breaking news
Testis
-
యాండ్రాలజీ కౌన్సెలింగ్
నా వయస్సు 28 ఏళ్లు. నాకు ఎడమవైపున ఉన్న వృషణం కుడివైపు దానికంటే కొంచెం కిందికి జారినట్లుగా ఉంటుంది. ఇలా ఉంటే నేను పెళ్లి చేసుకొని సెక్స్‌లో పాల్గొంటే ఇబ్బందులు వస్తాయా? - సీహెచ్.ఎమ్.ఆర్. విజయవాడ సాధారణంగా ఎడమవైపున ఉండే వృషణం కుడివైపు కంటే కొంచెం కిందికే ఉంటుంది. ఇలా వృషణాలు సమానమైన లెవెల్లో లేకపోవడం సర్వసాధారణం. వృషణాల లెవెల్ సమానంగా లేకపోవడానికీ, సెక్స్ సామర్థ్యానికి సంబంధం లేదు. మీకు సెక్స్ కోరికలు మామూలుగానే కలుగుతూ, అంగస్తంభన నార్మల్‌గా ఉంటే, వృషణాల్లో నొప్పి లేకపోతే నిర్భయంగా పెళ్లిచేసుకోవచ్చు. ఇది మీ దాంపత్య సుఖానికి ఏ విధంగానూ అడ్డు కానేకాదు. నా వయస్సు 18 ఏళ్లు. నాకు గత నాలుగేళ్లుగా రొమ్ములు ఉన్నాయి. నాకు తగిన సలహా ఇవ్వండి. - ఒక సోదరుడు, హైదరాబాద్ మీ సమస్యను గైనకోమేజియా అంటారు. కొన్ని సందర్భాల్లో హార్మోన్ల అసమతౌల్యం (హార్మోనల్ ఇంబ్యాలెన్స్)వల్ల ... అంటే ఈస్ట్రోజెన్, ప్రొలాక్టిన్ హార్మోన్లు ఎక్కువగా ఉండటం లేదా టెస్టోస్టెరాన్ తక్కువైనప్పుడు ఇలా జరగవచ్చు. మీ రొమ్ము భాగం బయటకు కనిపించేంత పెద్దగా ఉంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇటీవల వచ్చిన లైపోసక్షన్ ప్రక్రియ ద్వారా ఈ బ్రెస్ట్‌లోని ఫ్యాట్‌ను ఆపరేషన్ లేకుండా కూడా తొలగించుకోవచ్చు. కాకపోతే ఈ సమస్య ఎందుకు వచ్చిందని తెలుసుకోడానికి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందేమో తెలుసుకొని, ఒకవేళ ఉంటే దాన్ని చక్కదిద్దడానికి ఓసారి యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కె.పి.హెచ్.బి, హైదరాబాద్ -
ఆపరేషన్ తర్వాత మామూలైపోతుంది!
వ్యక్తిగతం డాక్టర్! నాకు 32 ఏళ్లు. మెట్లు జారి పడ్డాను. కుడివైపు వృషణంలో అప్పటినుంచీ నొప్పి వస్తోంది. వాపు కూడా ఉంది. వైద్యుడిని సంప్రదిస్తే హైడ్రోసిల్ సర్జరీ చేయాలని అన్నారు. దెబ్బతగలడానికీ, హైడ్రోసిల్(వరిబీజం)కూ సంబంధం లేదని కూడా అన్నారు. సలహా ఇవ్వండి. - పి.పి.ఎస్., నెల్లూరు సాధారణంగా యుక్తవయస్కుల్లో చాలా మంది... చిన్న దెబ్బ తగిలినప్పుడు టెస్టిస్‌లో వాపును గమనించి డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. ఒకవేళ దెబ్బ తగలడం వల్లనే టెస్టిస్‌లో వాపు వచ్చిందంటే... రక్తనాళం చిట్లడం వల్ల (హిమటోమా) వచ్చినట్టు. కాకపోతే ఇలాంటి సమస్య నేరుగా వృషణంపై చాలా బలంగా తగలడం వల్లనే వస్తుంది. మీ సమస్య వేరు. హైడ్రోసిల్, హెర్నియా అన్న సమస్యలు అంతకు ముందు నుంచే ఉండి, ఇలా చిన్న దెబ్బతగిలినప్పుడు మనం గుర్తించడానికి వీలు కలుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో డాప్లర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ (వృషణాలకు స్కానింగ్) పరీక్షలు చేయించుకుని దానికి అనుగుణంగా చికిత్స పొందాలి. నాకు ఇటీవలే వివాహమైంది. ఓసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు పురుషాంగంలో నొప్పి వచ్చింది. తర్వాత బాగా వాచింది. ఆసుపత్రికి వెళ్లాను. మత్తు ఇచ్చి ఆపరేషన్ చేశారు. ‘పెనిస్ ఫ్రాక్చర్ అయ్యింది, సరిచేసి కుట్లువేశా’మన్నారు డాక్టర్. పురుషాంగంలో ఎముక ఉండదు కదా! ఫ్రాక్చర్ ఎలా అయ్యింది? ఇప్పుడు మామూలుగానే అంగస్తంభన అవుతోంది. కానీ సంభోగంలో పాల్గొనాలంటే భయంగా ఉంది... - ఆర్.