thimmaraju palli
-
తినడానికి కూడా లేనప్పుడే నా చేయి పట్టుకుంది: కిరణ్ అబ్బవరం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తోన్న తాజా చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. ఈ మూవీలో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన సాయితేజ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన సతీమణి రహస్య గోరఖ్‌పై ప్రశంసలు కురిపించారు. తనకు తినడానికి కూడా డబ్బులు లేని సమయంలో తనను నమ్మిందని కిరణ్ అబ్బవరం కొనియాడారు. మూవీ ఆఫర్ల కోసం నేను తిరుగుతున్న రోజుల్లో ఇంటి నుంచి నాకోసం లంచ్ బాక్స్ తెచ్చేదని వెల్లడించారు. నా భార్య నా దగ్గర ఏమీ లేనప్పుడే నా చేయి పట్టుకుందని ఎమోషనల్ అయ్యారు.ఆ తర్వాత రహస్య గోరఖ్ తన భర్త గురించి మాట్లాడారు. నేను మాత్రం పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో అని.. కానీ పెళ్లి చేసుకుంది మాత్రం పక్కా ఊరోడ్ని అని కామెంట్స్ చేసింది. పెళ్లయ్యాక తను కష్టపడతాడు.. నేను ఖర్చు పెడతాను అనుకున్నానని తెలిపింది. కానీ అతనికి చుట్టూ జనం ఉండాలి.. సందడి సందడిగా కనిపించాలని అన్నారు. లైఫ్‌లో ఇలాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటారని రహస్య గోరఖ్ ప్రశంసలు కురిపించింది. -
ఈ ఊరికి టీవీ తీసుకొని వస్తాడు!
‘ఊరోళ్లంతా చందాలు ఏసుకొని ఈ శివరాత్రికి సతీష్‌కి కాసులు ఈయండి. ఈ ఊరికి టీవీ తీసుకొని వస్తాడు’ అనే డైలాగ్‌తో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ట్రైలర్ ఆరంభమైంది. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా వి. మునిరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సుమైర స్టూడియోస్‌తో కలిసి కేఏ ప్రోడక్షన్స్ పై కిరణ్ అబ్బవరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ని హీరో వెంకటేశ్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ లాంచ్ ప్రెస్మీట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘తిమ్మరాజుపల్లి టీవీ’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన వెంకటేశ్‌గారికి థ్యాంక్స్. మా మూవీ ట్రైలర్, సాంగ్స్, కంటెంట్ చూడండి... మీకు నచ్చితేనే థియేటర్స్‌కు వెళ్లి మా టీమ్‌ని సపోర్ట్ చేయండి. ‘తిమ్మరాజు పల్లి’కి వస్తే మీ ఊరు, అప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని గ్యారెంటీ ఇస్తున్నాను’’ అని తెలిపారు. వి. మునిరాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమా ఒక మ్యూజియంలా ఉంటుంది. ఇందులో అంతరించిపోతున్న మన సంస్కృతి, జ్ఞాపకాలు, టీవీ గురించి ఉండే భావోద్వేగాలను చూస్తారు’’ అని పేర్కొన్నారు. ‘‘ట్రైలర్లో మీరు చూసిన కంటెంట్‌కి మించి సినిమాలో చూస్తారు. ఈ నెల 17న మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్‌తో మా సినిమా చూసేందుకు వెళ్లండి’’ అని వేద చెప్పారు. ‘‘మన లైఫ్‌లో చూసే స్వీట్ మెమొరీస్ ఈ చిత్రంలో ఉంటాయి’’ అన్నారు సాయి తేజ్. -
నిర్మాతగా కిరణ్ అబ్బవరం.. తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తోన్న తాజా చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ పీరియాడికల్ మూవీలో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన సాయితేజ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్గా కనిపించనుంది. కేఏప్రోడక్షన్స్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో వి మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలోనే సాగే కథగా తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. టీవీ సౌకర్యం లేని ఓ ఊరి కథగా ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ట్రైలర్లో గ్రామంలోని అందరూ కలిసి ఓకే చోట టీవీ చూడటం లాంటి సీన్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో ప్రదీప్ కొట్టె, తేజ విహాన్, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ వడ్డాది, మాధవి ప్రసాద్, టీవీ రామన్, చిట్టిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
నందలూరు: నందలూరు మండలంలోని సోమశిల వెనుక జలాలవద్ద పాత తిమ్మరాజుపల్లె గ్రామం మొండిగోడల వద్ద దాచి ఉన్న ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఇన్చార్జి ఎస్ఐ ధనుంజయుడు తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి టాస్క్‌ఫోర్స్ వారి సమాచారంతో రాజంపేట డీఎస్పీ రాజేంద్ర ఆదేశాలమేరకు బుధవారం తెల్లవారుజామున పాత తిమ్మరాజుపల్లెలోదాడులు నిర్వహించగా నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు తమపై రాళ్లు రువ్వుతూ పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. వారిలో పొత్తపి గ్రామానికి చెందిన ఈగా పెంచల్‌రెడ్డి, చుక్కాయపల్లె గ్రామానికి చెందిన చుక్కా వెంకటరమణ, కోనేటి శ్రీనివాసులును అదుపులోకి తీసుకోగా పొత్తపికి చెందిన వెంకటరమణారెడ్డి పారిపోయాడన్నారు. అరెస్టుచేసిన వారిని నందలూరు కోర్టులో హాజరుపరుచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించినట్లు తెలిపారు. ఈ దాడులలో కోర్టు కానిస్టేబుల్ హేమాద్రి, సుధాకర్‌రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


