breaking news
Tourist Charm
-
పాకాలలో పర్యాటకుల సందడి
ఖానాపురం : వరంగల్ రూరల్ జిల్లాలో ఏకైక పర్యాటక ప్రాంతంగా నిలిచిన పాకాలలో బుధవారం పర్యాటకుల సందడి నెలకొంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు చెందిన పర్యాటకులు పాకాలకు తరలివచ్చి అందాలను వీక్షించారు. కట్టపై నుంచి నడుచుకుంటూ వెళుతూ పాకాల అందాలను ఆస్వాదించారు. లీకేజీ ద్వారా వెళ్తున్న నీటిలో జళకాళాడారు. పార్కులు చిన్నపిల్లలతో కలసి ఉత్సాహంగా గడిపారు. నిండుకుండలా కనిపిస్తున్న పాకాల సరస్సులో బోటింగ్ చేస్తూ మంచి అనుభూతిని పొందారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏఎస్సై సుభాష్ ఆధ్వర్యంలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. -
ఏడుపాయలకు పర్యాటక శోభ
మెదక్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల ఆలయానికి పర్యాటక శోభ కల్పిస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్‌తో ఏడుపాయల రూపు రేఖలు మార్చి ఆలయ కీర్తిని ఎల్లలు దాటేలా చేస్తామన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ భారత దేశంలో వనదుర్గా ఆలయాలు రెండే ఉన్నాయని, అందులో కశ్మీర్‌లోని ఆలయం మూతపడిందన్నారు. ప్రస్తుతం ఏడుపాయల్లోని వనదుర్గమాత ఆలయం మాత్రమే నిత్యపూజలందుకుంటోందన్నారు. జనమే జేయుని సర్పయాగస్థలిగా వినుతికెక్కిన ఏడుపాయలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో కలిసి మాస్టర్ ప్లాన్ రూపొందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు రాహుల్‌బొజ్జాకు సూచించారు. ఏడుపాయలకు వచ్చే వేలాది భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవాలయ విశిష్టతను ఇనుమడింపజేసేందుకు ఆగమ శాస్త్ర పండితులను సంప్రదించి చండీయాగం నిర్వహణకు శాశ్వత యాగశాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. మహాశివరాత్రి లోగా ఏర్పాట్లు పూర్తి కావాలని ఆదేశించారు. సమావేశంలో శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్‌రావు, కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఆర్డీఓ నగేష్‌గౌడ్, ఏడుపాయల చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఈఓ, వెంకటకిషన్‌రావు, డీఎఫ్ఓ సోనిబాల పాల్గొన్నారు.