breaking news
Trinamool Congress MPs
-
మహాజన్ కు కళ్యాణ్ బెనర్జీ క్షమాపణ
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ క్షమాపణలు చెప్పారు. రైల్వే బడ్జెట్ లో పశ్చిమ బెంగాల్ కు అన్యాయం జరిగిందంటూ లోక్సభ కార్యకలాపాలను తృణమూల్ ఎంపీలు అడ్డుకున్నారు. పోడియం వద్దకు దూసుకెళ్లి గందరగోళం సృష్టించారు. ఈ సందర్భంగా స్పీకర్ కు వ్యతిరేకంగా కళ్యాణ్ బెనర్జీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 'మీరు బీజేపీ స్పీకర్ కాదు. మీరు నరేంద్ర మోడీ స్పీకర్ కాదు' అంటూ వ్యాఖ్యానించారు. కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలపై అధికార కూటమి మండిపడింది. రైల్వే బడ్జెట్ సందర్భంగా లోక్సభలో అధికార బీజేపీ ఎంపీ ఒకరు మద్యం తాగొచ్చి అల్లరి చేశారని కళ్యాణ్ బెనర్జీ మంగళవారం ఆరోపించారు. అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారని మండిపడ్డారు. కల్యాణ్ బెనర్జీ సభ నుంచి బయటకు వెళుతుంటే ఓ బీజేపీ ఎంపీ బెదిరించారని తృణమూల్ మహిళా ఎంపీ కకోలి ఘోష్ తెలిపారు. -
దెబ్బకు దెబ్బ!
సమకాలిన రాజకీయాల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి నాయకులు ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. అదును చూసి చులాగ్గా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించేందుకు వచ్చిన ఎటు వంటి అవకాశాన్నైనా ఒడుపుగా పట్టుకోవడానికి తహ తహ లాడుతుంటారు. కలకత్తా కాళీగా పేరు గాంచిన మమతా బెనర్జీ ఈ కోవలోని నాయకురాలే. బెంగాల్ లో తమ అనుమతి లేకుండా బీజేపీ పర్యటించినందుకు కోపగించిన దీదీ రెండు రోజులు తిరక్కుండానే దెబ్బకు దెబ్బ తీశారు. 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లా భియాలీ ఖేలా గ్రామానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల బృందాన్ని పంపి కమలనాథులకు కంగారు పుట్టించారు. రాజ్యసభ సభ్యుడు సుఖెందు శేఖర్ రే నేతృత్వంలోని ఐదుగురు ఎంపీల బృందం బుధవారం భియాలీ ఖేలా గ్రామాన్ని సందర్శించి బాధితురాలి బంధువులను పరామర్శించారు. ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భియాలీ ఖేలాలో ఓ గిరిజన మహిళపై ఆమె భర్త, బంధువులు సహా పది మంది సామూహిక అత్యాచారానిక పాల్పడిన ఘటన వెలుగు చూడడంతో కలకలం రేగింది. బెంగాల్ లో హింస చోటుచేసుకున్న ప్రాంతాల్లో బీజేపీ కేంద్ర నాయకుల బృందం ఆదివారం పర్యటించింది. మమత బెనర్జీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ హింస పెరిగిందని ఇక్కడ పర్యటించిన బల్బీర్ పుంజ్ నేతృత్వంలోని బీజేపీ ఎంపీల బృందం విమర్శించింది. తన అనుమతి లేకుండానే కాషాయ ఎంపీలు బెంగాల్ గడ్డపై అడుగు పెట్టడమే కాకుండా తనపై విమర్శలు గుప్పించడంతో దీదీకి కోపమొచ్చింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ కు పంపి ఎత్తుకు పైఎత్తు వేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎటువంటి హింస జరిగినా తమ ఎంపీలను పంపుతానని బహిరంగంగా ప్రకటించి కమలనాథులకు సవాల్ విసిరారు. దీదీ, కమల్ నాథుల ఎత్తులు పైఎత్తులు ఎక్కడివరకు వెళతాయో చూడాలి.