breaking news
unnecessary
-
ఓ తండ్రి ఆలోచన.. ఒకే ముహూర్తానికి ఆరు పెళ్లిళ్లు
ఈ హెడ్డింగ్‌కి అర్థం తెలుసుకోవాలంటే మనం కేరళకు వెళ్లాలి. అక్కడ ఒక తండ్రి తన కుమార్తెకు పెళ్లి చేయదలిచాడు. కాని పెళ్లికి అనవసర ఖర్చు వద్దనుకున్నాడు. కట్నం ఇవ్వకూడదనుకున్నాడు. ఆ డబ్బును సద్వినియోగం చేయాలనుకున్నాడు. కూతురి పెళ్లికి ఎంత డబ్బు దాచాడో ఆ మొత్తం డబ్బును అదే ముహూర్తానికి మరో ఐదు మంది అమ్మాయిల పెళ్లికి ఖర్చు చేశాడు. ఒకే ముహూర్తానికి ఆరు పెళ్ళిళ్లు జరిగాయి. ఈ ఆలోచన మనం చేయలేమా? అసలు పెళ్లికి ఖర్చు అవసరమా? పెళ్లి ఖర్చు అనే సామాజిక రుగ్మత నుంచి బయటపడలేమా? ఒక ఆలోచనాత్మక కథనం. ఇటీవల హైదరాబాద్ గోల్కొండ సమీపంలోని ఒక రిసార్ట్‌లో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఖర్చు.. అంటే పెళ్లి జరిపేందుకు అయిన ఖర్చు 2 కోట్లు. ఈ మొత్తంలో లాంఛనాలు లేవు. ఇచ్చిపుచ్చుకున్న ఖర్చూ లేదు. కేవలం కల్యాణ మంటపానికి, భోజనానికి, అతిథి మర్యాదలకి, సంగీత్కి, అలంకరణలకి, అట్టహాసానికి అయిన ఖర్చు అది. ఆ రెండు కోట్లతో మధ్యతరగతి పెళ్లిళ్లు 20 అయినా చేయొచ్చు. పేద పెళ్ళిళ్లు 50 అయినా చేయొచ్చు. పెళ్లి ఇద్దరు స్త్రీ, పురుషులు కలిసే సంతోషకరమైన సందర్భం. దానిని సంతోషంగా చేసుకోవాల్సిందే. ఇరువురి ఆత్మీయులు హాజరవ్వాల్సిందే. కాని ఆ పెళ్లిని ఆసరా చేసుకుని తమ సంపదను, అహాన్ని, హోదాని, పలుకుబడిని నిరూపించాలనుకున్నప్పుడే పేచీ వస్తుంది. వెండి అంచు ఉన్న శుభలేఖలు, వాటితో పాటు ఇచ్చే పట్టుచీరలు, వస్తువులు, భోజనంలో ముప్పై నలభై వంటకాలు, ఖరీదైన వినోద కార్యక్రమాలు ఇవన్నీ పెళ్లి బడ్జెట్‌ను అమాంతం పెంచేస్తాయి. ఉన్నవారికి ఇదంతా తేలికే కావచ్చు. ఇమిటేట్ చేయాలనుకునే వారికి చిక్కొచ్చి పడుతుంది. ఇటీవల కేరళ లో అట్టహాసపు పెళ్ళిళ్లు, అందుకు పెళ్లికొడుకులు మారాము చేయడం, ఘనంగా చెప్పుకోవడానికి బైక్ దగ్గర కారు అడగడం, కట్నం దగ్గర ఆస్తులు అడగడం, అవి వీలు కాకపోతే భార్యను వేధించడం మామూలు అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల కన్నూరులో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. కన్నూరు సమీపంలోని ఎడచ్చేరీకి చెందిన సలీమ్, రుబీనా జంట తమ కుమార్తె రమీజా పెళ్లిని వినూత్నంగా చేయాలనుకున్నారు. గల్ఫ్‌లో ఉద్యోగం చేసే సలీమ్ తన కుమార్తె పెళ్లికి డబ్బు దాచి పెట్టాడు. కాని దానిని కట్నంగా ఇవ్వడం, అట్టహాసపు పెళ్లికి ఖర్చు పెట్టడం వద్దనుకున్నాడు. ఎలాగైనా సరే కట్నం అడగని పెళ్లికొడుకుని వెతికి పెళ్లి చేయాలి అని నిశ్చయించుకున్నాడు. అలాంటి వరుడే దొరికాడు. దాంతో అతనికి కట్నం డబ్బు మిగిలిపోయింది. దాంతో పాటు పెళ్లి అర్భాటంగా వద్దనుకున్నాడు కాబట్టి ఆ ఖర్చూ మిగిలింది. ఆ మొత్తం డబ్బుతో ఆర్థికంగా వెనుకబడిన ఐదుగురు అమ్మాయిలను ఎంపిక చేసుకుని వారికి అబ్బాయిలను వెతికి తన కుమార్తెకు పెళ్లి జరిగిన ముహూర్తానికే వారికీ పెళ్లి జరిపించాడు. అంతే మొత్తం ఆరు పెళ్ళిళ్లు ఒకే ముహూర్తానికి జరిపించాడు. ఇందులో ఇద్దరు వధువులు హిందువులు కావడంతో వారి పెళ్లి హైందవపద్ధతిలో జరిగింది. ఈ పెళ్ళిళ్లు జరిపించడంలో సలీమ్, రుబీనా దంపతులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఐదుగురు అమ్మాయిలకు తగిన అబ్బాయిలను వెతికారు. అలాగే పెళ్లిలో సొంత కూతురితో పాటు మిగిలిన ఐదుగురికీ సమానంగా 10 సవరల బంగారం పెట్టారు. అందరికీ ఒకేరకమైన పట్టు చీరలు తెచ్చారు. ఇంత చక్కగా డబ్బును సద్వినియోగం చేయడం వల్ల ప్రశంసలు పొందారు. ఇందులో మతసామరస్యం కూడా ఉండటంతో పొగడ్తలు మరిన్ని వస్తున్నాయి. కాలం మారుతుంది. రెండు తీవ్రతలు కనిపిస్తున్నాయి. ఒకటి పెళ్లికి చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం...మరొకటి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేవలం బొకేలు ఇచ్చి పుచ్చుకుని వియ్ ఆర్ మేరీడ్ అనుకోవడం. ఎవరి ఇష్టం వారిదే అయినా పెళ్లి ఖర్చును తగ్గించడం అనేది ఒక అవసరంగా పాటించడం ఆదర్శం అవుతుంది. ఆ ఆదర్శం అందరూ పాటించగలిగితే చాలా కుటుంబాలకు పెళ్లి భారం అనే ఆలోచన తప్పుతుంది. తద్వారా ఆడపిల్లలను కనేందుకు, ఆడపిల్లలను పెంచేందుకు జంకే పరిస్థితి పోతుంది. ‘అమ్మాయి పుడితే ఖర్చు’ అనే మాట ఇంకా ఎంత కాలం? ఆ ఖర్చు పెళ్లి వల్లే కదా? దానిని తేలిక చేయలేమా? సలీం వంటి ఆలోచనలు చేయలేమా? ఆలోచించాలి అందరం. పెళ్లి ఖర్చును తగ్గించడం అనేది ఒక అవసరంగా పాటించడం ఆదర్శం అవుతుంది. ఆ ఆదర్శాన్ని అందరూ పాటించగలిగితే చాలా కుటుంబాలకు పెళ్లి భారం అనే ఆలోచన తప్పుతుంది. -
సలహాదారులుగా చుట్టాలొద్దు
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: కచ్చితంగా ఆధారాలుంటేనే ఆరోపణలు చేయాలని, బంధువులను ఉద్యోగాల్లో పెట్టుకోవద్దని మంత్రి వర్గ సహచరులను ప్రధాని మోదీ కోరారు. మంత్రివర్గ సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. మీడియాతోగానీ, బహిరంగంగా గానీ అనవసర వ్యాఖ్యలు చేయవద్దని, కేవలం ఆధారాలున్న విషయాలపైనే ఆచూతూచి మాట్లాడాలని సూచించారు. మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో తమకు తెలిసిన వారిని, బంధువులను సలహాదారులుగా నియమించుకోవద్దని కోరారు. పాలన వేగంగా, సవ్యంగా సాగాలంటే కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రుల మధ్య సమన్వయం అవసరమన్నారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంత్రులు కేవలం కార్యదర్శుల స్థాయి అధికారులతో మాత్రమే కాకుండా, జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారులకు కూడా సమాచారం అందించాలని కోరారు. దీనివల్ల అధికారులందరూ కూడా బృందంలో తామూ భాగమేనని భావించేందుకు వీలుంటుందన్నారు. అధికారులను ప్రోత్సహిస్తూ మెరుగైన ఫలితాలను సాధించాలన్నారు. మంత్రులంతా ఉదయం 9.30 గంటలకే కార్యాలయాలకు చేరుకోవాలని, గతంలో చాలా సార్లు చెప్పినప్పటికీ ఈ సూచనను కొందరు పాటించడం లేదన్నారు. అలాంటి వారు ఇకపై ఆచరించాలన్నారు. మంత్రులు క్రమశిక్షణను పాటిస్తే ఉత్పాదకత, పని సామర్ధ్యము పెరుగుతుందన్నారు. సర్దార్ డ్యామ్‌ను చూసిరండి జలకళ సంతరించుకున్న సర్దార్ సరోవర్ జలాశయం అందాలను తిలకించాలని ప్రజలను మోదీ కోరారు. బుధవారం ఆయన డ్యామ్ ఫొటోలను, నర్మదా నదీ తీరంలోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం ఫొటోలను ట్విట్టర్లో ఉంచారు. గుజరాత్‌లోని కేవడియా ప్రాంతంలో నిర్మించిన సర్దార్ సరోవర్ జలాశయం నీటి మట్టం రికార్డు స్థాయిలో బుధవారం 134 మీటర్లకు చేరింది. -
ఆ మందులతో ఏటా 23,000 మంది మృతి!
వాషింగ్టన్: అవసరానికి మించి యాంటీబయాటిక్స్ వాడితే కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలకే మోతాదుకు మించి యాంటీ బయాటిక్స్ వాడటం మూలంగా భవిష్యత్తులో సంభవించే తీవ్రమైన రోగాలపై కూడా అవి ప్రభావం చూపలేవు. అయితే అమెరికా వైద్యులు మాత్రం.. తమ పేషెంట్లకు సూచిస్తున్న యాంటీబయాటిక్స్‌లో 30 శాతానికి పైగా అవసరం లేనివేనట. డాక్టర్లు సూచిస్తున్న ఈ మోతాదుకు మించిన యాంటీ బయాటిక్స్ వాడకం మూలంగా ఏటా 20 లక్షల మంది యాంటీబయాటిక్స్ కు లొంగని ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నారని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) సంస్థ నిర్వహించిన తాజా పరిశోధనలో తేలింది. అంతే కాదు డాక్టర్ల ఈ నిర్వాకం మూలంగా ఏటా 23,000 మృత్యువాతపడుతున్నారని సీడీసీ వెల్లడించింది. డాక్టర్లు రాసిన సుమారు 1,80,000 ప్రిస్క్రిప్షన్లను పరిశీలించి సీడీసీ తన ఫలితాలను వెలువరించింది. సైనసైటిస్, చెవి ఇన్ఫెక్షన్లు, గొంతు ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు సూచిస్తున్న మందుల్లో మోతాదుకు మించి యాంటీబయాటిక్స్ ఉన్నట్లు ఈ పరిశీలనలో తేలింది. శ్వాసకోశ వ్యాదులకు సంబంధించి డాక్టర్లు సూచిస్తున్న యాంటీబయాటిక్స్‌లో 50 శాతం అసలు అవసరమే లేదని సీడీసీ తెలిపింది. ముఖ్యంగా ఔట్ పేషంట్లకు సూచిస్తున్న ఓరల్ యాంటీబయాటిక్స్‌లో 30 శాతం అక్కర్లేనివేనని తెలిపింది. మోతాదుకు మించి వీటిని వాడటం ద్వారా కలిగే దుష్ఫలితాలను గురించి ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరముందని సీడీసీ అభిప్రాయపడింది.