breaking news
Vangala Subba Rao
-
రాష్ట్రంలో చెత్త పాలన సాగుతోంది
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చెత్తపాలన సాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు విమర్శించారు. హనుమంతరాయ గ్రంథాలయంలో ‘మాస్టర్‌ప్లాన్‌లో వ్యవసాయ పరిరక్షణ జోన్ నిబంధనలు మార్చాలని’ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రైతు రక్షణ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల భూములపై ఆంక్షలు విధించి ధరలు అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. పచ్చదనం, వ్యవసాయ పరిరక్షణ అంటూ ముద్దు పేర్లతో రైతులను మోసగిస్తోందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 42 మండలాల్లో అగ్రికల్చర్ జోన్ పేరిట అంక్షలు విధించిందన్నారు. 800 గ్రామాల్లో సుమారు 13 లక్షల ఎకరాల భూమి వ్యవసాయ పరిరక్షణ జోన్ పరిధిలోకి వస్తుందన్నారు. ప్రభుత్వం సింగపూర్, జపాన్ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట వేసి రైతులను విస్మరిస్తోందన్నారు. మాస్టర్ ప్లాన్, అభ్యంతరాలపై విడుదల చేసిన నోటిఫికేషన్‌పై రైతులకు అవగాహన ఉండకూడదనేదే చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశమన్నారు. మాస్టర్‌ప్లాన్‌పై ప్రభుత్వం అవగాహన సదస్సులు ఏర్పాటుచేసే లోపే రక్షణ వేదిక ఆధ్వర్యంలో 42మండలాల్లో యాత్రలు నిర్వహించాలని సూచించారు. ఫిబ్రవరి 10లోపు నియోజకవర్గస్థాయి యాత్రలు, 20లోపు మండలస్థాయి సదస్సులు, 29 నాటికి అభ్యంతరాలు తెలియజేయాలన్నారు. ప్రభుత్వం పది అవగాహన సదస్సులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని, వ్యవసాయ పరిరక్షణ జోన్‌గా ప్రకటించిన అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించేలా ఒత్తిడి తీసుకువస్తామన్నారు. నిబంధనలు మార్చాలి రైతు సంఘం జిల్లా కార్యదర్శి వై.కేశవరావు మాట్లాడుతూ మాస్టర్‌ప్లాన్‌లో వ్యవసాయ పరిరక్షణ జోన్ నిబంధనలు సమూలంగా మార్చాలని డిమాండ్‌చేశారు. రైతుల అభ్యంతరాలను ప్రతి మండలంలో స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. పరిరక్షణ జోన్ నిబంధనలు తెలుగులో అనువదించి ప్రతి పంచాయతీ కార్యాలయంలో రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. మాస్టర్‌ప్లాన్‌ను స్వదేశీ నిపుణులు, వ్యవసాయ ఆర్థిక వేత్తలు, రైతు సంఘాలతో చర్చించి రూపొందించాలని డిమాండ్‌చేశారు. -
కేసీఆర్‌ను చూసి బుద్ధితెచ్చుకో బాబు
రుణమాఫీ చేయకుండా తప్పించుకుంటున్న బాబు ఒంగోలు టౌన్ : రైతుల రుణమాఫీ చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పించుకు తిరుగుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు ధ్వజమెత్తారు. సింగపూర్, జపాన్ అంటూ విదేశీ పర్యటనలతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఆదివారం ఒంగోలు వచ్చిన సందర్భంగా స్థానిక ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 8వ తేదీ గుంటూరులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తూ రైతు రుణమాఫీపై తొలి సంతకం చేశారన్నారు. రుణాలు మాఫీ చేయకపోగా కోటయ్య కమిటీ, కుటుంబరావు కమిటీల పేరుతో కొంతకాలం కాలయాపన చేశారని, ఆ తరువాత రైతుల అర్హతపై విచారణలు, పునర్విచారణల పేరుతో రుణమాఫీ చేయకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. స్మార్ట్ సిటీ, మహానగరాలు, వినోద నగరాలంటూ జపం చేస్తున్న చంద్రబాబు కోటి మంది రైతుల రుణ మాఫీ గురించి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేసీఆర్‌ను చూసి బుద్ధితెచ్చుకో.. రుణమాఫీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని వంగల సుబ్బారావు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం 39 లక్షల మంది రైతులకు తొలి విడతగా రూ.17 వేల కోట్లను వారి ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాకుండా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి తాజాగా 8 వేల కోట్ల రూపాయల రుణాలు తిరిగి ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎన్నికల మ్యానిఫెస్టోలో కోటి 81 లక్షల మంది రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించినప్పటికీ ఇంత వరకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌కు సంబంధించి రూ.30 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. 12 లక్షల మంది కౌలు రైతులు ఉంటే ఒక్కరు కూడా రుణాలకు నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే కరువు మండలాలను ప్రకటించలేదని, ఒక్క అనంతపురం జిల్లాలోనే 70 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే రైతాంగ పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. 1న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరుతూ డిసెంబర్ 1వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వంగల సుబ్బారావు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో రైతులు, కౌలు రైతులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపీనాథ్ మాట్లాడుతూ శనగల కొనుగోళ్లు కేవలం వ్యవసాయశాఖ మంత్రి పుల్లారావు ప్రారంభోత్సవానికే పరిమితమైనాయని విమర్శించారు. పత్తి రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందన్నారు. వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి క్వింటా రూ.4050 కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.