breaking news
tungabadhadra
-
తుంగభద్ర నదిలో దీపాలతో భక్తుల సందడి
-
తుంగభద్ర పుష్కరాలు : సంకల్‌భాగ్ పుష్కరఘాట్‌లో భక్తుల సందడి
-
ఘనంగా తుంగభద్ర పుష్కరాలు
-
నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు
సాక్షి, కర్నూలు : పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు నేడు (శుక్రవారం) ఘనంగా ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరుడు నదిలో ప్రవేశిస్తాడని, అప్పటి నుంచి పుణ్యఘడియలు ప్రారంభమవుతాయని పండితులు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులోని సంకల్‌భాగ్ ఘాట్‌లో ప్రత్యేక పూజలతో పుష్కరాలను ప్రారంభించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్భాటాలు లేకుండా సంప్రదాయరీతిలో, శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది. ఐదు వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఘాట్ల వద్ద ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. కర్నూలు జిల్లాలో 23 ఘాట్లు.. తుంగభద్ర నది ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాలో మాత్రమే ప్రవహిస్తుంది. కర్ణాటకలో ప్రవహించిన అనంతరం మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం మేళిగనూరు(నదిచాగి) వద్ద ఆంధ్రలో ప్రవేశిస్తుంది. 156 కిలోమీటర్ల మేర మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాలలో ప్రవహించాక కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. నది పరివాహక ప్రాంతంలో 23 పుష్కర ఘాట్లను ప్రభుత్వం నిర్మించింది. ఘాట్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పుష్కరాలకు అనుమతి ఇచ్చింది. కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పుష్కరఘాట్ల వరకూ 43 బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఘాట్ల వద్ద తాత్కాలిక బస్షెల్టర్లను ఏర్పాటు చేశారు. తుంగభద్ర నదిలో ప్రస్తుతం 5 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. పుష్కరాల సమయంలో నీటి సమస్య లేకుండా చూసేందుకు అదనంగా రోజుకు 3 వేల క్యూసెక్కుల చొప్పున తుంగభద్ర డ్యాం నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. స్నానాలకు అనుమతి లేదు.. కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉండటం, రెండో దశ మొదలవ్వడం, నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. భక్తులు నదిలో పుష్కరస్నానాలు ఆచరించేందుకు అనుమతి నిరాకరించింది. అయితే పిండప్రదానాలకు అవకాశం కల్పించింది. ఈ–టికెట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారికి అనుమతి ఇచ్చింది. ఈ–టికెట్ వెబ్సైట్ (https://tungabhadrapushkaralu 2020.ap.gov.in)ను మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎమ్మెల్యేలు గురువారం కర్నూలు జిల్లా కలెక్టరేట్లో ప్రారంభించారు. వెబ్సైట్ ద్వారా భక్తులు తమకు నచ్చిన పుష్కర ఘాట్లలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సంప్రదాయ పూజలకు, పిండప్రదానాలకు 23 ఘాట్లలో 350 మంది పురోహితులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో పురోహితుడు రోజుకు 16 స్లాట్ల చొప్పున (ఒక్కో స్లాట్‌లో ఇద్దరు) పూజలు చేస్తారు. ఈ టికెట్ బుక్ చేసుకోకుండా నేరుగా వస్తే పిండప్రదానాలకు అనుమతి ఉండదు. కృష్ణా, గోదావరి పుష్కరాల్లో నిర్వహించినట్లుగా ఇప్పుడు కూడా పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు అన్ని ఘాట్లలో గంగాహారతి ఇవ్వనున్నారు. కాగా, సీఎం పర్యటన సందర్భంగా సంకల్‌భాగ్ వీఐపీ పుష్కర ఘాట్‌లో ఏర్పాట్లను మంత్రులు బుగ్గన, జయరాం, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సుధాకర్, తొగురు ఆర్థర్ పరిశీలించారు. నాడు తండ్రి.. నేడు కుమారుడు.. గత తుంగభద్ర పుష్కరాలు 2008 డిసెంబర్ 10న ప్రారంభమయ్యాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డిసెంబర్ 11న కర్నూలు నగరంలోని సంకల్‌భాగ్ ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి, నదికి హారతి ఇచ్చారు. ప్రస్తుతం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సంకల్‌భాగ్ ఘాట్‌లోనే పుష్కరాలు ప్రారంభించనున్నారు. తండ్రి, తనయులు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో వరుస పుష్కరాలు రావడం అరుదైన ఘట్టంగా భక్తులు భావిస్తున్నారు. పుష్కరాలను విజయవంతం చేయాలి: వీరపాండియన్, కలెక్టర్, కర్నూలు కోవిడ్ నేపథ్యంలో కఠిన పరిస్థితుల్లో