breaking news
Traders concern
-
గోధుమలపై ఎందుకీ గోల.. సరైన నిర్ణయం తీసుకోలేరా?
గోధుమల ఎగుమతుల విషయంలో కేంద్రం ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయం అసలుకే ఎసరు తెచ్చే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి నిర్ణయం తగు తీసుకోకుంటే భారీ ఎత్తున గోధుములు పాడైపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. గోధుమల ఎగుమతిని కేంద్రం ఈ ఏడాది ఆరంభంలో భారీగా ప్రోత్సహించింది. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధంతో ఏర్పడిన గోధుమలకు పెరిగిన డిమాండ్‌ను ఉపయోగించుకోవాలని అన్నట్టుగా వ్యూహాలు రూపొందించింది. దీంతో ఎడా పెడా గోధుమల ఎగుమతులు మొదలయ్యాయి. అయితే ఈ సీజన్లో ఎండలు బాగా ఉన్నందున గోధమల దిగుమతి తగ్గే అవకాశం ఉందనే అంచనాలు వెలువడ్డాయి. దీంతో మే 14న అకస్మాత్తుగా గోధుమల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. కేంద్రం నిషేధం అమల్లోకి వచ్చే సరికే దాదాపు ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు దేశంలోని ప్రముఖ పోర్టులకు చేరుకుని ఉన్నాయి. వీటిని ఒడల్లోకి ఎక్కించడమే తరువాయి అనే క్రమంలో గోధుమల ఎగుమతికి బ్రేక్ పడింది. తాజాగా కేంద్రం ప్రత్యేక అనుమతుల కింద 4 లక్షల టన్నుల పై చిలుకు గోధుమల ఎగుమతికి తాజాగా అనుమతి ఇచ్చింది. ఐనప్పటికీ ఇంకా 17 లక్షల టన్నుల గోధుమలు ఇంకా పోర్టుల్లోనే ఉండిపోయాయి. త్వరలో దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించనున్నాయి. పోర్టుల్లో ఆరుబయట ఉన్న గోధములు ఈ వర్షంలో చిక్కుకుంటే ఇబ్బందులు తప్పవని ట్రేడర్లు అందోళన వ్యక్తం చేస్తున్నారు. బయటి దేశాల్లో డిమాండ్ ఉన్నందువల్ల పోర్టుల్లో ఉన్న సరుకు ఎగుమతికి ప్రత్యేక అనుమతి కావాలని కోరుతున్నారు. లేదంటే పోర్టుల్లో ఉన్న గోధుమలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎఫ్‌సీఐలకు తరలించాలని సూచిస్తున్నారు. లేదంటే ఇటు ఎగుమతి చేయలేక అటు దేశ అవసరాలకు ఉపయోగపడక గోధుమలు పాడైపోయే అవకాశం ఉందంటున్నారు. చదవండి: గోధుమ ఎగుమతులపై నిషేధం సానుకూలం -
మీ పాలనలో నరకం చూస్తున్నాం
ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల వ్యాపారుల ఆవేదన సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక నరకం చూపిస్తున్నారు. మాపై వేధింపులు ఎక్కువయ్యాయి. చీటికీ మాటికీ తనిఖీలు, దాడులు చేస్తూ జరిమానాల మీద జరిమానాలేస్తున్నారు. మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. వే బిల్లు, లోకల్ వే బిల్లు, జంబ్లింగ్ అంటూ వేధిస్తున్నారు. మమ్మల్ని చంబల్ లోయ దొంగల్లా చూస్తున్నారు. శత్రువుల్లా పరిగణిస్తున్నారు. అధికారుల వేధింపులను భరించలేకపోతున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే రైతుల మాదిరిగా మేం కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే... ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నిర్వహించిన సమావేశంలో చిన్న వ్యాపారుల ఆవేదన ఇదీ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత తమపై వేధింపులు ఎక్కువయ్యాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఒత్తిళ్లు, అధికారుల వేధింపుల పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ట్రేడర్స్‌తో రాష్ర్ట ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశమైన సందర్భంగా పలువురు వ్యాపారులు మాట్లాడారు. రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ... ‘‘సేల్స్ ట్యాక్స్ అధికారులకు, వ్యాపారులకు మధ్య సుహృద్భావ వాతావరణం లేదు. జంబ్లింగ్ పేరిట అధికారులు వేధిస్తూ నరకం చూపిస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల ఎక్కువగా నష్టపోయింది వ్యాపారులే. