్తిళ్లూ మటుమాయమవుతాయి. వారితో నవ్వుతున్నాం, ఆడుతున్నాం.. సింపుల్‌గా పిల్లల్లా మారిపోతున్నాం. ‘టీచ్ ఫర్ చేంజ్’ ద్వారా వాలంటరీ టీచింగ్‌కు అవకాశం వచ్చినప్పుడు చాలా ఉద్వేగంగా అనిపించింది. ప్రస్తుతం కుకట్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థులకు చదువు చెబుతున్నా. బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పిన ‘చెప్పు.. మరచిపోతా. బోధించు.. గుర్తుంచుకుంటా. నేర్పు.. లీనమవుతా’ మాటలను నేను విశ్వసిస్తాను. హడావుడిగా చెప్పేసి, అంతే స్పీడ్‌గా మరచిపోయే పద్ధతికి వ్యతిరేకంగా పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేసే టీచింగ్ మెథడ్స్నే ఫాలో అవుతున్నా. వీకెండ్స్‌లో ఎక్కడెక్కడో గడిపి టైమ్ వృథా చేయడం కంటే సమాజానికి మేలు చేయడం సబబు కదా. - వై.అశోక్, జూనియర్ మేనేజర్, జీఎంఆర్ ఎయిర్పోర్ట్ డెవలపర్స్ లిమిటెడ్.