breaking news
Village panchayat development
-
పల్లెకూ పద్దు..
సాక్షి, అమరావతి: దేశ, రాష్ట్ర బడ్జెట్ల మాదిరిగానే రాష్ట్రంలో 13,029 గ్రామ పంచాయతీలకు వేర్వేరుగా ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందించారు. దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)ల పేరుతో గ్రామ స్థాయి బడ్జెట్‌ను రూపొందించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. అందుకనుగుణంగా దేశవ్యాప్తంగా మే 1 నుంచి జూన్ 15 వరకు గ్రామ పంచాయతీల వారీగా జీపీడీపీల ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది. మన రాష్ట్రంలో 13,066 గ్రామ పంచాయతీలు (ఇటీవల కొత్తగా ఏర్పడిన వాటిని కలుపుకుంటే మొత్తం 13,371 గ్రామ పంచాయతీలు) ఉండగా, 13,029 గ్రామ పంచాయతీల్లో జీపీడీపీలను రూపొందించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన 37 గ్రామ పంచాయతీలను ఇటీవల వాటి సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో ఆయా చోట్ల జీపీడీపీ రూపకల్పన జరగలేదు. –కేంద్రం.. రాష్ట్రాలకు విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో సగం మొత్తాన్ని జీపీడీపీల రూపకల్పన, అమలు ఆధారంగానే విడుదల చేస్తుంది. –ఏడాదిలో ఒక్కో గ్రామ పంచాయతీకి సొంత పన్నుల రూపంలో ఎంత ఆదాయం వస్తుంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంత మొత్తంలో ప్రత్యేక నిధులు అందుతాయి.. వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామ పరిధిలో ఎంత మేర నిధులు వచ్చే అవకాశం ఉందనే అంశాలను పరిగణనలోకి తీసుకొని, గ్రామానికి అందే మొత్తం నిధులతో ఏడాది కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో ఒక్కో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు ఖరారు చేశాయి. –2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి గ్రామ పంచాయతీల వారీగా జీపీడీపీల రూపకల్పన కొనసాగింది. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల్లో ప్రాధాన్యతనిచ్చిన అంశాలు.. ► 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి రావడంతో కొత్త నిబంధనలతో కేంద్రం.. రాష్ట్రాల వారీగా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించింది. ► రాష్ట్రాల వారీగా జరిగిన నిధుల కేటాయింపు, మారిన నిబంధనల మేరకు తిరిగి మరోసారి 2020–21కి రివైజ్డ్ జీపీడీపీలు ఖరారు చేశారు. ► 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి అందే నిధుల్లో అంచనాగా 50 శాతం మొత్తాన్ని గ్రామంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా వ్యవస్థలను మెరుగుపరచడానికి, భూగర్భజలం పెరగడానికి దోహదపడే కార్యక్రమాలకు కేటాయించారు. ► మిషన్ అంత్యోదయ కార్యక్రమంలో భాగంగా ఏటా గ్రామ పంచాయతీల్లో వసతులపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సర్వే నిర్వహిస్తుంది. దీని ద్వారా ఏ గ్రామంలో ఎలాంటి సమస్యలున్నాయో గుర్తిస్తుంది. ► సర్వే ద్వారా ఆ గ్రామంలో కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. -
ఆపరేషన్ ‘పన్ను’
* బకాయిల వసూలుకు కార్యాచరణ * మండలానికో ప్రత్యేక బృందం ఏర్పాటు * వారం రోజులలోనే రూ.13 కోట్లు కలెక్షన్ * 250 పంచాయతీలలో వంద శాతం సేకరణ లక్ష్యం * నిర్లక్ష్యంగా ఉన్న కార్యదర్శులకు నోటీసులు జారీ ఇందూరు : మార్చి 31 వరకు 250 పంచాయతీలలో వంద శాతం పన్నులు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అందుకోసం గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రజలు చెల్లించిన పన్నులతోనే గ్రామ పంచాయతీల అభివృద్ధికి గట్టి పునాది పడుతుందనే నినాదంతో, పేరుకుపోయిన