‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor ) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు బాలీవుడ్ దర్శకుడు ఉత్తమ్ మహేశ్వరీ(Uttam Maheshwari) ప్రకటిస్తూ ఓ పోస్టర్ని రిలీజ్ చేశారు. దీనిపై నెటిజన్స్ మండిపడ్డారు. ఒకవైపు దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే..ఈ సమయంలో పోస్టర్ రిలీజ్ చేయడం అవసరమా అంటూ దర్శకుడిని ట్రోల్ చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చిరవకు దర్శకుడు ఉత్తమ్ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఎదుటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని అందులో పేర్కొన్నాడు. (చదవండి: భారత్‌పై ప్రశంసలు.. హీరోయిన్‌కి బెదిరింపులు!)‘ఈ సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా చేస్తున్నట్లు ప్రకటించినందుకు క్షమాపణలు చెబుతున్నాను. డబ్బు కోసం లేదా ఫేమస్ అవ్వడం కోసమే ఇలాంటి పని చేయలేదు. మన సైనికుల ధైర్య సాహసాలను, త్యాగాలను ప్రపంచానికి తెలియజేసేలా ఓ పవర్ఫుల్ కథగా వెండితెరపై తీసుకురావాలనుకున్నాను. దేశంపట్ల గౌరవంతో నేను ఈ సినిమా చేయాలనుకున్నాడు. అంతేకాని డబ్బుకి ఆశపడి సినిమా ప్రకటన చేయలేదు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా ప్రకటన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి నా క్షమాపణలు చెబుతున్నాను. ఇది సినిమా మాత్రమే కాదు దేశ ప్రజల ఎమోషన్’ అని ఉత్తమ్ మహేశ్వరీ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.కాగా, ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు విచక్షణ రహితంగా దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలను పోగొట్టుకున్నారు. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసింది. 26 మంది భారత మహిళల నుదుటిన సిందూరం తుడిచేసిన ఉగ్రవాదుల గడ్డపై రక్త సిందూరం పారించేందుకే ఈ పేరు పెట్టారు. ‘ఆపరేషన్ సిందూర్’పై దేశ ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఇదే పేరుతో సినిమాను నిర్మించడానికి పలు నిర్మాణ సంస్థలు పోటీ పడ్డాయి. టైటిల్ కోసం విఫల ప్రయత్నాలు చేశాయి. చివరకు నిక్కీవిక్కీ భగ్నానీ ఫిల్మ్స్ పతాకంపై ఉత్తమ్ మహేశ్వరీ దర్శకత్వంలో ‘ఆపరేషన్ సిందూర్’ తెరకెక్కిస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం ప్రకటన చేశారు. నెటిజన్ల ఆగ్రహంతో డైరెక్టర్ పై విధంగా స్పందించాడు.