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో చిల్లర వర్తకులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రూ.5 వేలు.. రూ.10 వేల విలువైన స్టాక్ తెచ్చుకునే వారిని సైతం అడ్వాన్స్ వే బిల్లులంటూ తనిఖీల పేరిట వేధిస్తున్నారు. ఈరోజు ఎవరైనా సరే ఐదారు శాతం మార్జిన్ కోసమే వ్యాపారం చేస్తున్నారు. అమ్మకాల్లేక అద్దెలు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారులను దొంగల్లా చూస్తారా?’’ అని నిలదీశారు. రిక్షాలో తీసుకెళ్లినా వే బిల్లులా? మోటార్ వాహనాలపై తీసుకెళ్లే సరుకులకే వే బిల్లులు ఇవ్వాలని చట్టంలో ఉందని విశాఖ స్టీల్ అండ్ సిమెంట్ అసోసియేషన్ ప్రతినిధి పాలూరి సూర్యనారాయణ చెప్పారు. అయితే, రిక్షాలు, తోపుడుబండ్లపై తీసుకెళ్లే ఐరన్ వంటి వాటికి కూడా వే బిల్లులు కావాలంటూ అధికారులు వేధిస్తున్నారని తెలిపారు. జిల్లా స్థాయిని పరిగణనలోకి తీసుకోకుండా భారీగా వసూళ్ల లక్ష్యాలను నిర్దేశిస్తుండడంతో కిందిస్థాయి అధికారులు ఒత్తిడికి గురవుతున్నారని విజయనగరం జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కో చైర్మన్ ఆశీష్‌కుమార్ పేర్కొన్నారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యలున్నా రూ.వేలల్లో అపరాధ రుసుంలు వేస్తున్నారని ఆరోపించారు. అందరినీ ఒకే గాటన కట్టొద్దు బోగస్ డీలర్లను గుర్తించేందుకు అధికారులు అడ్వైజరీ విజిట్స్ చేస్తున్నారని విజయనగరం జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎన్.వి.చలం చెప్పారు. అయితే, ముప్పై ఏళ్లుగా వ్యాపారాలు చేస్తూ క్రమం తప్పకుండా ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసి, సకాలంలో పన్నులు చెల్లించే వారిని కూడా దొంగల్లా సంస్థల ముందు నిలబెట్టి ఫొటోలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు కట్టని వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప అందరినీ ఒకే గాటన కట్టడం సరి కాదని అన్నారు. దాదాపు రూ.10 వేల విలువైన సరుకు తెచ్చుకునేవారిని కూడా అడ్వాన్స్ వే బిల్లు కోసం ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. మాకింత లక్ష్యం విధించారు. చిన్న పొరపాటే కదా అని వదిలేస్తే మా లక్ష్యాన్ని ఎలా చేరుకుంటాం.. అని అధికారులు చెబుతున్నారని వివరించారు. చిన్నచిన్న లోపాలున్నా వదలడం లేదు లోకల్ వే బిల్లు వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని విశాఖ మార్బల్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహారావు అన్నారు. ప్రధానంగా చెక్‌పోస్టుల వద్ద వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పారు. చిన్న చిన్న సాంకేతిక లోపాలున్నా వేధిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాతే వ్యాపారులు తీవ్రంగా వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్నాం.. పన్నులు చెల్లించండి: యనమల ‘‘తీవ్రమైన ఆర్థిక లోటు కారణంగా రాష్ర్ట ప్రభుత్వం కష్టాల్లో ఉంది. వ్యాపారులంతా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను సక్రమంగా, సకాలంలో చెల్లించి తమ వంతు సహకారాన్ని అందించాలి’’ అని మంత్రి యనమల కోరారు. పన్నుల సక్రమంగా చెల్లిస్తే ఎలాంటి వేధింపులు ఉండవని, చెల్లించకపోతే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎగవేతకు తావులేని పన్నుల వ్యవస్థను రూపొందించేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. పన్నుల వసూళ్ల విషయంలో అధికారులకున్న విశేష అధికారాలను తగ్గిస్తామని చెప్పారు. పన్నుల చెల్లింపుల్లో అటోమేటిక్ వ్యవస్థను తీసుకొస్తామన్నారు. వ్యాపారుల నుంచి రూ.2 వేల కోట్లు రావాల్సి ఉందని, వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా ఈ సొమ్ము వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాల్లో 500 ఎకరాల విస్తీర్ణాల్లో ట్రేడ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్యామలరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.