breaking news
Tirmalagiri
-
పూడ్చిపెట్టిన మృతదేహానికి.. 15 నెలల తర్వాత పోస్టుమార్టం
తిర్మలగిరి(హాలియా) : సుమారు 15 నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన యువతి మృతదేహానికి సోమవారం హాలియా పోలీసులు రీ-పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఉదంతం తిర్మలగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. హాలియా ఎస్ఐ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం పూర్వ అనుముల మండలం శ్రీరాంపురం గ్రామపంచాయతీ పరిధిలో గల జానారెడ్డి కాలనీకి చెందిన జటావత్ చందా పెద్దకుమార్తె అనసూర్య 2015 ఆగస్టు నెలలో వాటర్‌ట్యాంకుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు హైదరాబాద్‌లో డిగ్రీ చదివే రోజుల్లో ఇదే గ్రామానికి చెందిన కేతావత్ రమేష్‌ను ప్రేమించింది. పెళ్లి చేసుకుందామని కూడా నిర్ణయించుకున్నారు. కాగా ఇది తెలియని మృతురాలి తండ్రి చందు మాచర్ల ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహం చేసేందుకు నిర్ణయించాడు. దాంతో రమేష్ అతడికి ఫోన్ చేసి తాను, అనసూర్య ప్రేమించుకుంటున్నామని తెలపడంతో సదరు యువకుడు విరమించుకున్నాడు. అనంతరం 2015 జూన్‌లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో వివాహం నిశ్చయించగా దానిని కూడా చెడగొట్టాడు. అనంతరం అనసూర్య, రమేష్‌కు పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయిం చారు. కానీ రమేష్ పెళ్లి చేసుకునేందుకు జాప్యం చేశాడు. ఇది అవమానంగా భావించిన అనసూర్య 2015 ఆగస్టు 28న ట్యాంకుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కొన్ని రోజుల తర్వాత మృతురాలి బ్యాగులో దొరికిన ఆధారాల ప్రకారం తన కూతురు రమేష్ వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి చందా గత నెల 28న హాలియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పూడ్చిపెట్టిన మృతదేహానికి సోమవారం హాలియా పోలీ సులు, స్థానిక తహసీల్దార్ వేణుమాధవరావు, వైద్యులు కలిసి రీ పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హాలియా ఎస్ఐ వెంకట్ తెలిపారు. -
బైక్ ఢీ.. ఒకరి దుర్మరణం
జి.తిర్మలగిరి(చివ్వెంల), న్యూస్‌లైన్: అతివేగంగా వస్తున్న మోటార్‌సైకిల్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని జి.తిర్మలగిరి ఆవాసం గుంపుల గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన సందా సుధాకర్‌రెడ్డి(32) తన వ్యవసాయ పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈదే క్రమంలో పెన్‌పహాడ్ మండలం ధర్మాపురం ఆవాసం గంగ్లీ తండాకు చెందిన మాలోతు వెంకన్న తన ఇద్దరు కూతుళ్లతో మోటార్‌సైకిల్‌పై జి.తిర్మలగిరి వైపు వెళ్తూ రోడ్డు దాటుతున్న సుధాకర్‌రెడ్డిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సుధాకర్‌రెడ్డికి తీవ్రగాయాలై మృతిచెందా డు. వెంకన్న అతని కూతుళ్లకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ అంగోతు భోజ్యనాయక్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. బస్సు, కారు ఢీ.. ప్రమాద స్థలంలో రోడ్డుపై బైక్ పడి ఉండటంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సు డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న కారు, బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.