breaking news
Traffic iland
-
ఎవరి మేలుకో!
సాక్షి, అనంతపురం : అనంతపురం నగరంలో ట్రాఫిక్ ఐల్యాండ్లు, డివైడర్లు అధికారులు, పాలకులకు ఆదాయ వనరులుగా మారాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పాలకుల సూచనల మేరకు అధికారులు వీటిని ఇష్టమొచ్చిన రీతిలో మార్చేస్తున్నారు. నగరంలో ప్రధానంగా నాలుగు రోడ్లు ఉన్నాయి. అవి.. రాజు, సుభాష్, చర్చి, ఐరన్ బ్రిడ్జి రోడ్లు. వీటికి ఇరువైపులా అన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయి. నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా ఈ రోడ్లే కీలకం. రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ) నిబంధనల ప్రకారం ప్రధాన కూడళ్లలో డివైడర్‌కు అటూ ఇటు 15 మీటర్లకు పైగా ఉండాలి. దాంతో పాటు ఫుట్‌పాత్‌లు తప్పనిసరి. నగర జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. వాహనాల రద్దీ కూడా అధికమైంది. అయితే.. అందుకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టడం లేదు. ట్రాఫిక్ ఐల్యాండ్లు, డివైడర్లను మాత్రం ఇష్టానుసారం ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య మరింత జఠిలమవుతోంది. చేసిన పనే మూడు సార్లు సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో సుభాష్ రోడ్డులోని డివైడర్లను ఉద్యమ కారులు ధ్వంసం చేశారు. అప్పట్లో దాతల సహకారంతో మునిసిపల్ అధికారులు వాటిని పునరుద్ధరించారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో అవి మళ్లీ ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత కొద్దికాలానికి సార్వత్రిక ఎన్నికలు జరిగి.. టీడీపీ అధికారంలోకి వచ్చింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి(టీడీపీ) ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ అధికారులు రూ.1.80 లక్షలు ఖర్చు చేసి ఆగమేఘాలపై డివైడర్లను ఏర్పాటు చేశారు. మూడు నెలలు తిరగకుండానే కొత్త పాలకవర్గం కడ్డీలతో కూడిన సిమెంటు డివైడర్ల ఏర్పాటుకు రూ.16.66 లక్షలతో టెండర్లను ఆహ్వానించింది. అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు లెస్‌కు దక్కించుకున్నారు. గోకుల్ షాపు నుంచి బిగ్‌సీ వరకు రూ.6.53 లక్షల అంచనాతో పిలిచిన టెండర్‌ను రూ.5.48 లక్షలకు, బిగ్‌సీ నుంచి టవర్‌క్లాక్ వరకు రూ.5.08 లక్షలతో పిలిచిన టెండర్‌ను రూ.4.91 లక్షలకు ఒకే కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఉన్న రేకుల డివైడర్లకు అటూ ఇటు మూడడుగుల మేర గుంతలు తీసి.. మూడు అడుగుల ఎత్తుతో సిమెంటు డివైడర్లను నిర్మిస్తున్నారు. వాస్తవానికి డివైడర్‌కు ఇరువైపులా రోడ్డు 7.5 మీటర్ల చొప్పున ఉండాలి. మూడడుగుల మేర డివైడర్లే ఆక్రమిస్తుండడంతో ఎక్కడా ఆ మేరకు రోడ్డు కన్పించడం లేదు. గతంలోనూ ఇంతే గత పాలకవర్గ హయాంలోనూ నగర సుందరీకరణ పేరుతో రూ.లక్షలు ఖర్చు పెట్టారు. వరంగల్‌కు చెందిన ప్రముఖ ఇంజనీరు పిచ్చయ్యను తీసుకొచ్చి నగరంలో డివైడర్లు, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఐల్యాండుల ఏర్పాటుకు స్కెచ్చు గీయించారు. ఈ మేరకు రూ.