breaking news
TRSLP office
-
హ్యాపీ బర్త్‌డే కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేటీఆర్ అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సినీపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, ఆయనతో కలిసి తీయించుకున్న ఫొటోలను ట్యాగ్ చేశా రు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం లో పలువురు రక్తదానం చేశారు. శాసనసభ అవరణలోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటి పరిధిలో వెయ్యి మొక్కలు నాటారు. ఇక బహ్రెయిన్‌లో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో గుడైబియా ఆండాల్స్ గార్డెన్‌లోనూ మొక్కలు నాటి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. గిఫ్ట్ ఏ స్మైల్‌కు అపూర్వ స్పందన.. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమాను లు చేపట్టిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి భారీ స్పం దన వచ్చింది. కేటీఆర్ అనుచరులు, అభిమానులు, మిత్రులు, సన్నిహితులు తమ వంతుగా ఏదో ఒక మంచి పని చేసి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రక్తదానాలు, పుస్తకాలు, సైకిళ్ల వితరణ, హరితహా రం, విద్యార్థులకు ఆర్థిక సాయం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన వంతుగా విద్యార్థులకు ఇంగ్లిష్ డిక్షనరీలు పంచారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ముగ్గురికి ఆర్థిక సహాయం అందజేశారు. తన నియోజకవర్గానికి చెందిన వి.నవ్య అనే పేద విద్యార్థి ఉన్నత చదువుల కోసం, తెలంగాణ ఉద్యమం సందర్భంగా గాయపడిన శివ, రాజులకు రూ.లక్ష చొప్పున సాయం చేశారు. కాగా, తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి, గిఫ్ట్ ఏ స్మైల్ కింద సమాజ సేవ చేసిన అందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో హిమాన్షు.. తన తండ్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా భోజనాలు వడ్డించారు. రహమత్ నగర్‌లోని కుమార్ స్కూల్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవస్థానంలో కేటీఆర్ పేరు మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
అవినీతి అంతం తథ్యం!
సాక్షి, హైదరాబాద్: అర్థవంతమైన సంస్కరణలు అభివృద్ధిలో భాగమేనని, కొత్త మున్సిపల్ చట్టాన్ని చాలా పదును, పటుత్వంతో శక్తివంతంగా రూపొందించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పేర్కొన్నారు. పురపాలనలో సామాన్యుల పాలిట శాపంగా మారిన అవినీతి చీడ ఈ చట్టంతో తొలగిపోతుందని, రాజకీయ జోక్యం కూడా తగ్గిపోతుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ మొండితనం, సంకల్పం తెలిసినవారు పూర్తిగా చట్టాన్ని అవగాహన చేసిన తర్వాతే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. శుక్రవారం శాసనసభ నిరవధిక వాయిదా అనంతరం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. శాసనసభ్యులమైన తాము శాసనాలు చేయడం మర్చిపోయి రోడ్లు, డ్రైనేజీలంటూ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఈ కొత్త చట్టంతో అలాంటి పరిస్థితి మారిపోతుందని.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యం, బాధ్యతలు ఈ చట్టంతో పెరిగాయని వివరించారు. కొత్త చట్టం పౌరుల చేతుల్లోనే స్వీయ నిర్ణయాధికారాన్ని పెట్టిందని, తద్వారా ప్రజలపై కూడా బాధ్యతలు మోపినట్టవుతుందన్నారు. ప్రజలపై బాధ్యతలు పెట్టడంతో పాటు విధులను విస్మరించినా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పదవీచ్యుతులయ్యేలా చట్టాన్ని రూపొందించారని చెప్పారు. నలుగురు గెలిస్తేనే ఆగట్లేరు.. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలలో చిప్‌లు పెట్టామన్నారు. మరి బ్యాలెట్ పోరు ద్వారా జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మా విజయం గురించి ఏమంటారు? రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా పరిషత్ స్థానాలు ఒకే పార్టీ గెలుచుకోవడం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీకైనా సాధ్యమైందా’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. నలుగురు ఎంపీలు గెలిస్తేనే బీజేపీ నేతలు ఆగట్లేరని, ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ బలమేంటో మున్సిపల్ ఎన్నికల్లో తేలుతుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నుంచి ఎవరు దొరుకుతారా అని, ఎవరిని పార్టీలోకి తీసుకోవాలా అని బీజేపీ ఎదురుచూస్తోందని విమర్శించారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదన్న కేటీఆర్.. ఆ పార్టీకి చెందిన ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన ఖర్మ తనకు లేదన్నారు. గవర్నర్ మారతారంటూ వస్తున్న వార్తలు ఊహాజనితమేనని, అలాంటిదేదైనా జరిగినప్పుడు వ్యాఖ్యానించడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఏపీ రాజకీయాలపై ప్రశ్నించగా.. ఆంధ్రప్రదేశ్‌లో, కర్ణాటకలో ఏవో జరుగుతున్నాయి.. వాళ్ల గొడవ మనకెందుకని దాటవేశారు. 35 లక్షల సభ్యత్వాలు పూర్తి.. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం బ్రహ్మాండంగా నడుస్తోందని కేటీఆర్ తెలిపారు. ఈనెల 17 వరకు 35 లక్షల సభ్యత్వాలు అయ్యాయని వివరించారు. ఇంకా చాలా చోట్ల సభ్యత్వాలు పూర్తయినా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోలేదని, ఇప్పటివరకు సభ్యత్వాల ద్వారా రూ.7 కోట్లు వసూలయ్యాయని చెప్పారు. గతం కన్నా ఎక్కువ సభ్యత్వాలు అవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. జర్నలిస్టుల బాధ్యత నాది.. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదేనని కేటీఆర్ హామీ ఇచ్చారు. ‘‘ఇళ్ల స్థలాల కోసం సీఎంను కొందరు ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు కలిశారు. వారం రోజుల్లో ప్రక్రియ ప్రారంభించాలని ఆయన సీఎంవో అధికారులకు చెప్పినట్టు నాకు సమాచారం ఉంది. ఎమ్మెల్యేలతో పాటే జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు వస్తాయి. ఈ విషయంలో ఐ అండ్ పీఆర్ కమిషనర్, ప్రెస్ అకాడమీ చైర్మన్లతో మాట్లాడతా. త్వరలోనే జర్నలిస్టు ప్రతినిధులతోనూ సమావేశమవుతా’’ అని కేటీఆర్ తెలిపారు. గుండెకాయలాంటి హైదరాబాద్‌ను కాపాడుకోవాలి రాజధాని శివార్లలోని 7 మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చడం చాలా మంచి నిర్ణయమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ముంబై చుట్టూ ఏడు కార్పొరేషన్లు ఉంటాయని, అలాగే హైదరాబాద్ శివార్లలోని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చారని చెప్పారు. గుండెకాయ లాంటి హైదరాబాద్‌ను సవ్యంగా కాపాడుకోవాలంటే అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్ల ద్వారా సిబ్బంది పెరిగి ప్రజలకు సేవలు విస్తృతంగా అందుతాయని వివరించారు. ఆయా కార్పొరేషన్ల పరిధిలో పన్నులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్ చెప్పినట్టు వెల్లడించారు. కొత్త మున్సిపల్ చట్టంలోని స్ఫూర్తి జీహెచ్ఎంసీకి కూడా వర్తిస్తుందని స్పష్టంచేశారు. అందరూ కట్టుకుంటున్నారు.. ‘‘ఐదారు రాష్ట్రాలు కొత్త సచివాలయాలు, అసెంబ్లీలు కట్టుకుంటున్నాయి. గాంధీనగర్‌లో మొత్తం మార్చేశారు. మనం మార్చుకుంటే తప్పేముంది? ఈ భవనాలు ఇంకో 100 ఏళ్ల పాటు ఉపయోగపడతాయి కదా’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఆగిపోయిందని కేంద్రం చెప్పలేదని, భూసేకరణ భారంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 50శాతం ఇవ్వాలని చెప్పినట్టు తనకు సమాచారం ఉందని వెల్లడించారు. ప్రతిపక్షాలకు ఏ అంశంపై మాట్లాడాలో అర్థం కాక ఇలాంటి వాటిపై స్పందిస్తున్నాయని, ప్రజలకు సంబంధించిన అంశాలను గుర్తించడంలో ప్రతిపక్షాలు విఫలమ్యాయని విమర్శించారు. ప్రతిపక్షంలో నాయకత్వ సంక్షోభం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేయాల్సింది చేసింది.. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలదేనని, ఎమ్మెల్యేలు లేని చోట్ల నియోజకవర్గ ఇన్చార్జులు చూసుకుంటారని కేటీఆర్ తెలిపారు. పెంచిన పింఛన్లు కూడా పంపిణీ చేస్తున్నామని, 75 గజాల భూమికి ఆస్తి పన్ను తగ్గించామని, భగీరథ ద్వారా దాదాపు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు నీళ్లు అందించడం.. ఇలా ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేశామని స్పష్టంచేశారు. ఇక స్థానిక నేతలు సమన్వయం చేసుకుని మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. ఈ ఎన్నికల్లో అగ్రభాగం తామే గెలుచుకుంటామని, రెండో స్థానంలో ఎవరుంటారో కాంగ్రెస్, బీజేపీలే తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడనేది కోర్టు నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని, త్వరలోనే జరుగుతాయని తాను అనుకుంటున్నానని చెప్పారు. -
కోదండరామ్‌వి మాయమాటలు
మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ మాయమాటలు చెబుతున్నారని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. నిరుద్యోగుల ర్యాలీ పేర వివిధ ప్రాంతాలు పర్యటిస్తున్న కోదండరామ్ కాకిలెక్కలు చెబుతూ విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సోమవారం మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశాం, ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేశాం’ అన్న అంశాలను ప్రభుత్వం గణాంక వివరాలతోసహా వెల్లడించినా కోదండరామ్ నిరుద్యోగులను తప్పుదారి పట్టించేలా మోసపూరిత మా టలు చెబుతున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని సీఎం కేసీఆర్ ఎప్పుడూ అనలేదని పల్లా వివరించారు. -
టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా అసెంబ్లీలో టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయాన్ని సీఎం కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాసనసభాపక్ష నాయకుని స్థానంలో కేసీఆర్ ఆసీనులయ్యారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అమరవీరులకు నివాళి: శాసనసభ ప్రారంభానికి ముందుగానే తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న స్మారక స్థూపం నుండి శాసనసభకు కాలినడకన వచ్చారు. శాసనసభా వ్యూహరచనా కమిటీ ఏర్పాటు.. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి వ్యూహ రచనా కమిటీని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ బుధవారం ఉదయమే సమావేశమైంది. శాసనసభా సమావేశాలున్నంత కాలం ఈ కమిటీ ఉదయం 8.30కే సమావేశమై, ఆ రోజు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తుంది. ఈ కమిటీకి చైర్మన్‌గా మంత్రి హరీశ్‌రావు, సభ్యులుగా మంత్రులు టి.పద్మారావు, పోచారం, కేటీఆర్, శాసనసభ్యులు కె.లక్ష్మారెడ్డి, దాస్యం వినయ్ బాస్కర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు వ్యవహరిస్తారు.