videographer
-
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
పహల్గాం/న్యూఢిల్లీ: ఒక ఫొటోగ్రాఫర్ చెట్టు మీది నుంచి తీసిన వీడియో పహల్గాం ఉగ్ర ఘటన దర్యాప్తులో కీలకంగా మారింది. అలాగే ఘటన సమయంలో కుటుంబంతో కలిసి అక్కడికి విహారయాత్రకు వచ్చిన ఒక సైనికాధికారి ప్రత్యక్ష సాక్షిగా ఇచ్చిన వాంగ్మూలం కూడా దర్యాప్తు అధికారులకు ఎంతో సాయపడుతోంది. నాటి ఘటన క్రమాన్ని ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు పహల్గాం ఘటన దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వీకరించింది. ఆదివారం జమ్మూలో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించింది. ఐజీ, డీఐజీ, ఎస్పీలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఘటన జరిగిన రోజు నుంచే స్థానిక పోలీసులకు దర్యాప్తులో ఎన్ఐఏ బృందం సాయపడటం తెల్సిందే. దాడి నుంచి బయటపడి స్వస్థలాలకు వెళ్లిన పర్యాటకుల నుంచి వేర్వేరు బృందాలు వాంగ్మూలాలను సేకరిస్తున్నాయి. సైన్యాధికారి ఏం చెప్పారంటే... లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న సైనికాధికారి కాల్పుల వేళ తన కుటుంబాన్ని సురక్షిత ప్రాంతంలో దాచేశారు. ఉగ్రవాదులు ఎటు నుంచి వచ్చారు, తొలుత ఎవరిని చంపారు, తర్వాత ఎటు వెళ్లారు వంటి వివరాలను వాంగ్మూలంలో చెప్పారు. ‘‘తొలుత ఇద్దరు ఉగ్రవాదులు చిన్నపాటి దుకాణాల వెనుక నుంచి హఠాత్తుగా వచ్చి పర్యాటకులను ‘కల్మా’ చదవాలని ఆదేశించారు. చదవని నలుగురిని తలపై కాల్చిచంపారు. దాంతో అంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఉగ్రవాదులు వారి తల, గుండెకు గురి చూసి కాల్చడంతో మరికొందరు చనిపోయారు. కాసేపటికే మరో ఇద్దరు ఉగ్రవాదులు అడవి నుంచి బయటికొచ్చి పర్యాటకులపైకి కాల్పులకు దిగారు’’ అని ఆయన వివరించినట్టు సమాచారం. కాల్పుల ఘటనను ఉగ్రవాదులు తమ బాడీ క్యామ్‌లలో రికార్డ్ చేసుకున్నట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. యువ నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ పెళ్లయిన ఆరు రోజులకే దాడిలో చనిపోవడం తెలిసిందే. దాంతో ఆయన భార్య హిమాన్షీ గుండెలవిసేలా రోదిస్తూనే ఫోన్ చేసి పోలీసులకు వెంటనే సమాచారమిచ్చారు. దాడిపై వారికి వచ్చిన తొలి కాల్ అదే. దాంతో పహల్గాం పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. 22 గంటలు ట్రెక్కింగ్ చేసొచ్చి చంపారు భద్రతా బలగాల కంటబడకుండా ఉండేందుకు ఉగ్రవాదులు రోడ్డు మార్గంలోకాకుండా అత్యంత ప్రతికూలమైన, ప్రమాదకర పర్వత సానువుల గుండా వచ్చినట్టు వెల్లడైంది. కోకెర్నాగ్ అటవీ ప్రాంతం గుండా 22 గంటలు ట్రెక్కింగ్ చేసి మరీ బైసారన్ చేరుకున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పర్యాటకులను కాల్చే క్రమంలో ఒక స్థానికుడు, మరో పర్యాటకుడి నుంచి వాళ్లు మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. తిరిగి వెళ్తూ వాటిని మార్గమధ్యంలో ధ్వంసం చేశారని తెలుస్తోంది. దాడిలో ఏకే 47, ఎం4 మెషీన్గన్లు వాడినట్టు జాగా ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. ప్రాణభయంతో చెట్టెక్కి, వీడియో తీసి...ఉగ్రవాదులు దాడికి దిగిగినప్పుడు అక్కడే ఉన్న స్థానిక ఫొటోగ్రాఫర్ ఒకరు ప్రాణభయంతో చెట్టెక్కి కొమ్మల్లో నక్కారు. అలా వారి కంట పడకుండా తప్పించుకున్నారు. కళ్లెదుటే అమాయక పర్యాటకులపై విచక్షణారహితంగా తూటాల వర్షం కురిపించిన తీరును కెమెరాలో బంధించారు. దాడి క్రమాన్ని స్పష్టంగా పట్టిచ్చిన ఆ వీడియో ఎన్ఐఏ దర్యాప్తులో కీలకంగా మారింది. -
