breaking news
Visvesvararao
-
వ్యక్తిగత మొక్కులకు ప్రజాధనం వృథా
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన వ్యక్తిగత మొక్కుబడులను తీర్చుకునేందుకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృ«థా చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. విజయవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించడం ఆయన వ్యక్తిగత వ్యవహారమని, ఇందుకు ఖజానా నుంచి రూ.5 కోట్ల మేర డబ్బు ఖర్చుచేయడం, ఆయన కుటుంబ సభ్యులను ప్రత్యేక విమానం ద్వారా తీసుకెళ్లడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల ఆ మొత్తాన్ని తిరిగి ఖజానాకు జమచేసేలా కేసీఆర్‌ను ఆదేశించాలని కోరుతూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శిని, వ్యక్తిగత హోదాలో కేసీఆర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ పలు దేవాలయాలను సందర్శించి బంగారు ఆభరణాలను మొక్కుబడులుగా సమర్పిస్తున్నారని పిటిషనర్ తెలిపారు. ఇందులో భాగంగా గత నెల 28న కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లి తమ మొక్కు తీర్చుకున్నారని వివరించారు. ఇందుకైన వ్యయాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించారని తెలిపారు. వజ్రాలు పొదిగిన ముక్కుపుడకను రూ.5 కోట్లు వెచ్చించి తయారుచేసి అమ్మవారికి సమర్పించారన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం కేటాయించాల్సిన నిధులను ఈ విధంగా ఖర్చు చేయడం ఎంత మాత్రం సరికాదన్నారు. అలాగే తిరుమల వేంకటేశ్వరస్వామికి రూ.5 కోట్లు, తిరుచానూరు అమ్మవారికి రూ.45వేలు, వరంగల్ భద్రకాళి అమ్మవారికి రూ.59 లక్షలు వెచ్చించి బంగారు ఆభరణాలు చేయించారని ఆయన తెలిపారు. 2015లో అయుత చండీయాగాన్ని రూ.6 కోట్ల వ్యయంతో నిర్వహించిన కేసీఆర్ ఆ మొత్తాన్ని తన కుటుంబసభ్యులు, తన సంక్షేమం కోరుకునే వ్యక్తులు భరించారని స్వయంగా చెప్పారని, దీనిపై లోతుగా దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. -
నవ తెలంగాణ నిర్మాణమే లక్ష్యం
‘ఆప్’ టీ-మేనిఫెస్టో విడుదల నవ తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం తెలంగాణ మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన ఆరుమాసాల్లోనే జనలోక్పాల్లా లోకాయుక్తను బలోపేతం చేయడంతో పాటు అధికారుల్లో అవినీతి, ప్రజాసమస్యలపై ఫిర్యాదుల స్వీకారం కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక హెల్ప్‌లైన్ సర్వీసును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. పార్టీ తెలంగాణ కమిటీ కన్వీనర్ ఆర్.వెంకట్‌రెడ్డి, సభ్యులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, సభ్యులు గోసుల శ్రీనివాస్ యాదవ్, వ్యవసారరంగ నిపుణుడు రామాంజనేయులు, తదితరులు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. గ్రామీణ ఆరోగ్యానికి పెద్దపీట వేయడంతో పాటు ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి నిమ్స్ తరహా ఆస్పత్రుల నిర్మాణం చేయనున్నట్లు ప్రకటించింది. వ్యవసాయానికి ఏడు గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు 300 యూనిట్లలోపు విద్యుత్ వాడే చిన్నతరహా పరిశ్రమలకు బిల్లులో 50 శాతం రాయితీ, 100 లోపు యూనిట్ల విద్యుత్ వాడే గృహాలకు, వాణిజ్య సంస్థలకు ఉచిత సరఫరా వంటి అంశాలను మేనిఫెస్టోలో రూపొందించింది