లక్షలు ఖర్చు చేసి.. వాటిని నిర్మించారు. అవి ప్లానుకు అనుగుణంగా లేకపోవడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా మారాయి. దీంతో వాటిని పడగొట్టి కొత్తవి నిర్మించారు. సప్తగిరి సర్కిల్లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ఐల్యాండ్ పెద్దదిగా ఉండడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని పట్టించుకోని అధికారులు ప్రస్తుత పాలకవర్గాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. డివైడర్లు, ట్రాఫిక్ ఐల్యాండ్లను పాలకులకు ఆదాయ వనరుగా చూపించి.. తామూ కొంత దిగమింగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి సుభాష్‌రోడ్డు, పాతూరు రోడ్డు జాతీయ రహదారుల శాఖపరిధిలోకి వస్తాయి. చర్చిరోడ్డు ఆర్అండ్బీ పరిధిలోకి వస్తుంది. వీటిలో అక్రమ కట్టడాలను ఆ శాఖ అధికారులు కూల్చివేయాల్సి ఉంటుంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వాటి జోలికి వెళ్లడం లేదు. వాటిని కూల్చకుండా నగర సుందరీకరణ పేరుతో డివైడర్లు, ఐల్యాండ్లలో మార్పులు, చేర్పులు చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదని నగర ప్రజలు అంటున్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తాం ప్రజల వినతి మేరకే డివైడర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆర్అండ్బీ అధికారుల సహకారంతో రోడ్డు వెడల్పు చేపడతాం. అక్రమ కట్టడాలను కూల్చివేస్తాం. దీనిపై ఇప్పటికే వారికి లేఖ రాశాం. - మదమంచి స్వరూప, మేయర్ పాలకవర్గం అనుమతి మేరకే.. పాలకవర్గం, కమిషనర్ అనుమతి మేరకే టెండర్లు పిలిచి పనులు చేపడుతున్నాం. అన్ని పనులనూ కాంట్రాక్టర్లు అంచనా వ్యయం కంటే తక్కువ మొత్తానికిదక్కించుకున్నారు. నిధుల దుర్వినియోగం ఎక్కడా లేదు. - మల్లికార్జున, నగర పాలక సంస్థ ఈఈ -
నిఘానేత్రం
నగరంలోని గణేశ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ ఆఫీసుకని బైక్‌పై బయలుదేరా డు. ప్రతిమ మల్టిప్లెక్స్ వద్ద ట్రాఫిక్ ఐలెండ్‌లో ఉన్న కానిస్టేబుల్ బస్టాండ్‌వైపు నుంచి వెళ్తున్న వాహనాలను ఆగమని సైగచేశాడు. ఆయన దూరంగా ఉన్నాడు కదా... పట్టుకునేలోపు వెళ్లిపోవచ్చులే... అని పట్టించుకోకుండా బైక్‌ను ఫాస్ట్‌గా పోనిచ్చాడు. సరిగ్గా ఆఫీసు సమయానికి చేరుకుని హమ్మయ్యా.. అని ఊపిరి పీల్చుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఐదు రోజుల తర్వాత అతడి ఇంటికి ఓ రిజిష్టర్ పోస్టు వచ్చింది. తీసుకుని తెరిచి చూస్తే జూలై 8న ప్రతిమ మల్టిప్లెక్స్ వద్ద నిబంధనలు అతిక్రమించారని, రూ. 200 జరిమానా చెల్లించాలని... అతడు జంప్‌చేసిన తీరుతో బండి ఫొటోతో కూడిన చలానా వచ్చింది. అది చూసి అవాక్కయిన శ్రీనివాస్ తాను వెళ్లినప్పుడు ఎవరూ చూడలేదు కదా? అని దీర్ఘాలోచనలో పడిపోయాడు. కానీ, అక్కడే ఉన్న ఓ నిఘానేత్రం అతడిని వెంటాడింది. - కరీంనగర్ క్రైం వాహన చోదకులు జాగ్రత్త! ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే ఇక చెల్లదు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, కేసులు తప్పవు. నిర్లక్ష్యంగా ట్రాఫిక్ సిగ్నల్ దాటేసినా.. బైక్‌పై ట్రిపుల్ రైడ్ చేసినా... అతివేగంతో దూసుకెళ్లినా... పోలీసులెవరూ చూడట్లేదనుకుంటే తప్పులో కాలేసినట్లే. పోలీసుల ‘కెమెరా’ కళ్లు మీపై నిఘా వేశాయి. అవి నిరంతరం మిమ్మల్ని పర్యవేక్షిస్తుం టాయి. ఫొటో కెమెరాలు ప్రతీక్షణం రోడ్లపై పహరా కాస్తుంటాయి. పొరపాటున నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారా.. మీరు చేసిన తప్పు ఫొటోతో సహా మీ ఇంటికి ఈ-చలానా