విమానాశ్రయంలో సందర్శకులపై నిషేధం
స్వాతంత్య్ర దినోత్సవాల నేపథ్యంలో...
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సందర్శకుల రాకపోకలపై నిషేధం విధించారు. కేవలం విమానంలో ప్రయాణించే వారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. వారితో పాటు వచ్చే బంధువులు, స్నేహితులను మాత్రం లోనికి అనుమతించరు. ఈ నిషేధాజ్ఞలు ఈ నెల 5 నుంచి 20 వరకు అమల్లో ఉంటాయి. నిఘా సంస్థల హెచ్చరికలతో కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో బందోబస్తును మరింత పటిష్టం చేసిన విషయం తెలిసిందే. విమానాశ్రయాల్లో రెడ్అలర్ట్ కూడా ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవాల నేపథ్యంలో ఉగ్రవాదులు విజిటర్స్ పాసులు, ప్రవేశ టికెట్లు ఖరీదు చేసి లోనికి వచ్చి విధ్వంసం చేసే అవకాశాలు ఉన్నాయనే అనుమానంపై ఈ నిషేధం విధించినట్లు తెలిసింది.