breaking news
Third phase rachchabanda
-
ఎన్నికలే లక్ష్యంగా.. మూడో విడత రచ్చబండ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఈ నెల 11నుంచి 26వరకు జిల్లాలో మూడో విడత రచ్చబండ నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఈ రచ్చబండలో ఏడు ప్రధాన అంశాలను చర్చించాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో రచ్చబండ కార్యక్రమానికి ప్రజ ల నుంచి స్పందన రాగలదని అధికార పక్షం నేతలు భావిస్తున్నారు. వ్యూహాత్మకంగా గతంలో రెండు విడతల్లో అందిన రచ్చబండ దరఖాస్తులకు కొద్దొగొప్పో మోక్షం కలిగించే దిశగా పావులు కదుపుతున్న ట్లు తెలుస్తోంది. ప్రజల వద్దకు వెళ్లగానే గతంలో రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ పథకాల కోసం చేసిన దరఖాస్తుల మాటేమిటని ప్రశ్నించే అవకాశం ఉండడంతో అందుకు తగిన విధంగా అధికా ర యంత్రాంగం అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. మూలుగుతున్న దరఖాస్తులు.. 2011 జనవరి నుంచి ఫిబ్రవరి వరకు జిల్లాలో మొదటి విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వం రెండో విడత రచ్చబండను నవంబర్‌లో చేపట్టింది. రచ్చబండ సభల్లో నిరుపేద కుటుంబాలు రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం వేలాదిగా దరఖాస్తులు చేసుకున్నారు. ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ వాటికి మోక్షం కలుగక పోవడంతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌తో సహా రెవెన్యూ కార్యాలయాల్లో కొనసాగుతున్న ప్రజావాణిలో కూడా పెద్ద సంఖ్యలో మొర పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం మంజూరు ఇవ్వకుండా పెండింగ్‌లోనే పెడుతోంది. జిల్లాలో రెండు విడతలుగా సాగిన రచ్చబండ సభల్లో రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితర వాటి కోసం 3.81 లక్షల దరఖాస్తులు అధికారులకు అందాయి. ఇందులో మొదటి విడతలోనే 1.95 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతకు సంబంధించి 66 వేల దరఖాస్తులను అనర్హతగా గుర్తించి తిరస్కరించారు.అదేవిధంగా 1.29 లక్షల దరఖాస్తులను పరిష్కరించినప్పటికీ లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం ఒనగూరలేదని తెలుస్తోంది. రేషన్ కార్డులకు సంబంధించి 90 వేల దరఖాస్తులకు కూపన్లు అందజేసింది. కూపన్ల ద్వారా లబ్ధిదారులకు రేషన్ సరుకులు సక్రమంగా అందడం లేదు. ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి మరోలా ఉంది. మొదటి విడత రచ్చబండ లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.ఇందిరమ్మ ఇళ్ల కోసం 55,000 దరఖాస్తులు రాగా అన్నింటిని అర్హతగా గుర్తించినప్పటికీ 20 వేల మందికి మాత్రమే ఇళ్ల మంజూరు ఇచ్చారు. అయితే జిల్లా స్థాయిలో 18,500 ఇళ్లను మాత్రమే నిర్మించుకోవటానికి అనుమతి లభించింది. మిగతా 1500 ఇళ్ల పరిస్థితి జిల్లా అధికారుల వద్దపెండింగ్‌లో ఉంది. పింఛన్ల పరిస్థి తి చెప్పనలవి కాకుండా ఉంది. 30 వేల పింఛన్ల దరఖాస్తులు రాగా 19 వేలకు మాత్రమే మంజూరు ఇచ్చారు. రెండో విడతలో.. రెండో విడత రచ్చబండ సభల్లో ఇళ్ల కోసం 61,205 దరఖాస్తులు అధికారులకు అం దాయి. రేషన్ కార్డుల కోసం ప్రజావాణి కలుపుకుని 70 వేల దరఖాస్తులు వచ్చాయి.సామాజిక పింఛన్ల కోసం 43,252 దరఖాస్తులు, వికలాంగుల పింఛన్ల కోసం 11753 దరఖాస్తులు అధికారులకు అందాయి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల కోసం వచ్చిన మొత్తం దరఖాస్తులన్నింటిని పూర్తిగా పరిశీలించి ఏడాదిన్నర కిందనే సర్కారుకు పంపించారు. అయినప్పటికీ 1,86,210 దరఖాస్తులు ఇప్పటి వరకు మోక్షం లభించలేదు. ఈనెల 11 నుంచి 26 వరకు నిర్వహించ తలపెట్టిన మూడో విడత రచ్చ బండలోనైనా ఈ దరఖాస్తులకు మోక్షం కలుగుతుందా లేదానన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా రచ్చబండ సభల్లో ఆరోగ్యశ్రీ కార్డుల కోసం 26,707 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలనలోనే తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. దీంతో వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. -
11 నుంచి మూడో విడత రచ్చబండ
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని ఈనెల 11 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. ప్రజలందరినీ భాగస్వాములనుచేసి రచ్చబండ నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రమంత్రులు పితాని సత్యనారాయణ, ఎన్ రఘువీరారెడ్డి, డీ శ్రీధర్‌లతో కలిసి రచ్చబండ కార్యక్రమంలో తీసుకోవలసిన చర్యల గురించి అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మొదటి విడత రచ్చబండలో వచ్చిన అర్జీలను పరిష్కరించి, రెండో విడతలో వచ్చిన రేషన్‌కార్డులు, గృహ నిర్మాణాలకు మంజూరు పత్రాలు, పింఛన్లు పంపిణీ చే శారన్నారు. రెండో విడతలో వచ్చిన అర్జీలను పరిష్కరించి మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తా జాగా జరగనున్న రచ్చబండలో 17 లక్షల 94 వేల గృహ నిర్మాణ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తారన్నారు. 4 లక్షల 98 వేల ఎస్సీ కుటుంబాలు, 5 లక్షల 15 వేల ఎస్టీ కుటుంబాలకు విద్యుత్ బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కన్నా లక్ష్మీనారాయణ ఆదేశించారు. కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మట్టితో మెరక పెంచేందుకు నిధులు మం జూ రు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పితాని సత్యనారాయణను కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, సీపీఓ కేటీ వెంకయ్య, డీఆర్డీఏ పీడీ పద్మజ, డ్వామా పీడీ కే పోలప్ప పాల్గొన్నారు.