breaking news
Vishwa Guru
-
సరైన విజన్‌తో విశ్వగురువుగా అవతరిస్తాం
న్యూఢిల్లీ: భారత్ విశ్వగురువుగా, సూపర్ ఎకానమీగా అవతరించాలంటే అందుకు భవిష్యత్ అభివృద్ధికి సంబంధించి దార్శనికత అవసరమని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 11వ నాయకత్వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. టెక్నాలజీ, ఆర్థికంగా లాభసాటి, ముడి సరకుల లభ్యత, తుది ఉత్పత్తుల మార్కెట్‌కు ఆధారంగా నిలిచే పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు. ఎగుమతుల మార్కెట్ సామర్థ్యాలను అర్థం చేసుకోవాలంటూ.. వ్యవసాయం, అనుబంధ రంగాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. బ్లూ ఎకానమీలో (సముద్ర, తీర ప్రాంత వనరుల ఆధారిత)ఒక్క మత్స్యరంగమే రూ.7 లక్షల కోట్ల మార్కెట్‌గా అవతరించగలదన్నారు. ఇందులో సగం మేర ఎగుమతులు చేయొచ్చన్నారు. నాణ్యతలో రాజీ పడకుండా ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవాలని మంత్రి సూచించారు. సవాళ్లను ఎదుర్కోగలం ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాన్ని భారత్ ఎదుర్కోగలదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. పరిపూర్ణత కలిగిన ప్రజాస్వామ్యం, దౌత్యం, వైవిధ్యం, నిర్ణయాత్మక చర్యలతో దీన్ని అధిగమిస్తామని చెప్పారు. ఏఐఎంఏ సదస్సులో భాగంగా మంత్రి సింధియా మాట్లాడారు. ‘‘భారత్ నేడు పలు దేశాలతో సంప్రదింపులు నిర్వహించగలదు. హర్మూజ్ జలసంధి ద్వారా భారత్ ఓడలు నేడు తీరాలకు చేరుకుంటున్నాయి’’అని మంత్రి సింధియా వివరించారు. ప్రతీ గ్రామాన్ని బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించేందుకు ప్రభుత్వం రూ.1.39 లక్షల కోట్లను ఖర్చు చేస్తోందని చెప్పారు. దీంతో బ్రాడ్‌బ్యాండ్ వృద్ధి 10 శాతం పెరుగుతుందన్నారు. వచ్చే ఐదు, పదేళ్లలో భారత్ జీడీపీ పరిమాణం మరో 1.5–2 ట్రిలియన్ డాలర్లు పెరుగుతుందన్నారు. కీలక ఖనిజాలు ఎంతో అవసరం భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇంధన వనరుల్లో వైవిధ్యం, కీలక ఖనిజాల లభ్యత ఎంతో అవసరమని టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సవాళ్లు సహజమేనన్నారు. వైవిధ్యంలోనూ సమస్యలు ఉన్నాయంటూ.. దిగుమతులపై ఆధారపడడం కాకుండా, అవి నిరాటంకంగా సాగేలా రాజకీయ సమ్మతి కూడా అవసరమేనన్నారు. ప్రపంచం విశ్వసనీయమైన భాగస్వాముల కోసం చూస్తోందంటూ.. భారత్ ఎగుమతుల్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోగలదన్నారు. ఏఐతో కలసి నడవాల్సిందే.. వచ్చే దశాబ్ద కాలాన్ని కృత్రిమ (ఏఐ) మేధ శాసించనుందని.. ఏఐని సది్వనియోగం చేసుకునేందుకు, ఏఐ ఆధారిత టెక్నాలజీలకు మారేందుకు నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడంతోపాటు విద్యా సంస్కరణలు అవసరమని వెటరన్ బ్యాంకర్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ కేవీ కామత్ అభిప్రాయపడ్డారు. ఖరీదైన ఫౌండేషన్ మోడళ్ల కంటే వాస్తవ పరిష్కారాలపై భారత్ దృష్టి సారించాలని సూచించారు. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను సృష్టించడం కాకుండా, వాటి అవసరం ఎక్కడో ఉందో చూడాలన్నారు. ఏఐ సామర్థ్యాల పెంపునకు, వ్యయాల తగ్గింపునకు, కస్టమర్లకు మెరుగైన అనుభవానికి సాయపడుతుందని చెప్పారు. స్కూళ్లు, కాలేజీల నుంచి వచ్చే విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వాలని, పాఠ్యాంశాల్లో సమగ్రమైన మార్పు కూడా అవసరమేనన్నారు. ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. భారత్‌లో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు నియంత్రిత పరిధిలో ఉన్నట్టు చెప్పారు. సంక్షోభాలతో అవకాశాలు: శక్తికాంతదాస్ అంతర్జాతీయ సంక్షోభా ల్లో భారత్ స్థిరంగా నిలబడడమే కాకుండా, వాటిని అవకాశాలుగా మలుచుకుని మరింత బలంగా అవతరించినట్టు ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. రియల్ జీడీపీ వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతంగా (అంచనా) ఉన్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు గత ఐదేళ్లలో సగటు వృద్ధి 7.8 శాతంగా ఉండడాన్ని గుర్తు చేశారు. స్థూల ఆర్థిక స్థిరత్వం, విధానాల్లో నిలకడ, మౌలిక వసతుల ఆధారిత వృద్ధి, బలమైన దేశీ వినియోగ డిమాండ్‌ను దాస్ ఏఐఎంఏ సదస్సులో భాగంగా ప్రస్తావించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అస్థిరతలు, సరఫ రా వ్యవస్థలో అవరోధాలు, వృద్ధిలో అసమానతలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోందని.. ఈ రిస్క్‌లు ప్రతికూలంగా ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం నియంత్రణకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ.. ఆర్థిక స్థిరత్వానికి ఇది ఎంతో ముఖ్యమన్నారు. వేగవంతమైన డిజిటలైజేషన్, తయారీ రంగ వృద్ధిని గుర్తు చేశారు. కరోనా విపత్తు సమయంలో ఆర్బీఐ గవర్నర్‌గా (2018 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్) దాస్ పాలసీ చర్యలతో ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలవడం తెలిసిందే. -
సంస్కృతాన్ని సంరక్షిద్దామన్న హిమాచల్ సీఎం..
సిమ్లాః ప్రాచీన సంస్కృత భాషను సంరక్షించడం తక్షణావసరమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచంలోని అన్ని భాషలకు ప్రధానమైన... తల్లిలాంటి సంస్కృతభాష.. మన సంస్కృతి కూడా అని ఆయన గుర్తు చేశారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలతోపాటు.. అనేక గ్రంథాలు.. దేవభాషగా చెప్పే సంస్కృతంలోనే లిఖించబడి ఉన్నాయని, అందుకే సంస్కృతాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సింగ్ తెలిపారు. 'సమాజం, దేశం అభివృద్ధిలో సంస్కృతం పాత్ర' పై సోలాన్ లో జరిగే మూడు రోజుల జాతీయ సంస్కృత సెమినార్ కు ఆయన అధ్యక్షత వహించారు. భారత దేశాన్ని 'విశ్వ గురు' గా నిలిపేందుకు, పురాతన భారతీయ నాగరికత పరిణామం గురించి తెలుసుకునేందుకు సంస్కృతం ఎంతగానో సహకరించిందని ఆయనన్నారు. మన సంప్రదాయాలు, సంస్కృతితోపాటు.. పురాతన భాషను సంరక్షించడం తక్షణావసరమని వీరభద్రసింగ్ పేర్కొన్నారు. సంస్కృత భాషలో లిఖించిన భారత ఇతిహాసాలు, మహాకావ్యాలు ఇతర భాషల్లో సైతం అనువదిస్తున్నారని, అధ్యయనాలు చేపడుతున్నారని, సంస్కృతాన్ని పశ్చిమాన ఓ విదేశీ భాషగా కూడా చదువువుతున్నారని.. అటువంటిది మనం సంస్కృతాన్ని విస్మరించడం తగదని సింగ్ అభిప్రాయపడ్డారు. సంస్కృత భాషపై యువతకు ఆసక్తి తగ్గుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో భారత భాషల విశిష్టతను తెలుపుతూ.. వాటి అధ్యయనానికి యువతను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సంస్కృతంలో ఉన్నత విద్య చదివాలనుకున్నవారికి తమ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పిన సింగ్.. రాష్ట్రంలో భాషను ప్రచారం చేస్తున్న పండితులను కొనియాడారు.


