breaking news
Transfers to employees
-
ఎట్టకేలకు బదిలీలు
మంగళవారం ఉదయం వరకు జరిగిన కౌన్సెలింగ్ 162 మందికి బదిలీలు మచిలీపట్నం (చిలకలపూడి) : జిల్లా పరిషత్ సమావేశపు హాలులో ఎట్టకేలకు పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ బదిలీలు జరిగాయి. వారం రోజులుగా బదిలీలు ఏ విధంగా జరుపుతారోనని సిబ్బందిలో ఆందోళన మొదలైంది. సోమవారంతో బదిలీల ప్రక్రియ సమయం ముగియనున్నందున బదిలీలు ఎక్కడ జరుపుతారో, ఏవిధంగా జరుపుతారో సిబ్బందిలో అయోమయం నెలకొంది. అయితే ఎట్టకేలకు సోమవారం రాత్రి సీనియార్టీ జాబితాలు విడుదల చేశారు. ఈ జాబితాలను పరిశీలించిన మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు, చైర్పర్సన్ గద్దె అనూరాధ, సీఈవో నాగార్జునసాగర్‌తో చర్చలు జరిపారు. మండల పరిషత్, జిల్లా పరిషత్‌లో పనిచేసే సిబ్బంది పనితీరును ఒకే రకంగా మార్పులు చేశారని అలా కాకుండా మండల పరిషత్, జిల్లా పరిషత్‌లలో పనిచేసే సిబ్బంది సర్వీసు వివరాలు తప్పులతడకగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వీస్ సీనియార్టీపై 15 మార్కులు, ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న సిబ్బందికి విధి నిర్వహణను బట్టి 10 మార్కులు, బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా కొన్ని మార్కులు కలపాల్సి ఉన్నాయన్నారు. ఇవి కాకుండా స్వీయ మదింపు ద్వారా కొన్ని మార్పులు కలపాలని కలెక్టర్ ఆదేశాల ప్రకారం జాబితా తయారు చేశారని ఈ జాబితాలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి కిందిస్థాయి సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలని సంఘ నాయకులు చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆమె స్పందించి సిబ్బందికి అనుకూలంగా ఎటువంటి అన్యాయం జరగకుండా జాబితాను తయారుచేయాలని సూచించారు. దీంతో సోమవారం రాత్రి ఒంటి గంటకు వివిధ క్యాడర్ల వారీగా బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజాము వరకు ఈ కౌన్సెలింగ్ కొనసాగింది. క్యాడర్ల వారీగా బదిలీ అయిన సిబ్బంది వివరాలు ఇలా ఉన్నాయి జిల్లాలో ఐదేళ్లు దాటిన సిబ్బంది 156 మంది బదిలీ కాగా మూడు సంవత్సరాలు దాటి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆరుగుర్ని బదిలీ చేశారు. ముందుగా ఎంపీడీవోల్లో ఆగిరిపల్లిలో పనిచేస్తున్న కె.బసవరావు పమిడిముక్కల ఎంపీడీవోగా, జగ్గయ్యపేటలో పనిచేస్తున్న జయచంద్రను వత్సవాయి ఎంపీడీవోగా, మొవ్వలో పనిచేస్తున్న పిచ్చిరెడ్డిని జగ్గయ్యపేట ఎంపీడీవోగా బదిలీ చేశారు. వీరు కాక సూపరింటెండెంట్లు ముగ్గురు, సీనియర్ అసిస్టెంట్లు 11, జూనియర్ అసిస్టెంట్లు 17, టైపిస్ట్‌లు ఆరుగురు బదిలీ చేశారు. రికార్డు అసిస్టెంట్లు 32 మంది, ల్యాబ్ అసిస్టెంట్లు 15 మంది, లైబ్రరీ అసిస్టెంట్లు 14 మంది, అటెండర్లు 43, నైట్వాచ్మెన్లు ఏడుగురు, గార్డెనెర్లు ఐదుగుర్ని బదిలీ చేశారు. వీరు కాక మూడు సంవత్సరాలు దాటిన సీనియర్ అసిస్టెంట్ ఒకటి, జూనియర్ అసిస్టెంట్లు నలుగురు, టైపిస్ట్ ఒకర్ని బదిలీ చేశారు. పంతం నెగ్గించుకున్న చైర్పర్సన్ జిల్లా పరిషత్ సిబ్బంది బదిలీల విషయంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం బదిలీల ప్రక్రియను చైర్పర్సన్ గద్దె అనూరాధ బదిలీల కౌన్సెలింగ్‌ను నిర్వహించారు. ప్రభుత్వం నుంచి బదిలీల మార్గదర్శకాలు వచ్చిన అనంతరం అన్నిశాఖల్లో సిబ్బంది బదిలీలను కలెక్టర్ బాబు.ఎ ఆదేశాల ప్రకారం నిర్వహించాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బదిలీల ప్రక్రియను చట్టప్రకారం నిర్వహించాల్సి ఉండగా కలెక్టర్ జోక్యం చేసుకోవటంతో ఆమె ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలో బదిలీల ప్రక్రియలో సిబ్బందికి ఇబ్బందులు జరుగుతున్నాయని గ్రహించిన చైర్పర్సన్ ఉద్యోగులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆమె సిబ్బంది సమక్షంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా కొంత మంది ఉద్యోగులకైనా న్యాయం జరిగిందని సంఘ నాయకులు చెప్పుకోవటం గమనార్హం. -