డి.కె., గుంటూరు సాధారణంగా లైంగికోద్రేకం కలిగినప్పుడు పురుషాంగంలోకి రక్తం ప్రవేశించి, బయటకు పోయే ద్వారాలు మూసుకుపోవడం వల్ల అది గట్టిగా మారుతుంది. పురుషాంగం లోపల కుడివైపూ, ఎడమవైపూ రెండు రబ్బరు షీట్లలాంటివి ఉంటాయి. వీటిలో రక్తం నిండటం వల్ల పురుషాంగం గట్టిపడుతుంది. కొన్ని సందర్భాల్లో చాలా అరుదైన భంగిమల్లో శృంగారం జరిపినప్పుడు, అకస్మాత్తుగా యోని నుంచి పురుషాంగం జారిపోయి, దానిపై ఒకేసారి విపరీతమైన ఒత్తిడి పడటం వల్ల ఈ రబ్బర్ షీట్ల వంటి నిర్మాణంలో ఒక పగులు (క్రాక్) ఏర్పడే ప్రమాదం ఉంది. అప్పుడు రక్తనాళాల నుంచి రక్తం బయటకు రావడం వల్ల పురుషాంగానికి వాపు వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మీ డాక్టర్ చెప్పినట్లుగా శస్త్రచికిత్స చేసి, పగులును సరి చేస్తారు. మీకు కూడా ఇదే జరిగివుంటుంది. మీరన్నట్టు నిజంగానే పురుషాంగంలో ఎముక ఏదీ ఉండదూ, అది విరగదూ. ఒకసారి ఇలాంటి సమస్యకు ఆపరేషన్ చేశాక కూడా అంగస్తంభనలు మామూలుగానే ఉంటాయి. మీ దాంపత్యజీవితానికి కూడా ఎలాంటి ఆటంకమూ ఉండదు. అయితే, శస్త్రచికిత్స చేశాక మూడు నెలల వ్యవధి మాత్రం ఉండాలి. డాక్టర్! నా వయసు 25 ఏళ్లు. మూడు నెలల క్రితం వివాహమైంది. తొలి మూడు రాత్రులూ అంగస్తంభన పూర్తిగా జరగలేదు. ఆ తర్వాత (నెల తర్వాత) ఒకటి రెండు సార్లు మాత్రమే మా మధ్య శృంగారం జరిగింది. నేను అసమర్థుడినని నా భార్య నానుంచి విడాకులు కోరుతోంది. మరి నేను శృంగారానికి పనికివస్తానా, రానా? ఎలా తెలుసుకోవాలి? - డి.వి.కె., విజయవాడ సర్వసాధారణంగా వివాహమైన తొలి రెండు మూడు నెలలూ వచ్చే లైంగిక సమస్యలకు సాంఘికంగా ఉండే అనేక సంకోచాలు ప్రధాన కారణాలు. మీ విషయంలో ‘సామర్థ్య లోపానికి’ అంగస్తంభన లేకపోవడం అన్నదే కారణం కాకపోవచ్చు. ఒకవేళ మీరు చెప్పినట్లు మీకు అంగస్తంభన మామూలుగానే ఉంటే పరీక్షల ద్వారా ఏమీ తెలియకపోవచ్చు. అంగస్తంభన లేదని మీరు కూడా భావిస్తూ ఉంటే... అప్పుడు హార్మోన్ పరీక్షలు, పైప్ టెస్ట్ ద్వారా దానికి కారణాలు ఏమిటో తెలుసుకోవచ్చు. పైప్ టెస్ట్ వల్ల శారీరకంగా మీకు ఎలాంటి లోపం లేదని తెలుస్తుంది. అంతేగాని... మానసిక కారణాలతో మీకు అంగస్తంభన కలగకపోతే మాత్రం, ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవడం సాధ్యం కాదు. అందుకే, పైప్ టెస్ట్ ద్వారా వచ్చే ఫలితాలను చూపి, తద్వారా మీరు లైంగికంగా సమర్థులేనని చట్టపరంగా నిరూపించుకోవడానికి ఈ పరీక్షలో వచ్చే ఫలితం ప్రమాణం కాదు. మానసిక కారణాలతో మీకు అంగస్తంభన కలగకపోతే మాత్రం, ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవడం సాధ్యం కాదు. మీ సందేహాలను పంపవలసిన చిరునామా: వ్యక్తిగతం, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34.. vyaktigatam.sakshi@gmail.com