breaking news
TNPSC exams
-
నిరుద్యోగులకు శుభవార్త
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే పట్టభద్రులైన నిరుద్యోగులకు శుభవార్త. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్పీఎస్సీ) 2018 సంవత్సరానికి టైంటేబుల్‌ను శనివారం విడుదల చేసింది. ప్రభుత్వశాఖల్లోని 23 విభాగాల్లో 3,235 ఖాళీలు ఉన్నట్లుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను మే నుండి అక్టోబరులోగా పోటీపరీక్షల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన విద్యార్దులు తమకు తగిన ప్రభుత్వం ఉద్యోగానికి పోటీ పరీక్షలకు సిద్దమయ్యేందుకు వీలుగా టీఎన్పీఎస్సీ ప్రతి ఏడాది ఖాళీల సంఖ్యను విడుదల చేయడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీ ప్రకారం తాజాగా విడుదల చేసిన టైంటేబుల్లో 23 విభాగాల్లో 3,235 ఖాళీలున్నట్లు తెలియజేసింది. అయితే ఈ సంఖ్య పూర్తిగా తాత్కాలికమైనదని, దీనిలో మార్పులు జరిగే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఈ పోస్టుల భర్తీలో కొన్ని స్థానాలకు అనివార్యమైన ఇబ్బందులు ఎదురైన పక్షంలో వచ్చే ఏడాది భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. అంతేగాక అవసరమైన పక్షంలో టైంటేబుల్లో చూపని విభాగాలు, ఖాళీలను సైతం కొత్తగా చేర్చే పరిస్థితులు ఉత్పన్నం కావచ్చని స్పష్టం చేసింది. కొత్తగా చేర్చే అవకాశం ఉన్న ఖాళీలను పోటీ పరీక్షలకు ముందుగా లేదా తరువాత కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది. గత ఏడాది 12,218 ఖాళీ స్థానాలను చూపుతూ టైంటేబుల్ విడుదల చేశారు. అన్ని స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అంతేగాక టైంటేబుల్లో చూపని 24 ఖాళీలను ప్రకటించారు. వీటిల్లో 18 ఖాళీలకు పరీక్షలు నిర్వహించగా మిగిలిన ఆరు ఖాళీల భర్తీకి ఈనెల లేదా వచ్చేనెల పోటీ పరీక్షలు జరిపే అవకాశం ఉంది. అనేక పోటీ పరీక్షల కోసం 99 పాఠ్యాంశాలను విద్యావేత్తలు గత రెండేళ్ల కాలంలో సవరించి ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో పోటీ పరీక్షలు నిర్వహించినా కొన్ని పోస్టులకు అనివార్య కారణాల వల్ల ఫలితాలు వెల్లడి జాప్యం చేశారు. ఆ తరువాత మరలా ఫలితాలు వెల్లడించి నియామక ఉత్తర్వులు సైతం జారీచేశారు. అయితే ఈ ఏడాది ఆలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అన్ని ఖాళీలకు పోటీ పరీక్షలు నిర్వహించి ఫలితాల వెల్లడి, నియామక ఉత్తర్వులు అందజేయగలమని టీఎన్పీఎస్సీ ధీమా వ్యక్తం చేస్తోంది. టీఎన్పీఎస్సీ తాజాగా విడుదల చేసిన టైంటేబుల్ ప్రకారం పోటీ పరీక్షల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. టీఎన్పీఎస్సీ విడుదల చేసిన పోటీ పరీక్షల పట్టిక : వ్రాత పరీక్షలు: పోస్టులు ఖాళీలు పరీక్ష తేది సహాయక సర్వేయర్ 56 మే, 6 మోటార్ వాహన ఇన్స్పెక్టర్ 113 జూన్ 10 ఉద్యానవ శాఖ సహాయకులు 805 జూన్, 9 వ్యవసాయ అధికారులు 183 జూన్, 10 అటవీ శాఖ ట్రైనీలు 158 జూన్ 16 మత్సశాఖ సంచాలకులు 72 జూలై 15 సహాయక ప్రభుత్వ న్యాయవాదులు 43 జూన్ 28, 29 అదేవిధంగా గ్రూప్ 2 లో 1547 పోస్టులకు ఇంటర్వ్యూలను ఆగస్టు 19వ తేది నిర్వహిస్తున్నట్టుగాను, గ్రూప్ 1 లో 57 పోస్టులకు అక్టోబర్ 14వ తేది వ్రాత పరీక్షలు జరుపుతున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాదికిగాను పట్టికను టీఎన్పీఎస్సి వెబ్సైట్ www.tnpsc.gov.in లో విడుదల చేశారు. -