గంజాయి ఆరోపణలు.. వీడియోగ్రాఫర్ ఆత్మహత్య
సాక్షి, బెంగళూరు: యువకుడిపై గంజాయి ఆరోపణలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై డెత్‌నోటు రాసి పెట్టి ఉరి వేసుకొన్నాడు. మృతుడు అభిషేక్ (23) వీడియోగ్రాపర్గా పనిచేసేవాడు. స్నేహితునికి ఇచ్చిన అప్పును వసూలు చేసుకోవాలని అభిషేక్ అక్కడికి వెళ్ళిన సమయంలో కొందరు గంజాయి తాగుతుండగా పోలీసులు వచ్చి అందరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. నీవు కూడ గంజాయి తాగుతావా అని అభిషేక్‌ని ప్రశ్నించారు. తాగలేదని చెప్పడంతో ఇంటికి పంపించారు. విచారణకు అవసరమైతే మళ్లీ రావాలని సూచించారు. ఈ సంఘటనతో తీవ్రంగా మథనపడ్డాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కానీ ఇలాంటి ఆరోపణలు రావడం భయంగా ఉందని, ఇప్పటివరకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భరించానని, కానీ ఎలాంటి తప్పు చేయకున్నా గంజాయి తాగినట్లు పట్టుకుని వెళ్లడాన్ని తట్టుకోలేకపోతున్నానని పేర్కొన్నాడు. ఈ మేరకు సుసైడ్ లెటర్ రాసి ఉరి చేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అశోకపురం పోలీసులు పరిశీలించి ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. -
చీకట్లో నల్ల చిరుత.. అలా బంధించే హక్కు ఎవడిచ్చాడు?
వైరల్: నల్ల చిరుత.. చాలా అరుదుగా కనిపించే ప్రాణి. అలాంటి ప్రాణి వేటాడే దృశ్యాలు ఇంకా అరుదుగా కనిపించే దృశ్యమనే చెప్పాలి. అయితే అలాంటి అరుదైన సందర్భాన్ని బంధించే క్రమంలో.. ఓ వీడియోగ్రాఫర్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ నల్ల చిరుత.. ఓ జింకను వేటాడి దాని కళేబరాన్ని నోట కరుచుకుని వెళ్లబోతోంది. అయితే ఆ సమయంలో ఓ వీడియోగ్రాఫర్ దాన్ని చిత్రీకరించే యత్నం చేశాడు. అక్కడిదాకా బాగానే ఉన్నా.. ఫోకస్ లైట్ వేసి మరీ వాహనం శబ్దం చేయడంతో అది ఉలిక్కిపడి అక్కడి నుంచి పరుగులు తీసింది. ఇంతలో.. అక్కడే ఉన్న సాధారణ చిరుత ఆ కళేబరాన్ని నోట కరుచుకుని అక్కడి నుంచి పరారైంది. పర్ఫెక్ట్ క్యాప్చర్ అంటూనే.. స్పాట్ లైట్ యొక్క పూర్తి కాంతిలో ప్రకృతి యొక్క ఈ అరుదైన క్షణాలను సంగ్రహించే హక్కు ఎవడిచ్చాడు అంటూ ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి సుశాంత్ నంద ఆ వీడియోను పోస్ట్ చేశారు. A perfect capture. Both by the leopard & the videographer😞😞 But who gave the right to capture these rare moments of nature in full glare of spot light? WA fwd. pic.twitter.com/ZITOBOpO92 — Susanta Nanda (@susantananda3) October 8, 2022 ఎక్కడ, ఎప్పుడు జరిగిదో తెలియదు. ఎవరి ఆ క్షణాల్ని బంధించారో తెలియదు. కానీ, ఆ వీడియోగ్రాఫర్ చేష్టలపై సర్వత్రా ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. -
నీటమునిగి వీడియోగ్రాఫర్ మృతి
కదిరి అర్బన్: కదిరిలోని నల్లగుట్టవీధికి చెందిన వీడియోగ్రాఫర్ వీరనారాయణ (24) మంగళవారం ముత్యాలచెరువు గ్రామంలోని చెరువులో నీటమునిగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వీరనారాయణ పట్టణంలోని రాము ఫొటో స్టూడియోలో వీడియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం స్నేహితులతో కలిసి సరదాగా ముత్యాలచెరువు గ్రామంలోని చెరువులో ఈతకెళ్లాడు. నీటి మధ్యలోకి వెళ్లాక ఊపిరాడక మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నాలుగు నెలల కిందటే వీరనారాయణకు వివాహమైంది. భర్త మృతి చెందిన విషయం తెలుసుకున్న భార్య నందిని బోరున విలపించింది. -
వీడు సామాన్యుడు కాదు..
