breaking news
Tuberculosis sanatorium
-
అనంతగిరికి చెస్ట్ ఆస్పత్రి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రసిద్ధ అనంతగిరి క్షయ నివారణ కేంద్రం (టీబీ శానిటోరియం) త్వరలో కనుమరుగు కానుంది. ఈ అటవీ క్షేత్రంలో సంజీవని మొక్కలు ఉన్నాయని, వాటి గాలి క్షయ నివారణకు ఔషధంగా పనిచేస్తుందని భావించిన నాటి నిజాం.. 46 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ క్షయ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కాలగమనంలో ఈ వైద్యశాలను గాలికి వదిలివేయడంతో పేషెంట్ల సంఖ్య తగ్గిపోయింది. పదిలోపు రోగులుంటే.. 200 మంది పైచిలుకు వైద్యులుండడంతో ఈ ఆస్పత్రి నిర్వహణ ప్రభుత్వానికి గుదిబండగా మారింది. ఈ క్రమంలోనే టీబీ శానిటోరియంను ఎత్తివేసి.. దాని స్థానే మానసిక రోగుల చికిత్సాలయం, చాతి వైద్యశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ఎర్రగడ్డలో కొనసాగుతున్న వీటిని ఇక్కడికి తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫైలుకు ఒకట్రెండు రోజుల్లో మోక్షం కలుగుతుందని, వారంరోజుల్లో దీనిపై ఉత్తర్వులు వెలువడుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎర్రగడ్డలోని ఈ రెండు ఆస్పత్రులను పెరేడ్ గ్రౌండ్‌కు శాశ్వత వేదికగా ఉపయోగించుకోనున్నట్లు ఇటీవల ఆయా ఆస్పత్రుల తనిఖీల్లో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెల్లడించారు. స్థానికుల నుంచి వ్యతిరేకత ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతగిరిని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి పరుస్తామని, ఉద్యాన లేదా వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు వాటి స్థానే పిచ్చాస్పత్రి, చెస్ట్ ఆస్పత్రి తెరమీదకు రావడంతో స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. వాస్తవానికి గతంలో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడే చాతి వైద్యశాల, మానసిక వికలాంగుల చికిత్సాలయం తరలింపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లోనే వ్యతిరేకత వచ్చినప్పటికీ, అధికారపార్టీ ప్రతినిధులు తిప్పికొట్టారు. తాజాగా మరోసారి ఈ అంశం తెరపైకి రావడం టీఆర్ఎస్ నాయకులను ఆత్మరక్షణలో పడేస్తోంది. నగరానికి సమీపంలో మంచి పర్యావరణం, ప్రముఖ అనంతపద్మనాభస్వామి దేవాలయం కొలువుదీరిన అనంతగిరిని టూరిస్టు స్పాట్‌గా అభివృద్ధి చేయకుండా ఆస్పత్రులతో నింపేయడమేమిటనే వాదన వినిపిస్తోంది. అయితే, టీబీ శానిటోరియంను ఎత్తివేసే ఆలోచన ప్రతిపాదనలేదని, కొత్తగా వచ్చే ఆస్పత్రుల్లో వీటిని విలీనం చేసి.. ప్రస్తుత వైద్యసిబ్బంది సేవలను వినియోగించుకుంటారని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
సూపర్ స్పెషాలిటీపై సమాధానం లేదు
మంత్రి కామినేని స్పష్టం చేయలేదని ఆర్కే వెల్లడి మంగళగిరి: జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణంపై ప్రభుత్వం నుంచి సమాధానం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. శుక్రవారం శాసనసభ సమావేశ అనంతరం ఆయన ఫోన్లో సాక్షితో మాట్లాడుతూ జీరోఅవర్‌లో రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్‌పై చర్చ జరిగిందన్నారు. చర్చల్లో భాగంగా మంగళగిరి టీబీ శానిటోరియంలో ఎయిమ్స్ నిర్మాణానికి ప్రభుత్వం ఏర్పాట్లు, మంత్రి స్థల పరిశీలన తదితర అంశాలపై జరిగిన చర్చలో తాను పాల్గొని సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌పై స్పష్టత ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న టీబీ శానిటోరియంను వేరేచోటకు తరలించి సూపర్ స్పెషాలిటీ నిర్మిస్తారా? లేక శానిటోరియంలోని ఖాళీ స్థలాల్లో నిర్మిస్తారా? అని ప్రశ్నించినట్లు చెప్పారు. అయితే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విజయవాడలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మిస్తామని చెప్పారు కానీ మంగళగిరి టీబీ శానిటోరియంలో ఆస్పత్రి నిర్మాణంపై సమాధానం ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ఎయిమ్స్‌ను జిల్లాలో ఏర్పాటు చేసే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.