breaking news
tractor driving
-
డ్రైవర్ గంగవ్వ!
పంచాయతీ ట్రాక్టర్‌ను నడుపుతుంది. లారీ మీద, బైక్ మీద సవారీ చేస్తుంది. పంటల సాగులోనూ అందెవేసిన చేయి కష్టాలను ఎదిరించి సొంత కాళ్ల మీద నిలబడింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం సజ్జన్పల్లి గ్రామంలో గంగవ్వ గురించి అడిగితే ‘ఎవరు?’ అంటారేమో గానీ... డ్రైవర్ గంగవ్వ.. అంటే అందరికీ తెలుసు. ప్రతిరోజూ పంచాయతీ ట్రాక్టర్‌ను తీసుకుని గల్లీల్లో చెత్త సేకరణ తో పొద్దున్నే అందరినీ పలకరిస్తూ వెళుతుంది గంగవ్వ. ట్రాక్టర్ ఒక్కటే కాదు లారీ, ఆటో, కారు ఏదైనా నడపగలదు. బైక్ మీద సవారీ చేయగలదు. సొంత కాళ్ల మీద నిలబడిన గంగవ్వ ఎందరికో ఆదర్శంగా నిలిచింది. చదువుకుంటూనే డ్రైవర్‌గా! సజ్జన్పల్లి గ్రామానికి చెందిన పుట్టి నాగయ్య, సాలవ్వల కూతురు గంగవ్వ. శెట్పల్లి సంగారెడ్డిలో పదో తరగతి వరకు చదువుకుంది. లింగంపేట మండల కేంద్రానికి వెళ్లి ఇంటర్ చదివింది. దూరభారాలు అని చూడకుండా సైకిల్ మీద సవారీ చేస్తూ వేరే ఊళ్లలో చదువుకుంది. పేద కుటుంబం కావడంతో సెలవు దినాల్లో కూలి పనులకు వెళ్లేది. అమ్మానాన్నలకు చేదోడువాదోడుగా ఉండేది. ఈ క్రమంలోనే బైకు నేర్చుకుంది. తరువాత ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. లారీ డ్రైవర్‌గానూ పనిచేసింది. గ్రామ పంచాయితీ పనుల్లో... గంగవ్వకు తల్లిదండ్రులు పెళ్లి చేశారు. వారం రోజులు తిరక్కుండానే వెనుదిరిగి వచ్చేసి, తల్లిగారింట్లోనే ఉండిపోయింది. అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్లేది. అలాగే ట్రాక్టర్, కారు, లారీ డ్రైవర్‌గా వెళ్లి వచ్చేది. నాలుగేళ్ల పాటు రైస్‌మిల్‌లో ఆపరేటర్‌గా కూడా పనిచేసింది. ఐదేళ్ల కిందట పంచాయతీలకు ప్రభుత్వం ట్రాక్టర్లు, ట్యాంకర్లు సరఫరా చేయడంతో గ్రామంలో డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వాళ్లు దొరకలేదు. అప్పటికే భారీ వాహనాలు నడిపే సామర్థ్యంతో పాటు డ్రై వింగ్ లైసెన్స్ ఉండడంతో పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌గా నియమించారు. అప్పటì నుంచి పంచాయతీలో పనిచేస్తోంది. రోజూ చెత్త సేకరణ నుంచి రకరకాల పంచాయితీ పనుల్లో చురుగ్గా పాల్గొంటుంది. నిచ్చెన సాయంతో స్తంభం ఎక్కి విద్యుత్తు దీపాలను సరిచేస్తుంది. పంచాయతీలో ఏ పని ఉన్నా ఇట్టే చేసిపెడుతుంది. మొదట్లో ఆమెకు పంచాయతీ నుంచి రూ.2,500 వేతనం ఇచ్చేవారు. క్రమంగా పెరుగుతూ వచ్చి ఇప్పుడు రూ.8,500 వేతనం ఇస్తున్నారు. ట్రాక్టర్ అవసరం ఎప్పుడు ఏర్పడినా సరే గంగవ్వ పరుగున వెళ్లి ట్రాక్టర్ తీస్తుంది. నాలుగేళ్ల కిందట తండ్రి నాగయ్య చనిపోయాడు. తల్లి సాలమ్మతో కలిసి ఉంటుంది. అన్న కొడుకుని చదివించింది. అతను ఇప్పుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. వ్యవసాయ పనులు గంగవ్వ డ్రైవర్‌గా పనిచేస్తూనే వ్యవసాయ పనులు చేస్తోంది. తనకు సొంత భూమి లేకపోవడంతో వేరేవాళ్ల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తోంది. వెళ్లి దున్నడం, నాటు వేయడం, కలుపుతీయడం వంటి పనులన్నీ సొంతంగా చేసుకుంటుంది. లింగంపేట మండల కేంద్రానికి వెళ్లాలన్నా, ఎల్లారెడ్డి పట్టణానికి వెళ్లాలన్నా గంగవ్వ బైకు మీదనే ప్రయాణం చేస్తుంది. ‘ఎవరిపైనా ఆధారపడకుండా బతకడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేద’నే గంగవ్వ మాటలు నేటి తరానికి స్ఫూర్తి కలిగిస్తాయి. నచ్చిన పనిని ఎంచుకున్నా! ఇంటర్మీడియెట్ పూర్తవుతూనే పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. అక్కడ వాతావరణం ఎందుకో నాకు సరిపడదు అనిపించింది. వారం రోజులు కూడా గడవకముందే ఇంటికి వచ్చేశాను. అమ్మనాన్నలకు భారం కాకూడదని నిర్ణయించుకున్నా. నాకు బాగా నచ్చిన పని మీద దృష్టి పెట్టాను. డ్రైవింగ్ సొంతంగానే నేర్చుకున్నాను. రైస్‌మిల్ ఆపరేటర్‌గా పనిచేస్తూనే ట్రాక్టర్, లారీ, కారు.. డ్రైవింగ్ నేర్చుకున్నాను. కొందరు విచిత్రంగా చూసేవారు. కొందరు మగరాయుడు అనేవారు. ఎవరు ఏమనుకున్నా నా కష్టం మీద నేను బతకాలనుకుని నచ్చిన పనిచేసుకుంటూ వెళుతున్నాను. – గంగవ్వ, సజ్జన్పల్లి, లింగంపేట మండలం, కామారెడ్డి జిల్లా – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