పుష్కరాలు నిర్వహిస్తున్నాం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అత్యంత భక్తిభావంతో నిర్వహిస్తాం. ఈ–టికెట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారు పిండప్రదానాలు చేసుకోవచ్చు. పుష్కరాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రత్యేక పరిస్థితుల్లో జరిగే ఈ చారిత్రక ఘట్టాన్ని విజయవంతం చేసేందుకు భక్తులు సహకరించాలి. కేంద్ర నిబంధనలతో నియంత్రణ చర్యలు: మంత్రి వెలంపల్లి కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి రావడం వల్లే తుంగభద్ర పుష్కరాల్లో కొన్ని నియంత్రణ చర్యలు చేపడుతున్నామని, భక్తులు సహకరించాలని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కోరారు. భక్తులకు ఉచితంగా అందజేసే ఈ–టికెట్ విధానంలో భక్తులు ఏ సమయంలో ఏ ఘాట్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అనే వివరాలు ఉంటాయన్నారు. గత ప్రభుత్వ హాయాంలో గోదావరి, కృష్ణా పుష్కరాలకు రూ. వేల కోట్లు ఖర్చు చేసి అవినీతికి పాల్పడితే, తమ ప్రభుత్వం అవసరమైన మేరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పూర్తిగా పొదుపుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఈ పుష్కరాల్లో భక్తుల పుణ్య స్నానాలకు అనుమతి తెలపలేదని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పేదలకు డిసెంబర్ 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తుంటే.. ఆరోజు క్రిస్మస్ అంటూ కొందరు విమర్శలు చేయడం సరికాదని, ఆరోజు ముక్కోటి ఏకాదశి పండుగ కూడా అనే విషయం విమర్శ చేసే వారికి తెలియకపోవచ్చని ఎద్దేవా చేశారు. -
‘తుంగలో దొంగ’ పైపుల తొలగింపు
సాక్షి, బళ్లారి (కర్ణాటక): రాష్ట్రానికి సంబంధించిన తుంగభద్ర నదీ జలాలను కర్ణాటకలో అక్రమంగా దోపిడీ చేస్తున్న వైనంపై ‘సాక్షి’ దినపత్రికలో శనివారం ప్రచురితమైన ‘తుంగలో దొంగ’ కథనానికి తుంగభద్ర బోర్డు అధికారులు స్పందించారు. ఈఈ నారాయణనాయక్ నేతృత్వంలో పలువురు ఎస్డీఓలు శనివారం ఉదయం ఎల్ఎల్సీ గట్టుపై పర్యటించారు. కాలువలోని నీటిని తోడేందుకు వేసిన పైపులను తొలగించారు. ఈ సందర్భంగా ఈఈ నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రతి రోజు తాము పైపులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రాత్రుళ్లు రైతులు అక్రమంగా నీటిని తోడుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక పోలీసు బలగాలు నిత్యం కాలువపై పర్యటించి పైపులను తొలగించేందుకు పూనుకుంటే రైతులకు కొంత భయం ఏర్పడుతుందన్నారు. బోర్డు కార్యదర్శికి అఖిలపక్ష నేతల డిమాండ్ తుంగభద్ర డ్యామ్ పరిధిలో జలచౌర్యానికి పాల్పడుతున్న కర్ణాటక రైతులను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని టీబీ బోర్డు కార్యదర్శి రంగారెడ్డిని అనంతపురానికి చెందిన అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. అఖిల పక్ష నేతలు శనివారం టీబీ డ్యామ్, హెచ్ఎల్సీలను పరిశీలించారు. అనంతరం బోర్డు కార్యదర్శి రంగారెడ్డితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రైతులు పడుతున్న కష్టాలను వివరించారు. ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘తుంగలో దొంగ’ కథనాన్ని కార్యదర్శికి చూపించి ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించారు. డ్యామ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు సక్రమంగా నీరందడం లేదని, హెచ్ఎల్సీకి 44 కిలోమీటర్ నుంచి 105 కిలోమీటర్ వరకు ప్రత్యేక కాలువ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యదర్శి రంగారెడ్డి మాట్లాడుతూ.. తాను నెల రోజుల కిందటే బాధ్యతలు తీసుకున్నానని, ఆంధ్రప్రదేశ్‌కు అందాల్సిన వాటాను సక్రమంగా అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. జలచౌర్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తానన్నారు. ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించి నీటి దొంగలను అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. అఖిలపక్ష బృందంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర సీపీఐ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ బోరంపల్లి ఆంజనేయులు, పార్టీ జిల్లా నాయకుడు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కర్రా హనుమంతరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.వెంకటేశ్వరరెడ్డి, లోక్‌సత్తా పార్టీ కార్యదర్శి పులిచెర్ల నిజాం వలీ తదితరులు ఉన్నారు.