breaking news
Tushar Rao Gedela
-
దంపతులుగా జీవిస్తుంటే... జోక్యమొద్దు: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో ఒక్కటిగా జీవిస్తున్న అమ్మాయి, అబ్బాయి మధ్యలోకి మూడో వ్యక్తి జోక్యం తగదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. వారి కుటుంబ సభ్యులు అయినా కూడా జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. కుల, మతాలతో సంబంధం లేకుండా, ఒక్కటిగా బతికే జంటకు తగిన రక్షణ కల్పించాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుషార్ రావు గేదెల అన్నారు. రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, అధికార యంత్రాంగానిదేనన్నారు. ఉత్తరప్రదేశ్లో తండ్రి అభీష్టానికి విరుద్ధంగా తనకు నచ్చిన వ్యక్తితో కలిసి ఉంటున్న ఓ యువతి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. యూపీలో తన తండ్రి చాలా పరపతి గల వ్యక్తి అని, ప్రాణభయంతో తరచూ వేర్వేరు హోటళ్లకు మారుతూ కాలం వెళ్లదీస్తున్నామని, రక్షణ కల్పించేదాకా మా దంపతులకు మనశ్శాంతి ఉండదని ఆమె కోర్టుకు నివేదించారు. -
ఢిల్లీ హైకోర్టు జడ్జిగా వీరఘట్టం వాసి
వీరఘట్టం: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామానికి చెందిన గేదెల తుషార్రావు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేశారు. తుషార్రావు తండ్రి నారాయణరావు (దాసునాయుడు) ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు. ఆయన సుప్రీంకోర్డు న్యాయవాదిగా పనిచేశారు. న్యాయవాది కుటుంబంలో పుట్టిన తుషార్రావు ఇన్నాళ్లూ ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ జడ్జిగా నియామకమయ్యారు. గ్రామానికి చెందిన వ్యక్తికి అరుదైన అవకాశం రావడం గర్వంగా ఉందని వీరఘట్టం జెడ్పీటీసీ సభ్యురాలు జంపు కన్నతల్లి, ఆయన మేనల్లుడు ధనుకోటి శ్రీధర్ పేర్కొన్నారు. (చదవండి: అదానీ డేటా సెంటర్కు గ్రీన్ సిగ్నల్)