ఇలా ఎందుకు? అయోమయంలో ఆనంద్ మహీంద్ర: ట్వీట్ వైరల్
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ప్రత్యేకమైన, వినూత్న వాహనాలు అంటే ఆసక్తి చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో పలు రకాల వెహికల్స్ గురించి ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ ఉంటారు. అధునాతన టెక్నాలజీ, ఇంజనీరింగ్, వింటేజ్ ఇలా అనేక రకాల వాహనాల వీడియోలు, చిత్రాలను పంచు కోవడం ఆయనకు అలవాటు. తాజాగా ఒక విచిత్రమైన వాహనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. అంతేకాదు ఆసక్తికరంగా ఉంది.. కానీ ఇలా ఎందుకు? అంటూ ఒక క్వశ్చన్‌మార్క్ వదిలేరు. ఇంకేముంది ఫ్యాన్స్ ఫన్నీ..ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియోలో సాధారణ ట్రాక్టర్‌లా కుండా, ట్రాక్టర్లో సీటు ప్లేస్మెంట్ వెరైటీగా చాలా ఎత్తులో ఉంచారు. సుమారు 7 అడుగుల ఎత్తులో కూర్చున్న డ్రైవర్ ట్రాక్టర్‌ను నడుపుతూ కనిపిస్తాడు. సీటు ఎడ్జస్ట్మెంట్ కూడా కనిపిస్తోంది. కానీ ఈ సర్దుబాటు వెనుక ఉద్దేశ్యం మాత్రం అస్పష్టం. దీని పైనే మహీంద్ర ఆరా తీసారు తన ట్వీట్లో. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. బహుశా అతను పంట ఎత్తు ఎక్కువగా ఉన్న పొలంలో ట్రాక్టర్‌ను ఉపయోగిస్తున్నాడనుకుంటా..అందుకే అక్కడ కూర్చున్నాడని ఒకరు, ట్రాఫిక్ గురించి ముందుగానే తెలుసుకుందామని కొందరు వ్యాఖ్యానించారు. JCB ఆపరేటర్ ట్రాక్టర్ యజమాని లేదా డ్రైవర్ అయితే ఇలానే ఉంటుందని మరొకరు కమెంట్ చేశారు. కాదు. కాదు.. అతను ఇతర ట్రాక్టర్ల కంటే రెండు అడుగులు ముందే ఉండాలనుకుంటున్నాడేమో అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. Interesting. But I have only one question: WHY? pic.twitter.com/Iee9NZC48E — anand mahindra (@anandmahindra) November 17, 2023 -
CM YS Jagan: ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రైతు గ్రూపుతో కలిసి సీఎం వైఎస్ జగన్ స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు. గుంటూరు జిల్లాలోని చుట్టగుంట వద్ద 'వైఎస్సార్ యంత్ర సేవ పథకం' రాష్ట్రస్థాయి మెగా మేళాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీ కార్యక్రమాన్నిజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక రైతు గ్రూపుతో కలిసి సీఎం జగన్ స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి సీఎంతో ఉన్నారు. ఇదిలా ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీతోపాటు 5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం బటన్ నొక్కి జమ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్) -
డ్రైవరన్నా.. సురక్షితం కాదన్నా!
సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం : వాహనాల రద్దీ, జన సంచారం అధికంగా ఉండే అనంతపురంలో శుక్రవారం ఓ వ్యక్తి ఒంటిచేత్తో ట్రాక్టర్‌ను నడిపాడు. ఒక చేతిలో పాపను ఎత్తుకుని.. మరో చేతితో స్టీరింగ్ తిప్పుతూ కనిపించాడు. కుదుపులకు ఏమాత్రం అదుపు తప్పినా ప్రమాదం బారిన పడే అవకాశం ఉండటంతో ఆ ట్రాక్టర్ కొంత దూరం వెళ్లే వరకు ప్రతి ఒక్కరూ అలా చూస్తూనే ఉండిపోయారు.