breaking news
Troy company
-
చౌక కాల్స్, డేటాకు చెల్లు!!
న్యూఢిల్లీ: చౌక మొబైల్ కాల్స్, డేటా విధానానికి స్వస్తి పలుకుతూ .. కనీస చార్జీలు వడ్డించే ప్రతిపాదనలపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ దృష్టి సారించింది. దీనిపై తాజాగా చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఇటు టెల్కోలు, అటు కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టారిఫ్‌ల విషయంలో నియంత్రణ సంస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరంపైనా, మొబైల్ సర్వీసెస్ కనీస చార్జీలను నిర్ణయించడంపైనా సంబంధిత వర్గాల అభిప్రాయాలు కోరింది. ఒకవేళ కనీస చార్జీలు నిర్ణయించాల్సి వస్తే కొత్త ఆపరేటర్లకు అకస్మాత్తుగా లాభాలు వచ్చి పడకుండా అనుసరించతగిన విధానాలపైనా అభిప్రాయాలను ఆహా్వనించింది. ఇందుకు వచ్చే ఏడాది జనవరి 17 దాకా గడువు ఉంటుంది. వీటిపై కౌంటర్–కామెంట్స్ సమరి్పంచడానికి జనవరి 31 ఆఖరు తేది. ‘టెలికం రంగంలో శరవేగంగా మారే టెక్నాలజీలను అందుకోవాలంటే భారీ పెట్టుబడులు కావాలి. ఎకానమీలో వివిధ రంగాలకు కీలకంగా మారిన టెలికం రంగం ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. టెలికం రంగ సమస్యలు పరిష్కరించేందుకు, పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత వర్గాలంతా చర్చించాల్సిన అవసరం ఉంది‘ అని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది. యూ టర్న్... టెలికం రంగంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తాజా ట్రాయ్ చర్చాపత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం.. టారిఫ్‌ల విషయంలో టెల్కోలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. టారిఫ్ ప్లాన్లను ప్రకటించిన వారం రోజుల్లోగా ట్రాయ్‌కు తెలిపితే సరిపోతుంది. కాబట్టి యూజర్లను ఆకర్షించేందుకు టెల్కోలు పోటాపోటీగా ఉచిత, అత్యంత చౌక ప్లాన్స్ కూడా అందిస్తూ వచ్చాయి. ఒకవేళ కనీస చార్జీల విధానం గానీ అమల్లోకి వస్తే.. ఉచిత సరీ్వసులకు ఇక కాలం చెల్లినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ.. టెలికం రంగాన్ని గట్టెక్కించేందుకు పరిశీలించతగిన చర్యలంటూ అక్టోబర్‌లో చేసిన సిఫార్సుల్లో ఈ కనీస చార్జీల ప్రతిపాదన కూడా ఉంది. అటు పాత టెల్కోలు కూడా దీన్ని గట్టిగా కోరుతున్నాయి. రిలయన్స్ జియో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత రెండేళ్ల క్రితం టెల్కోలు ఇలాంటి ప్రతిపాదనే చేసినప్పటికీ.. ఇది సాధ్యపడే విషయం కాదని ట్రాయ్ తోసిపుచి్చంది. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో దీన్ని పరిశీలించాలని భావిస్తోంది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టులో ప్రతికూల ఆదేశాలు రావడంతో టెల్కోలు దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సెపె్టంబర్ క్వార్టర్లో వొడాఫోన్ ఐడియా రికార్డు స్థాయిలో రూ. 50,922 కోట్ల మేర నష్టాలు ప్రకటించింది. అటు ఎయిర్టెల్ కూడా రూ. 23,045 కోట్లు నష్టాలు ప్రకటించింది. 