ఇక వ్యాసరూపంలోనే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో బహుళ ఐచ్ఛిక సమాధానాలకు ఇక స్వస్తి పలికి... వ్యాసరూప సమాధానాల విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ పునర్నిర్మాణం కోసం సుశిక్షితులైన ఉద్యోగులు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసం పోటీ పరీక్షల విధానంలో మార్పులు తీసుకురావాలని, వ్యాసరూప సమాధానాల ద్వారా వారి శక్తిసామర్థ్యాలను పరీక్షించేందుకు అవకాశం ఉంటుందనే అంశాలు పోటీ పరీక్షల విధానం సమీక్షా కమిటీ ముఖ్యుల చర్చల్లో వచ్చినట్టు తెలుస్తోంది. క్లరికల్ పోస్టు నుంచి అధికారి స్థాయి వరకు, జూనియర్ అసిస్టెంట్ నుంచి గ్రూపు-1 వరకు ఉండే అన్ని పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నల విధానం ఉండాలని యోచిస్తున్నారు. అయితే ఈ విధానం ప్రవేశపెట్టాలంటే ముందుగా భారీ కసరత్తు అవసరమన్న వాదన వ్యక్తమవుతోంది. పోటీ పరీక్షను బట్టి పేపర్ల సంఖ్యను నిర్ధారించాల్సి ఉంటుంది. మరోవైపు వ్యాసరూప సమాధానాలు రాయాల్సిన ప్రశ్నల విధానాన్ని ఒక్క పేపరు గానే పరిమితం చేయాలా? ప్రతి పోటీ పరీక్షకు సంబంధించిన అన్ని పేపర్లలో వ్యాసరూప సమాధానాల విధానమే అమలు చేయాలా? అన్న విషయాల్లో చర్చలు కొనసాగుతున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు వ్యాసరూప సమాధాన విధానం అమల్లోకి తెస్తే సమస్యలు తలెత్తుతాయన్న వాదన కమిటీలోని సభ్యుల్లో వ్యక్తమవుతోంది. అందుకే టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో వెలువడే నోటిఫికేషన్లలో ఈ విధానం అమలు చేయవద్దని, ఆ తరువాత నుంచి ఇచ్చే నోటిఫికేషన్లలో దీనిని అమలు చేయాలనే యోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 5న జరిగే పోటీ పరీక్షల విధానం సమీక్ష కమిటీ సమావేశంలో ఈ కొత్త విధానంపై పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, ఈ విధానాన్ని రెండుమూడేళ్లు ముందుగానే ప్రకటించి, ఆ తరువాత అమల్లోకి తెస్తే నిరుద్యోగులకు ఇబ్బంది ఉండదన్న వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వంద రకాల కేడర్ల ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ప్రతి కేడర్ ఉద్యోగాల భర్తీకి ఇచ్చే మొదటి నోటిఫికేషన్లో కాకుండా రెండో నోటిఫికేషన్ నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలన్న అంశంపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ విధానం అమలులో భాగంగానే గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూపు-1బీగా కొనసాగిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో గ్రూపు-1 అధికారి స్థాయికి గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్ అధికారులు వెళతారు కనుక వాటిని గ్రూపు-1బీగానే కొనసాగించాలని యోచిస్తున్నారు. అయితే దీనిపై తుది నిర్ణయాధికారాన్ని ప్రభుత్వానికే వదిలేయాలన్న అభిప్రాయానికి కమిటీ ఇప్పటికే వచ్చింది.