ఫొటో షూట్స్ పేరుతో వీడియోగ్రాఫర్లకు టోకరా జంట కమిషనరేట్లలో 10 కెమెరాల చోరీ నిందితుడిని అరెస్టు చేసిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ రూ.20.25 లక్షల విలువైన సొత్తు స్వాధీనం సిటీబ్యూరో: ఆన్లైన్లో ఫొటో, వీడియోగ్రాఫర్ల వివరాలు సేకరించడం... ఫోటో/వీడియో షూట్స్ పేరుతో వారిని రప్పించడం... ‘ఫ్రెష్’ అయి రమ్మంటూ కెమెరాలతో ఉడాయించడం... ఈ పంథాలో జంట కమిషనరేట్లలో 10 నేరాలు చేసిన ఘరానా దొంగను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడితో పాటు రిసీవర్‌ను పట్టుకున్నామని, వీరి నుంచి రూ.20.25 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బి.లింబారెడ్డి మంగళవారం తెలిపారు. ఆది నుంచి నేరజీవితమే... అనంతపురం జిల్లా నల్లచెరువు ప్రాంతానికి చెందిన దేవరింటి వినోద్‌కుమార్‌రెడ్డి అలియాస్ వినోద్ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. 2004లో హైదరాబాద్ వచ్చిన అతను చిన్నచిన్న ఉద్యోగాలు చేసినా జీతం చాలక సెల్‌ఫోన్ చోరీలు ప్రారంభించాడు. ఇతడిపై మొత్తం 22 కేసులు నమోదు కావడంతో పాటు కేపీహెచ్బీలో నమోదైన రెండు, నారాయణగూడలో నమోదైన ఏడు కేసుల్లో శిక్ష కూడా పడింది. వినోద్‌పై నల్లచెరువు పోలీసుస్టేషన్లో హిస్టరీ షీట్ సైతం ఉంది. హోటల్లో బస చేసి లాడ్జిల్లో చోరీ... 2014 నుంచి మళ్లీ నగరానికి రావడం ప్రారంభించిన ఇతను నాంపల్లిలోని ప్యాలెస్ హోటల్లో బస చేసేవాడు. ఈసారి పంథా మార్చుకుని డిజిటల్, వీడియో కెమెరాలపై కన్నేశాడు. వీటిని తస్కరించడానికి అతను రెండు ‘మార్గాలు’ అనుసరించాడు. నగరంలోని ఫొటో స్టూడియోలకు వెళ్లి ఉద్యోగం కావాలంటూ హెల్పర్‌గా చేరేవాడు. రెండుమూడు రోజుల పాటు యజమాని కదలికల్ని గమనించి అదును చూసుకుని కెమెరాలు, ఉపకరణాలతో ఉడాయించే వాడు. మరోపక్క ఆన్లైన్లో ఓఎల్ఎక్స్, జస్ట్‌డయల్ తదితర సైట్ల ద్వారా ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల నెంబర్లు సేకరించే వాడు. వారిని సంప్రదించి ఫోటో/వీడియో షూట్ ఉందంటూ రవీంద్రభారతి, చార్మినార్, గోల్కొండ తదితర ప్రాంతాలకు రప్పించేవాడు. షూట్ ప్రారంభానికి ముందో, పూర్తయిన తర్వాతో వారిని లాడ్జికి తీసుకువెళ్లేవాడు. ఫ్రెష్ అయి వస్తాననో, ఫ్రెష్ అవమంటూనో చెప్పి కెమెరాలతో జారుకునేవాడు. ఇలా నగరంలోని గోపాలపురం, కాచిగూడ, రామ్‌గోపాల్‌పేట, బంజారాహిల్స్, సైఫాబాద్, అంబర్‌పేట, సరూర్‌నగర్, నేరేడ్మెట్, రాజేంద్రనగర్‌లతో పాటు నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలోనూ 10 చోరీలు చేశాడు. ఎట్టకేలకు చిక్కిన నిందితుడు... ఇలా చోరీ సొత్తును పి.లక్ష్మిదాస్ గౌడ్ అనే వ్యక్తికి తక్కువ రేటుకు విక్రయించి సొమ్ము చేసుకునే వాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి, ఎస్సైలు వి.