2021 దాకా ఐయూసీ కొనసాగింపు న్యూఢిల్లీ: టెలికం సంస్థల ఇంటర్‌కనెక్ట్ యూసేజీ చార్జీల (ఐయూసీ) విధానాన్ని 2021 జనవరి 1 దాకా కొనసాగించాలని ట్రాయ్ నిర్ణయించింది. ఆ తర్వాత నుంచి ఈ చార్జీలు పూర్తిగా ఎత్తివేసేలా ప్రతిపాదనలు చేసింది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి కాల్స్ స్వీకరించినందుకు.. టెల్కోలు వసూలు చేసే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది నిమిషానికి 6 పైసలుగా ఉంది. ఈ విధానాన్ని 2020 జనవరి 1 నుంచి ఎత్తివేసే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ.. దీన్ని 2021 దాకా కొనసాగించాలని ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న టెలికం రంగానికి ఇది కాస్త ఊరటనిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతంలో 14 పైసలుగా ఉన్న ఐయూసీ చార్జీలను ట్రాయ్ 2017 అక్టోబర్‌లో 6 పైసలకు తగ్గించింది. దీంతో టెలికం సంస్థలు రూ. 11,000 కోట్ల మేర నష్టపోయాయని అంచనా. ఒకవేళ 6 పైసల ఐయూసీని కూడా ఎత్తివేసిన పక్షంలో పరిశ్రమపై మరో రూ. 3,672 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడేది. దీనితో పాటు వినియోగదారుల ప్రయోజనాలు, టెలికం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఐయూసీ స్థానంలో కొత్త బీఏకే (బిల్ అండ్ కీప్) విధానం అమలును ఏడాది పాటు వాయిదా వేసినట్లు ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ నిర్ణయాన్ని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ స్వాగతించింది. ఐయూసీని పరిగణనలోకి తీసుకునే టెల్కోలు ఇటీవల చార్జీలను పెంచినందున.. వినియోగదారులపై కొత్తగా దీని ప్రభావమేమీ ఉండబోదని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు. -
ఐయూసీ తగ్గింపుతో జియోకే లాభం
►పాత టెల్కోలకు ప్రతికూలం ►రేటింగ్ ఏజెన్సీల విశ్లేషణ ►జియోకి ఏటా 600 మిలియన్ డాలర్ల ప్రయోజనమని ఫిచ్ అంచనా ►పరిశ్రమకు రూ. 5 వేల కోట్ల నష్టమన్న సీవోఏఐ ►శాస్త్రీయంగానే నిర్ధారించామన్న ట్రాయ్ ముంబై: ఇంటర్ యూసేజ్ చార్జీలను సగానికి సగం తగ్గించేస్తూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తీసుకున్న నిర్ణయం టెలికం పరిశ్రమలో దుమారం రేపుతోంది. తమ ఆదాయాలకు గండి కొడుతూ, కొత్త కంపెనీ (రిలయన్స్ జియో)కి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ పాత టెల్కోలు ఆరోపించాయి. గతం నుంచి ఉన్న ఆపరేటర్ల ఆదాయాలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని అటు రేటింగ్ ఏజెన్సీలు కూడా అభిప్రాయం వ్యక్తం చేశాయి. అదే సమయంలో కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించిన రిలయన్స్ జియోకి మాత్రం ప్రయోజనం చేకూర్చగలదని పేర్కొన్నాయి. ‘ట్రాయ్ నిర్ణయం మధ్యకాలికంగా ప్రస్తుత పెద్ద సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో కొత్త కంపెనీ రిలయన్స్ జియోకి ప్రయోజనం చేకూరుస్తుంది‘ అని దేశీ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. పాత టెల్కోల నుంచి జియోకి ఏటా 600 మిలియన్ డాలర్ల మేర ప్రయోజనాల బదలాయింపు జరుగుతుందని అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. జియోకి గణనీయంగా వ్యయాల ఆదా అవుతుందని, ప్రీ–ట్యాక్స్ లాభాలకు సంబంధించి ఊహించిన దానికన్నా చాలా ముందుగానే బ్రేక్ ఈవెన్ సాధించగలదని పేర్కొంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి పాత టెల్కోలు ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ సంస్థల ప్రీ–ట్యాక్స్ లాభాలు (పన్ను లెక్కించడానికి ముందుగా నమోదయ్యేవి) 3–6 శాతం మేర దెబ్బ తినొచ్చని ఫిచ్ తెలిపింది. ట్రాయ్ నిర్ణయం ఒకే ఆపరేటరుకు ప్రయోజనం కలిగించేదిగా ఉందని, ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న