ఐపీఎల్ వేలంలో 651 మంది దేశీయ ఆటగాళ్లు
న్యూఢిల్లీ: ఐపీఎల్ వేలానికి 651 మంది దేశీయ ఆటగాళ్లతో భారీ జాబితాను సిద్ధం చేశారు. ఉన్ముక్త్ చంద్, రిషీ ధావన్, సుమన్, రజత్ బాటియా, మనీష్ పాండేలాంటి ఆటగాళ్లతో పాటు ఇటీవల దేశవాళీ మ్యాచ్‌ల్లో సత్తా చాటిన చాలా మంది కొత్త కుర్రాళ్లను ఈ జాబితాలో ఉంచారు. అన్ని ఫ్రాంచైజీలకు పంపిన ఈ జాబితాలో ఆసక్తి ఉన్న ఆటగాళ్ల పేర్లను ఫిబ్రవరి 3 వరకు ఐపీఎల్ నిర్వాహకులకు సూచించాలి. దాని తర్వాత ఆయా ఆటగాళ్లతో కూడిన తుది జాబితాను రూపొందిస్తారు.
ఇంతకుముందు ఐపీఎల్లో ఆడిన 127 మందితో ఒక జాబితా, తొలిసారి వేలానికి అందుబాటులో ఉండే ఆటగాళ్లతో రెండో జాబితాను రూపొందించారు. రూ. 10 నుంచి 30 లక్షల మధ్య కనీస ధరను నిర్ణయించారు. పాండే, ధావన్‌లు తమ కనీస ధర రూ. 20 లక్షలుగా ప్రకటించగా, చంద్, సుమన్, భాటియా, అబ్దుల్లా రూ. 30 లక్షలుగా వెల్లడించారు. అన్క్యాప్డ్ ప్లేయర్లు వేలంలోకి రావడం ఇదే తొలిసారి. మరోవైపు క్యాప్డ్ ఆటగాళ్ల జాబితాలో మరో 12 మందిని కొత్తగా చేర్చారు. దీంతో ఈ సంఖ్య 244కు చేరుకుంది. వరుణ్ ఆరోన్ వేలంలో అందుబాటులో ఉండనున్నాడు.
వచ్చే ఏడాది అందుబాటులో ఉంటా: సంగక్కర
కొలంబో: ఈ ఏడాది జరిగే ఐపీఎల్లో ఆడేందుకు రెండున్నర వారాల సమయమే వీలు చిక్కుతుందని, అందుకే తాను వేలానికి దూరంగా ఉన్నట్టు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర తెలిపాడు. ఇంత తక్కువ సమయం లీగ్‌లో ఉంటే ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపవని చెప్పాడు. వచ్చే ఏడాది పూర్తిగా ఆడే వీలుండడంతో ధర కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాడు. ఇప్పటితో పోలిస్తే వచ్చే ఏడాది ఫ్రాంఛైజీల దగ్గర నిధులు ఎక్కువగా ఉంటాయన్నాడు.