కిషోర్, ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్ తమ బృందాలతో వలపన్నారు. మంగళవారం వినోద్‌తో పాటు రిసీవర్‌గా వ్యవహరించిన దాస్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.50 వేల నుంచి రూ.5.5 లక్షల వరకు విలువైన 12 డిజిటల్, ఐదు వీడియో కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని గోపాలపురం పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ తెలిపారు. -
నిఘా నీడలో అభ్యర్థులు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సార్వత్రిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది బరిలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థుల వ్యయం హద్దులు దాటుతోంది. ఏదోవిధంగా గెలిచి తీరాలనే పట్టుదల వారిని వివిధ రకాల ఖర్చులకు పురిగొల్పుతోంది. వీరి వ్యయం మితిమీరితే ఎన్నికల ప్రశాంత వాతావరణానికి భంగం కల్గే అవకాశం ఉన్నందునా జిల్లా అధికార యంత్రాంగం నిఘాను మరింత ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు జరుగుతున్న పర్యవేక్షణ, వ్యయ వివరాలను షాడో రిజిష్టర్‌లో సక్రమంగా నమోదు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అలసత్వం తగదని సంబంధిత అధికారులను హెచ్చరించారు. అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమ రికార్డింగ్, ఖర్చు అంచనా, ఆధారాల సేకరణ, షాడో రిజిష్టర్‌లో నమోదుపై తదితరవాటిపై నియోజకవర్గాల వారీగా సహాయ వ్యయ పరిశీలకులు, అకౌంటింగ్ టీములతో కలెకక్టర్ బుధవారం కాన్ఫరెన్స్‌హాలులో సమీక్ష నిర్వహించారు. ఆదోని తదితర నియోజకవర్గాల్లో నామినేసన్ల కార్యక్రమాన్ని వీడియో తీయలేదని, ఖర్చుల వివరాలు నమోదు చేయలేదనే సమాధానాలు రావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యయంపై గట్టి నిఘా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తున్నా క్షేత్ర స్థాయిలో ఇలా ఉంటే ఎలా ఆంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సంబంధిత రిటర్నింగ్ అధికారి అనుమతితో వీడియో గ్రాఫర్‌ను ఏర్పాటు చేసుకోండి. సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలతో సహా అభ్యర్థులు నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని రికార్డింగ్ చేసి ఆధారాలతో సహా షాడో రిజిష్టర్‌లో నమోదు చేయండి’ అని కలెక్టర్ ఆదేశించారు. వాహనాలు లేవని, ఉన్నా డీజిల్ వేయడం లేదని కొందరు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆర్వోలకు చెప్పి పరిష్కరిస్తామని కలెక్టర్ సమాధానమిచ్చారు. అభ్యర్థుల ఖర్చుకు సంబంధించిన రికార్డులను మూడు రోజులకోసారి విధిగా పరిశీలించాలని సూచించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఆడిట్ అధికారి జి.రామచంద్రారెడ్డి, జిల్లా సహకార అధికారి సుబ్బారావు, ఆదాయపు పన్ను శాఖ అధికారి శివానందం తదితరులు పాల్గొన్నారు.