పరిశ్రమపై ఇది మరింత భారం పెంచుతుందని ఎయిర్టెల్, వొడాఫోన్ ఆందోళన వ్యక్తం చేశాయి. ట్రాయ్ది ’నియంత్రణలపరమైన తిరోగమన చర్య’గా వొడాఫోన్ అభివర్ణించింది. తమ నెట్వర్క్ నుంచి వచ్చే కాల్స్‌ను స్వీకరించినందుకు గాను పోటీ టెలికం సంస్థలకు టెల్కోలు చెల్లించే చార్జీలను ఇంటర్యూసేజ్ చార్జీలుగా(ఐయూసీ) వ్యవహరిస్తారు. ఎక్కువమంది యూజర్లు ఉన్న ఆపరేటర్‌కు ఈయూసీ ద్వారా అధిక రాబడి లభిస్తుంది. ప్రస్తుతం 14 పైసలుగా ఉన్న ఐయూసీని అక్టోబర్ 1 నుంచి ఆరు పైసలకు తగ్గించాలని (57% తగ్గుదల), 2020 నాటికి పూర్తిగా సున్నా స్థాయికి చేర్చాలని ట్రాయ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టుకెళ్లాలని పాత టెల్కోలు యోచిస్తోన్నట్లు సమాచారం. ఎలా లెక్కగట్టారో చెప్పాలి: సీవోఏఐ ఐయూసీ కోతతో పాత టెల్కో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,000 కోట్ల మేర ఆదాయ నష్టం జరుగుతుందని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ అంచనా వేసింది. ఐయూసీ 14 పైసల చొప్పున గతేడాది పరిశ్రమకు రూ.10,000 కోట్లు రాగా, 6 పైసల స్థాయిలో ఇది రూ.5,000 కోట్లకు పడిపోతుందని పేర్కొంది. అసలు ఐయూసీని 6 పైసలుగా ఏ ప్రాతిపదికన లెక్కించారో ట్రాయ్ చెప్పాలని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మ్యాథ్యూస్ డిమాండ్ చేశారు. ఆపరేటర్లంతా కూడా వీవోఎల్టీఈ టెక్నాలజీకి మారతారన్న ట్రాయ్ అంచనాలు ఆచరణ సాధ్యం కాదని చెప్పారు. ఎవరిపైనా పక్షపాతం లేదు: ట్రాయ్ ఐయూసీ చార్జీల తగ్గింపు నిర్ణయంలో పారదర్శకత లోపించిందనే ఆరోపణలను ట్రాయ్ తోసిపుచ్చింది. శాస్త్రీయ అంశాల ఆధారంగా, వినియోగదారులు.. పరిశ్రమ ప్రయోజనాలు, అభివృద్ధి చెందిన టెక్నాలజీ, పోటీ మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎవరిపైనా పక్షపాత ధోరణి లేదని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ స్పష్టం చేశారు. వ్యయాలను మార్చే అధికారమేదీ తమకు లేనప్పుడు, ఒకరిని దెబ్బతీసేలా మరొకరిని ప్రోత్సహించేలా వ్యవహరించే ప్రశ్నే తలెత్తదని ఆయన పేర్కొన్నారు. ఏ ప్రాతిపదికన ఐయూసీ తగ్గింపు నిర్ణయం తీసుకున్నది గణాంకాలన్నీ బహిరంగంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. టెలికం రంగంపై ప్రతికూల అంచనాలు.. గత ఆర్థిక సంవత్సరంలో జియో ఇతర టెల్కోలకు రూ. 2,589 కోట్లు ఐయూసీ కింద చెల్లించినట్లు ఇక్రా తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారతి ఎయిర్‌టెల్‌కే 75 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 480 కోట్లు) మేర జియో నుంచి వచ్చినట్లు ఫిచ్ అంచనా వేసింది. ఐయూసీ కోత, పోటీ ఒత్తిళ్ల కారణంగా ఎయిర్టెల్ ఆదాయం, ప్రీట్యాక్స్ లాభాలు సుమారు 5 శాతం మేర తగ్గొచ్చని తెలిపింది. టెలికం రంగంపై ప్రతికూల అంచనాలు కొనసాగిస్తున్నట్లు వివరించింది. మరింత మంది కొత్త యూజర్లను ఆకర్షించేందుకు జియో మరిన్ని కొత్త ఆఫర్లతో సిద్ధమవుతోందని, 2018 నాటికి ఆదాయాలపరంగా కంపెనీ మార్కెట్ వాటా రెట్టింపై 10%కి చేరగలదని పేర్కొంది. అటు ఐయూసీ కోతతో పాత టెల్కోల స్థూల లాభాలు ఈ ఆర్థిక సంవత్సరం 3–5%, వచ్చే ఏడాది 6–10%, 2020లో 7–12% మేర దెబ్బతినొచ్చని దేశీ బ్రోకరేజి సంస్థ కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. భారతీ ఎయిర్‌టెల్‌పై అత్యల్పంగా, ఐడియా సెల్యులార్‌పై అత్యధికంగా ఉండగలదని వివరించింది.