బకాయిలను వసూలుచేయ డానికి జిల్లా పంచాయతీ శాఖ నడుం బిగించింది. సంవత్సరాల తరబడి పన్నులు చెల్లించనివారిని నిద్ర లేపి మరీ పన్నులు చెల్లించేలా వసూళ్ల డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి డీపీఓ కృష్ణమూర్తి సారథ్యం వహిస్తున్నారు. జిల్లాలో 36 మండలాలు 718 పంచాయతీలుండగా,ఇందులో మొదటి దశగా 250 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. వారం రోజుల క్రితం ‘ఆపరేషన్ పన్ను’ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. తగిన కార్యాచరణ రూపొందించి మండాలనికో బృం దాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్, కారోబార్, ఈఓపీఆర్డీ ఉంటారు. బృందానికి ఈఓపీఆర్డీ సారథ్యం వహిస్తారు. ప్రతీ మండలంలో ఐదుకు పైగా గ్రామాల నుంచి వంద శాతం బకాయి పన్నులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటారు. ప్రజలలో అవగాహన కల్పిండంతోపాటు మైకు సెట్ల ద్వారా, డప్పు చాటింపు. మహిళా సంఘాల ద్వా రా చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పటికే బకాయిదారులకు డిమాండ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నోటీసుల ద్వారా పన్నులు చెల్లిస్తే సరి, లేదంటే ఏదో ఒక సౌకర్యాన్ని నిలిపివేస్తామని హెచ్చరిక కూడా జారీ చేశారు. డివిజన్ స్థాయిలో డీఎల్పీఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షించేందుకు డీపీఓ ఆధ్వర్యంలో ఓ బృందం ఏర్పాటైంది. మూడు రోజుల క్రితం స్వయంగా డీపీఓనే కందకుర్తి గ్రామంలో పర్యటించి పన్నుల వసూళ్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రజలకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. తక్కువ సమయంలోనే రూ.13కోట్ల కలెక్షన్ పంచాయతీ శాఖ చేపట్టిన ‘ఆపరేషన్ పన్ను’ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. వారం రోజులలోనే రూ.13 కోట్ల వర కు బకాయిలను వసూలు చేసి భేష్ అనిపించుకున్నారు. ఇదే స్పూర్తితో మార్చి 31 నాటికి 250 గ్రామ పంచాయతీలలో వందకు వంద శాతం పన్నులు వసూలు చేయాలని సిబ్బం దికి ఆదేశాలు ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు నీటి, ఇంటి, లైటింగ్, మురికి కాలు, గ్రంథాలయ, సంత వే లం, తదితర పన్నులు కట్టకపోవడంతో రూ.52 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ మొత్తం వసూలైతే, అభివృద్ధి నిధులకు లోటుండదు. ప్రజలకు సౌకర్యాలు అందుతాయి. కార్యదర్శులకు, మండలాధికారులకు నోటీసులు ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడానికి పంచాయతీ శాఖ అధికారులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. పన్నుల వసూళ్లలో వెనుకంజలో ఉన్న పంచాయతీ కార్యదర్శులకు, మండలాధికారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. నిర్లక్ష్యం చేసినవారిపై చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. కార్యదర్శులు స్థానికంగా ఉండాలని, ఇన్ చార్జ్‌లుగా ఉన్న పంచాయతీలు కాకుండా, సొంతగా పనిచేస్తున్న పంచాయతీలలో వంద శాతం పన్నులు రాబట్టాలని పక్కా ఆదేశాలిచ్చారు. ఎప్పటికప్పుడు వారి పనితీరును గమనిస్తున్నారు. లోటుపాట్లను సరిదిద్దుతున్నారు. ప్రజలు సహకరించి పన్నులు కట్టాలి గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలలో పేరుకు పోయిన బకాయి పన్నులను వసూలు చేయడానికి ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రజలు సహకరించి పన్నులు చెల్లించాలి. ప్రజలు చెల్లించే పన్నులు గ్రామాభివృద్ధికి ఉపయోగపడుతాయనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి. -కృష్ణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి