breaking news
University of Houston
-
భారతీయ అమెరికన్ దంపతుల దాతృత్వం
హూస్టన్: అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్‌కు భారతీయ అమెరికన్ జంట రూ.38.25 కోట్ల (40 లక్షల డాలర్ల) విరాళాన్ని అందజేసింది. భారతీయ అమెరికన్ ఇంజినీర్ మన్మోహన్ సింగ్ కాల్సి, ఆయన భార్య మేరీ లూయిస్ షుబెర్ట్ కాల్సి ఈ మొత్తాన్ని పరిశోధన, విద్య కోసం అందజేశారని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మొత్తంతో వర్సిటీలోని కుల్లెన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగంలో రెండు ఎండోవ్డ్ ప్రొఫెసర్‌షిప్‌లు, ఒక ఫ్యాకల్టీ రీసెర్చ్ ఫండ్, గ్రాడ్యుయేట్ ఫెలోషిప్‌లు, ఒక సెమినార్ సిరీస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. మన్మోహన్ కాల్సి వర్సిటీలో గ్రాడ్యుయేట్ చేసి, పారిశ్రామికవేత్తగా ఎదిగారని, సుదీర్ఘ కాలం వర్సిటీతో సంబంధాలు కొనసాగిస్తున్నారని డీన్ ప్రదీప్ శర్మ చెప్పారు. మన్మోహన్ కాల్సి హూస్టన్ వర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీతోపాటు పీహెచ్డీ పూర్తి చేశారు. హైడ్రోడైనమిక్ రోటరీ సీలింగ్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న కాల్సి ఇంజినీరింగ్ అనే కంపెనీని ఆయన 1978లో నెలకొల్పారు. -
లేట్ నైట్ నిద్రపోతే అంతే సంగతులు!
మీ ఇంట్లో చిన్నపిల్లలు తరచూ నిరాశగా ఏదో కోల్పోయిన వారిలా ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చుంటున్నారా? వారు అలా ఉండడానికి కారణాలు ఏమై ఉండచ్చో ఒకసారి ఆలోచించారా! వారి విచిత్ర మానసిక పరిస్థితికి కారణం సరిగా నిద్ర పోకపోవడమే అని ఇటీవల శాస్త్రవేత్తలు తేల్చారు. లేట్ నైట్ వరకు నిద్రపోని పిల్లలు ఎమోషనల్ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వారు చెబుతున్నారు. నిద్ర తక్కువగా ఉన్నవారిలో వ్యతిరేక భావావేశాలు ఎక్కువగా ఉంటాయంట! అలాంటి వారు సంతోషాలను ఎక్కువగా అనుభవించలేరని హోస్టన్ యూనివర్సిటీ నిపుణులు తెలిపారు. 7 నుంచి 11 ఏళ్ల వయసు ఉన్న పిల్లలపై పరిశోధనలు జరిపి ఈ మేరకు ఫలితాలను రాబట్టారు. భవిష్యత్తులో అలాంటి పిల్లలు మానసికంగా మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. నిద్రలేమి అనేది మానసిక స్థితిగతులపై అధికంగా ప్రభావం చూపుతుందని వివరించారు. కాగా, ఏడు నుంచి 12 ఏళ్ల పిల్లలు సుమారు రోజుకు 10 గంటల పాటు నిద్రపోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.


