మాతో పెట్టుకోకు!
♦ టోల్‌ప్లాజాకు ట్రాన్స్‌కో షాక్
♦ టోల్ ఫీజు అడిగారని ఎస్ఈ సీరియస్
♦ రుసుము కట్టి.. బకాయిలపై ఆరా
♦ అప్పటికప్పుడు కరెంట్ కట్
♦ అంధకారంలో తూప్రాన్ టోల్గేట్
తూప్రాన్: ట్రాన్స్‌కో టోల్‌ప్లాజాపై కన్నెర్ర చేసింది. ఆ విభాగం ఉన్నతాధికారికి కోపం వచ్చిన దరిమిలా ప్లాజా అంధకారంలో మునిగిపోయింది. వాహనదారుల ముక్కుపిండి వసూళ్లకు పాల్పడే టోల్గేట్ నిర్వాహకులు తమ కట్టాల్సిన బకాయిల విషయం మర్చిపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి జిల్లా టీఎస్ సీపీడీసీఎల్ (విద్యుత్) ఎస్ఈ సదాశివరెడ్డి తూప్రాన్ మండలం అల్లాపూర్ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా మీదుగా హైదరాబాద్ వెళుతున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారును టోల్‌ప్లాజా సిబ్బంది ఆపేశారు.
తన గుర్తింపును స్పష్టం చేసినప్పటికి వారు పట్టించుకోకుండా రుసుం కట్టాల్సిందేనన్నారు. వారితో వాదనలకు వెళ్లకుండా సదాశివరెడ్డి రుసుం చెల్లించాడు. ఆ వెంటనే తమ సిబ్బందితో మాట్లాడి టోల్‌ప్లాజా బకాయిలపై ఆరా తీశారు. నెల రోజుల విద్యుత్ బిల్లు బకాయిలు కట్టలేదని గుర్తించారు. వాహనాదారుల ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్న టోల్‌ప్లాజా నిర్వాహకులపై ఉపేక్ష అనవసరమని వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని అప్పటికప్పుడు ఆయన సిబ్బందికి పురమయించారు. వెంటనే వారు టోల్‌ప్లాజాకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో టోల్‌ప్లాజా వద్ద అంధకారం నెలకొంది. ఈ ఉహించని సంఘటనతో టోల్‌ప్లాజా మీదుగా వెళ్లే వాహనచోదకులకు అసౌకర్యానికి గురయ్యారు.