పుస్తకం-ధర్మపత్ని
సాహిత్య మరమరాలు
అద్వైతం సుఖదుఃఖయో రనుగతం సర్వాస్వవస్థాసుయత్
విశ్రామో హృదయస్యయత్ర జరసా యస్మిన్నహార్యోరసః
కాలేనావరణాత్యయా పరిణతేయత్ ప్రేమ సారే స్థితం
భద్రం తస్య సుమానుషస్య కథమప్యేకం హితత్ ప్రార్థ్యతే
దాంపత్య వైశిష్ట్యాన్ని చెప్పిన ఈ శ్లోకం భవభూతి మహాకవి రచించిన ఉత్తర రామచరిత్ర నాటకంలోనిది. సుఖదుఃఖాలు రెండింటిలోనూ ఎడబాయకుండేదీ, మనస్సు విశ్రాంతి తీసుకునేదీ, ముసలితనం వచ్చినా రుచి తగ్గనిదీ దాంపత్యం. ఉత్తమ సాహిత్యం కూడా అటువంటిదే! దాంపత్యం వలే అట్టి సాహిత్యం కూడా వర్ధిల్లుగాక! ఎన్ని కష్టాలు వచ్చినా దానినే కోరతాను. భద్రం తస్య సుమానుషస్య అనడానికి బదులుగా, భద్రం తస్య సుపుస్తకస్య అనబుద్ధి పుడుతుంది. రామచంద్రుడికి సీత ఎంత ప్రియురాలో రసజ్ఞుడికి మంచి పుస్తకం అంత ప్రియురాలు ఎందుకు కాదు? మంచి పుస్తకం ఇష్టమైన భార్యలాగు పాణిగ్రహణం మొదలు హృదయం పట్టుకు విడవదు. ఇలా సుప్రసిద్ధ భవభూతి శ్లోకాన్ని ఉత్తమ పుస్తకానికీ, సహృదయునికీ అనుసంధానిస్తూ అపూర్వంగా సమన్వయించడాన్ని ఎక్కువమంది వినివుండరు. ఈ సమన్వయం ఏది ఉత్తమ సాహిత్యం? అన్న వ్యాసంలోనిది. ఇది 1954 జాగృతి పత్రికలో ప్రచురితం. అలా కొత్తకోణంతో సమన్వయించినవారు సాహితీవేత్త ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. వీరి కుమారులు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఇటీవల ప్రచురించిన సాహిత్య సంచారం గ్రంథంలో ఈ వ్యాసాన్ని కూడా చేర్చారు. అన్నట్టూ, ఆగస్టు 29న హనుమచ్ఛాస్త్రి జయంతి. ఈ సందర్భంగా వారికిదే నా నివాళి.
డా.రామడుగు వేంకటేశ్వరశర్మ
9866944287