breaking news
Videogames
-
వీడియో గేమ్స్ ఎంత సేపు?
మిగతావారితో పోలిస్తే వీడియోగేమ్స్ ఆడే పిల్లల్లో వేలి కదలికల నైపుణ్యం... ఎదురుగా కనిపించే అంశాలపట్ల స్పందించే వేగం పెరుగుతాయి. ఫలితంగా మార్కులు కూడా మెరుగుపడతాయి. అయితే వీడియో గేమ్స్‌కు ఆరోగ్యకరమైన పరిమితి ఎంత అనే అంశాలపై పరిశోధన నిర్వహిస్తున్నారు బార్సెలోనా లోని ‘హాస్పిటల్ డెల్మార్’కు చెందిన వైద్యనిపుణుల్లో ఒకరైన డాక్టర్ జీసస్ పూజోల్. ‘‘వీడియోగేమ్స్ వల్ల పిల్లల్లో మోటార్ స్కిల్స్, రియాక్షన్ స్పీడ్ మెరుగుపడతాయి. అయితే దీనికి తప్పక పరిమితి ఉండాల్సిందే’’ అంటారాయన. బార్సిలోనాకు చెందిన 2,400 మంది పిల్లలపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం వీడియో గేమ్స్ ఆడాల్సిన వ్యవధి వారానికి తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు ఉండవచ్చంటున్నారు. అయితే ఈ వ్యవధి వారానికి పదకొండు గంటలకు మించితే మళ్లీ ప్రమాదమని పేర్కొంటున్నారు. ఇలా వారానికి పదకొండు గంటల కంటే ఎక్కువగా వీడియోగేమ్స్‌లో నిమగ్నమయ్యే పిల్లలకు మళ్లీ కొన్ని సమస్యలు వస్తాయంటున్నారు. ‘‘ఈ ఆరోగ్యకరమైన పరిమితికి మించి ఆడే పిల్లల్లో ఒంటరిగా ఉండిపోవడం, హింసాప్రవృత్తి పెరగడం వంటి అవాంఛితమై అంశాలు చోటు చేసుకుంటాయి’’ అంటున్నారు ఆ నిపుణుడు. -
పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచడం ఎలా?
మాక్సిమైజింగ్ ద మెమరీ మా పిల్లలు ఈ సమ్మర్లో టీవీ చూడటం, వీడియోగేమ్స్ ఆడటం మినహా ఏం చేయడం లేదు. వారికి జ్ఞాపకశక్తి పెరిగేలా ఏవైనా చిట్కాలు ఉంటే చెప్పగలరు. - మోహన్‌రావు, హైదరాబాద్ పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి ఎన్నో మేధోపరమైన వ్యాయామాలు ఉన్నాయి. ఉదాహరణకు జ్ఞాపకశక్తి పెంచే పజిల్స్‌ను సాల్వ్ చేయడం, గళ్లనుడికట్టు పజిల్స్ నింపడం, సుడోకు వంటి నెంబర్ల ప్రమేయంతో ఉండే ఆటలు ఆడటం ఒక మార్గం. వాటితో పాటు అనేక ఇతర అంశాలను ప్రాక్టీస్ చేయడం కూడా జ్ఞాపకశక్తిని పెంచడానికి దోహదపడతాయి. వాళ్లలో సమస్యను పరిష్కరించడం, సృజనాత్మక శక్తిని పెంచడం కోసం కొన్ని సామాజిక సమస్యలను వాళ్ల ముందు పెట్టి, సమాధానాలు కోరాలి. హాస్యరసభరితమైన సినిమాలు చూడటం: హాస్యపూరితమైన సినిమాలు చూసేప్పుడు పిల్లలు గట్టిగా నవ్వుతుంటారు. ఈ ప్రక్రియలో మెదడు కణాలకు ఎక్కువ ఆక్సిజన్ అందుతుంటుంది. దాంతో మెదడు కణాలు మరింత జీవశక్తిని పుంజుకుంటాయి.మంచి ఆహారం తీసుకోవడం: మంచి ఆహారం కూడా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉదాహరణకు చేపలు, వాల్నట్స్, గుమ్మడిగింజలు, సోయాబీన్స్ వంటి ఆహారాల్లో ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటు నిత్యం ముదురాకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు తినడం, ఆయా సీజన్లలో లభ్యమయ్యే పండ్లను తీసుకోవడం కూడా జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు దోహదపడే అంశాలే. మంచి నిద్ర: పిల్లలు గాఢంగా నిద్రపోవడం అవసరం. దీంతో వాళ్లలో సమస్యను ఛేదించే శక్తి (ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీస్) పెరుగుతాయి. పైగా నిద్ర సమయంలోనే మనం జ్ఞాపకముంచుకోవాల్సిన విషయాలను మెదడు తన జ్ఞాపక కేంద్రాలలో సుస్థిరం చేసుకుంటుంది. ఆటలు : పిల్లలు తమ మెదడుకు రక్తసరఫరా బాగా జరిగేలా ఏరోబిక్స్ చేయడం, శరీరానికి శ్రమ కలిగించే ఆటలు ఆడటం వల్ల కూడా వారిలో జ్ఞాపకశక్తి మరింతగా పెంపొందుతుంది. ధ్యానం: నిత్యం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల ఏకగ్రతా, దృష్టికేంద్రీకరణశక్తితో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. చెస్ (చదరంగం) ఆడటం కూడా దాదాపు ధ్యానంతో సమానం. డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్ మాక్సిమైజింగ్ ద మెమరీ