breaking news
Ticket vending machine
-
ఆర్టీసీలో ‘టిమ్స్’ ఘంటికలు
ఇబ్బందులు.. నష్టాలు..ఇంతకుముందు డ్రైవర్లు బస్సు నడిపితే.. కండక్టర్లు టిక్కెట్లు ఇచ్చేవారు. ఇప్పుడు కొన్ని బస్సుల్లో కండక్టర్లు లేకుండా చేశారు. వారి బదులు డ్రైవర్లే టిమ్స్‌తో టిక్కెట్లు ఇస్తున్నారు. ప్రభుత్వం చేసిన చట్ట సవరణ ప్రకారం.. ఇక ముందు అన్ని బస్సుల్లోనూ కండక్టర్లు ఉండరు. వారి విధులను డ్రైవర్లే నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ విధానంతో కండక్టర్ల వ్యవస్థకు మంగళం పాడినట్లే. ఇప్పుడున్న కండక్టర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడటంతో పాటు.. భవిష్యత్తులో ఈ నియామకాలే ఉండవు. ఇది నిరుద్యోగులకు నష్టం. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:టిమ్స్.. ప్రస్తుతం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న యంత్రం ఇది. సంస్థ ఉద్యోగులు, యాజమాన్యం మధ్య వివాదం రేపిన ఈ యంత్రం.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ భద్రత, కండక్టర్ల ఉద్యోగ భద్రతను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తోంది. దీనికి కారణం ప్రభుత్వం ఇటీవల రవాణా చట్టంలో చేసిన సవరణే. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు లేకుండా టిమ్స్(టిక్కెట్ ఇష్యూయింగ్ మెషీన్) ద్వారా డ్రైవర్లతోనే టిక్కెట్లు కొట్టించాలన్నది ఈ సవరణ సారాంశం. ఇప్పటికే కొన్ని బస్సుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఇది కష్టసాధ్యమని, డ్రైవర్లపై ఒత్తిడి పెరుగుందని.. ఓ వైపు డ్రైవింగ్ చేస్తూ, మరోవైపు టిక్కెట్లిచ్చే ఈ పద్ధతిని వ్యతిరేకిస్తూ గతంలో కొందరు ఉద్యోగులు హైకోర్టు కెళ్లారు. హైకోర్టు కూడా వారి పక్షానే నిలిచింది. అయితే రవాణా చట్టంలో సవరణలు తీసుకురావడం ద్వారా ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోవాలని చూస్తోంది. టిమ్స్ వినియోగంపై డ్రైవర్లకు మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చి, వారికే కండక్టర్ బాధ్యతలు అప్పగించాలన్న ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డ్రైవర్లకు విశ్రాంతి అక్కర్లేదా? శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 30 టిమ్స్ పని చేస్తున్నాయి. శ్రీకాకుళం డిపో-1 పరిధిలో 10, డిపో-2 పరిధిలో 20 టిమ్స్ ఉండా వీటితో 60 మంది డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. రీజియన్ పరిధిలో 60 టిమ్స్‌తో ఇద్దరు చొప్పున 120 మంది డ్రైవర్లు పని చేస్తున్నారు. గతంలో దూరప్రాంత బస్సులకు ఓ డ్రైవర్ ఆరుగంటల పాటు బస్సు నడిపితే అక్కడి రెస్ట్రూమ్లో విశ్రాంతి పొందుతున్న మరో డ్రైవర్ రెండో షిఫ్టులో వచ్చి బస్సు నడిపేవాడు. ఇప్పుడు కండక్టర్ లేకపోవడం వల్ల ఇద్దరు డ్రైవర్లూ విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తోంది. మొదటి డ్రైవర్ ఆరుగంటల పాటు బస్సు నడిపి బస్సులోనే విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధమైతే, అప్పటికే టిమ్స్‌తో టిక్కెట్లు కొట్టిన రెండో డ్రైవర్ డ్రైవింగ్ చేయాల్సి వస్తోంది. మరోవైపు అప్పటికే బస్సు నడిపిన మొదటి డ్రైవర్‌కు మళ్లీ టిమ్స్ విధులు తప్పడం లేదు. దీనివల్ల వారిపై ఒత్తిడి పెరిగి రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయి. ఇదే విషయమై కార్మిక నాయకులు గతంలో కార్మికశాఖ అధికారులకు టిమ్స్ ఇబ్బందుల్ని విన్నవించుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ అన్ని ప్రాంతాల సర్వీసులకూ టిమ్స్ ప్రవేశపెడితే ప్రయాణికుల భద్రతతో పాటు డ్రైవర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆర్టీసీ సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. సిబ్బందిని కుదించేందుకేనా? ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా రాష్ర్ట వ్యాప్తంగా 3200 టిమ్స్‌ను వినియోగంలోకి తెచ్చిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఎంపికై శిక్షణ పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న 1000 మంది కండక్టర్ అభ్యర్థులను పక్కన పెట్టి సిబ్బందిని కుదించేందుకు సంస్థ యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఆందోళన చెందుతున్నాయి. జనవరి 23న హైకోర్టు కూడా కార్మికులకు అనుకూలంగా తీర్పునిచ్చినా రవాణా చట్టాలను సవరించి జీవో నెంబర్ 8 ద్వారా ఆర్టీసీ అనుకున్న పని చేసుకుపోతోంది. కేవలం మూడు రోజులు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా టిమ్స్‌ను అమలు చేస్తామని చెబుతున్న ఆర్టీసీ వైఖర్ని కార్మిక సంఘాలు తప్పుబడుతున్నాయి. గతంలో దూర ప్రాంతాలైన హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం లాంటి ప్రాంతాలకే ఏసీ, ఇంద్ర, సూపర్ డీలక్స్ సర్వీసుల్లో టిమ్స్ అమలు చేసినా భవిష్యత్తులో ఎక్స్‌ప్రెస్, పల్లెవె లుగు సర్వీసుల్లోనూ కండక్టర్ లేకుండా టిమ్స్ ద్వారా డ్రైవర్లనే పంపించేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తోందని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించేందుకు 13 జిల్లాల ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు మంగళవారం మంగళవారం విజయవాడలో సమావేశమవుతున్నారు. ప్రమాదాలు తప్పవు డ్రైవర్లే టిమ్స్ నిర్వహిస్తే రోడ్డు ప్రమాదాలు తప్పవు. సంస్థ లాభం కోసం చూసుకోకుండా ప్రయాణికుల, సిబ్బంది భద్రతపై దృష్టి సారించాలన్నదే మా డిమాండ్. టిమ్స్ యంత్న్రాలను మేం తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నాం. చేంజింగ్ లేకుండా డ్రైవర్లే టిమ్స్ ఉపయోగించడం, రాత్రి వేళ నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయడం కష్టం. ఆర్టీసీ తన తీరు మార్చుకోకపోతే ఉద్యమిస్తాం. -ఎస్.అప్పారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగ భద్రత ఎక్కడ? ఇంటికో ఉద్యోగమంటున్న ప్రభుత్వం వెయ్యి మంది శిక్షణ పొందిన కండక్టర్ల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. కారుణ్య నియామకాల్లోనూ ఆర్టీసీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. సాక్షాత్తు హైకోర్టు చెప్పినా వినకుండా డ్రైవర్లతోనే టిమ్స్ నిర్వహించేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. ఆర్టీసీ తన జీవో రద్దు చేసుకోకుంటే భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవు. -పలిశెట్టి దామోదర్‌రావు, రాష్ట్ర ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి, ఈయూ -
వెస్టర్న్ రైల్వేకు కొత్త ఏటీవీఎంలు
సాక్షి, ముంబై: ఈ నెల చివరి వరకు వెస్టర్న్ రైల్వే 400 ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్ (ఏటీవీఎం)లను కొనుగోలు చేయనుంది. త్వరలోనే పాత ఏటీవీఎంల స్థానంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. బోరివలి, కాందివలి, అంధేరి రైల్వే స్టేషన్లలో పాత ఏటీవీఎంల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు. ఈ నెల చివరి వరకు వివిధ రైల్వే స్టేషన్లలో దాదాపు 400 కొత్త ఏటీవీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు వెస్టర్న్ రైల్వే పీఆర్వో శరత్ చంద్రాయన్ తెలిపారు. ఇటీవల కాలంలో పాత ఏటీవీఎంల విషయంలో చాలా సమస్యలు తలెత్తాయన్నారు. వీటిలో చాలావరకు పని చేయడం లేదన్నారు. ఈ విషయమై ప్రయాణికుల నుంచి తమకు చాలా ఫిర్యాదులు అందాయన్నారు. కార్డును రీడ్ చేయడం, టికెట్‌ను ప్రింట్ చేయడం పెద్ద సమస్యగా మారడంతో అధికారులు ఈ సమస్యను పరిష్కరించారన్నారు. ఈ కొత్త ఏటీవీఎంలను పలు రైల్వే స్టేషన్లలో రైల్వేఫుట్ ఓవర్ బ్రిడ్జి చివరలో ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల రైల్వే ఆవరణలోకి ప్రవేశించగానే ప్రయాణికులు వీలైనంత త్వరగా టికెట్లను కోనుగోలు చేసే వీలు ఉంటుందన్నారు. అంతేకాకుండా ఈ ఏటీవీఎంలను అంధేరి స్టేషన్లో మెట్రో రైల్ ప్రవేశ ద్వారం వద్ద కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా, ఏటీవీఎం స్మార్ట్‌కార్డు రెన్యువల్ కోసం ప్రతి రైల్వే స్టేషన్లో ఒక టికెట్ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ ప్రయాణికులు స్మార్ట్ కార్డును కొనుగోలు చేసినా అదేవిధంగా రెన్యువల్ చేసినా వారికి అదనంగా 5 శాతం రీచార్చ్ లభిస్తుంది.