బదిలీ భయం
ఇంద్రకీలాద్రిపై జోరుగా ఊహాగానాలు 40 మంది ఉద్యోగులు బదిలీ అంటూ ప్రచారం దీర్ఘకాలంగా పాతుకుపోయిన సిబ్బంది కృష్ణా పుష్కరాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం? విజయవాడ : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఉద్యోగులకు బదిలీల ఫీవర్ పట్టుకుంది. ఈనెల 15వ తేదీ వరకు బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ టెన్షన్ టెన్షన్‌గా ఉన్నారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న సిబ్బందిని మారిస్తే బాగుంటుందని దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ భావిస్తున్నారు. దీనికితోడు ఇటీవల దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు నగరానికి వచ్చినప్పుడు తమ శాఖలో బదిలీలు ఉంటాయని చెప్పడంతో ఇంద్రకీలాద్రిపై ఈ ప్రచారం మరింత జోరందుకుంది. 2006 తరువాత బదిలీలే లేవు.. 2006లో అప్పటి కమిషనర్ ఏబీ కృష్ణారావు రాష్ట్రంలోని 12 దేవాలయాల్లో భారీగా మార్పులు చేర్పులు చేశారు. ఏఈవో స్థాయి నుంచి అటెండర్ వరకు పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరిగింది. అప్పట్లో దుర్గగుడిలో పనిచేసిన ఉద్యోగిని శ్రీకాళహస్తికి కూడా బదిలీ చేశారు. ఆ తరువాత కాలంలో అధికారులు, సిబ్బంది తమ పరపతిని ఉపయోగించుకుని తిరిగి సొంత దేవాలయాలకు చేరుకున్నారు. 2010 నాటికి దరిదాపుగా సిబ్బంది అంతా ఎక్కడివారు అక్కడికి వచ్చేశారు. అప్పటి నుంచి పని సర్దుబాటు కోసమో, ఉద్యోగుల కోరిక మేరకో బదిలీలు జరుగుతున్నాయి తప్ప పెద్ద ఎత్తున జరగలేదు. తిరిగి ఇప్పుడు సమూలంగా ప్రక్షాళన చేయాలని ఆ శాఖ మంత్రి, కమిషనర్ భావిస్తున్నారు. దీర్ఘకాలంగా పాతుకుపోయిన ఉద్యోగులు దుర్గగుడిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 70శాతం మంది సిబ్బంది ఇక్కడే దీర్ఘకాలంగా పాతుకుపోయారు. తప్పని పరిస్థితుల్లో పెనుగంచిప్రోలు దేవాలయంలోనో, ద్వారకా తిరుమల దేవస్థానంలోనో కొద్దిరోజులు చేసి తిరిగి స్వస్థలానికి చేరుకుంటున్నారు. దీర్ఘకాలంగా ఇక్కడే పాతుకుపోయి ఉండటంతో దేవస్థానంలోని పనులను బినామీ పేర్లతో తామే చేయడం, ఖాళీ అవుతున్న పోస్టులపై దృష్టిపెట్టి తమ వారికి తెచ్చుకోవడంపైనే శ్రద్ధ చూపుతున్నారు. దేవస్థానంలో ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేసే సిబ్బందిలో మూడొంతుల మందికి పర్మినెంట్ ఉద్యోగులతో బంధుత్వాలు ఉన్నాయి. దేవస్థానానికి చెందిన ఒక మహిళా ఇంజినీర్ తన తమ్ముడిని తాత్కాలిక ఇంజినీర్‌గా నియమించుకోవడమే ఇందుకు ఉదాహరణ. ఇక శానిటేషన్, ప్రసాదాల తయారీ తదితర విభాగాల్లో టెండర్లు, క్యాంటీన్ లీజులు, దుకాణాలు.. సిబ్బంది బినామీలకే దక్కుతున్నాయి. 40 మందికి బదిలీలు? ప్రస్తుతం దేవస్థానంలో సమూల ప్రక్షాళన చేస్తే తప్పా కృష్ణా పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించడం కష్టం. ఇప్పుడు చేయకపోతే పుష్కరాలు పూర్తయ్యే వరకు చేయకూడదు. మధ్యలో బదిలీలు చేస్తే ఇబ్బంది అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేవస్థానం నుంచి 40 మందిని సాగనంపాలనే ఆలోచనలో కమిషనర్ ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ వారంలోనే బదిలీలు జరుగుతాయా? లేక సిబ్బంది యధావిధిగా కొనసాగుతారా? అనేది వేచిచూడాలి.