రూపంలో వచ్చేస్తుంది. ట్రాఫిక్ విభాగంలో టెక్నాలజీ వినియోగంతో అనేక మార్పులు వస్తున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్‌లాంటి నగరాల్లోనే కనిపించే ఈ చలానా పద్ధతి ఇక జిల్లాలోనూ అమలు కానుంది. నగరంలో అస్తవ్యస్త ట్రాఫిక్‌తో ఇబ్బందులెదురవుతుండడంతో క్రమబద్ధీకరణపై అధికారులు దృష్టిసారించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అక్కడికక్కడే జరిమానా వేస్తూ చర్యలు తీసుకుంటున్న పోలీసులు తాము ప్రత్యక్షంగా చూడనప్పుడు ఉల్లంఘించే వారి భరతం పట్టాలని నిర్ణయించారు. అలాంటి వాహనాలను వీడియోలో రికార్డు చేసి వాహన నంబర్ అడ్రస్‌కు జరిమానా పంపిస్తారు. ఇదే ఈ చలానా. కెమెరాలు అందజేత ఇప్పటికే జిల్లాలోని కీలకమైన కూడళ్లలో సీసీ కెమెరాలు పనిచేస్తుండగా తాజాగా ట్రాఫిక్ పోలీసులకు కూడా 3 వీడియో కెమెరాలు, 3 ఫొటో కెమెరాలు అందించారు. కమాన్, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, బస్టాండ్, ప్రతిమ మల్టిప్లెక్స్, తెలంగాణ చౌక్, మంచిర్యాల చౌరస్తా, కోర్టు చౌరస్తాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించి, శిక్షణ ఇచ్చి వీటిని అప్పగించారు. ఉదయం, సాయంత్రం, ఇతర ముఖ్య సమయాల్లో వారు ఈ కెమెరాల్లో అంతా రికార్డు చేస్తారు. ఐదారు రోజులుగా చిత్రీకరణ కొనసాగుతోం ది. ఉల్లంఘనలకు పాల్పడే వారి వాహనం నంబర్ కని పించేలా ఫొటోలు, వీడియో తీసి... వాహనం నంబర్ ప్రకారం ఉన్న చిరునామాకు ఈ చలానా(జరిమానా) పంపిస్తారు. దీన్ని సమీప ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో లేదా మీసేవ కేంద్రంలో చెల్లించాలి. గడువులోగా జరిమానా కట్టకపోతే వెంటనే వాహనాన్ని సీజ్ చేయడానికి కూడా వెనకాడరు. పదే పదే ఇలా ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నిబంధనలు ఉల్లంఘించేవారి డాటా మొత్తం ఒకదగ్గర నుంచే పర్యవేక్షిస్తుండ గా... కొద్ది రోజుల్లో ట్రాఫిక్ ముఖ్య సిబ్బందికి హైదరాబాద్‌లో వలే ఎక్కడికక్కడే వాహనం వివరాలు తెలుసుకునే పరికరాలు సమకూర్చే ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం తనిఖీల సమయంలో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలుండగా ఈ చలా నా పద్ధతితో అలాంటివాటికి అడ్డుకట్టపడే అవకాశముంది. వాహనదారుల నుంచి నెలకు రూ.3.5 లక్షల కుపైగా జరిమానా వసూలవుతుండగా ఆరు నెలల కాలంలో రూ.20 లక్షలు వసూలైంది. ఈ చలానాతో ఇది మరింత పెరిగే అవకాశముంది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు స్టాపర్లు, స్టాప్బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. నగరంలోని కమాన్ నుంచి తెలంగాణ చౌక్ వరకు అక్కడక్కడ ఉన్న చిన్నచిన్న దారులు ప్రమాదాలకు, అస్తవ్యస్త ట్రాఫిక్‌కు కారణమవుతుండగా ఆయా ప్రాంతాల్లో స్టాపర్లు ఏర్పాటు చేశారు. ప్రమాదాల నివారణకే.. జిల్లా కేంద్రంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాఫీ ప్రయాణానికి చర్యలు చేపడుతున్నాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని కెమెరాల ద్వారా గుర్తించి ఈ చలానా పంపించే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాం. ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ప్రజలందరూ సహకరించాలి. - ఉపేందర్, సీఐ, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, కరీంనగర్