breaking news
Tension at assembly media point
-
రాష్ట్రం విడిపోయిన తర్వాత రక్షణ ఉంటుందా?
తెలంగాణ ముసాయిదా బిల్లు శాసనసభ, శాసనమండలిలో చిచ్చు రేపింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా అసెంబ్లీ, మండలిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తెలంగాణ, సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల పోటాపోటీ నినాదాలు, వాగ్వాదాలతో అసెంబ్లీ ప్రాంగణం అట్టుడికింది. పెద్దల సభలోనూ ఇలాంటి వాతావరణమే కనిపించింది. మీడియా పాయింట్ అయితే పరిస్థితి రణరంగాన్ని తలపించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీధి రౌడీల్లా తోపులాటలకు దిగారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు-2013ను గందరగోళ పరిస్థితుల మధ్య రెండు సభల్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇరు సభల్లో సభాకార్యకలాపాలు స్తంభించాయి. రెండు సభలు వాయిదా పడిన తర్వాత బయటకు వచ్చిన ప్రజా ప్రతినిధులు ప్రవర్తించిన తీరు చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. ముఖ్యంగా తెలంగాణ ఎమ్మెల్యేలు భౌతిక దాడులకు దిగడం సీమాంధ్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. తమ ప్రజా ప్రతినిధులకే రక్షణ లేకపోతే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై తెలంగాణ నేతలు దాడికి పాల్పడ్డారు. గండ్ర వెంకటరమణారెడ్డి, గంగుల కమలాకర్ రెడ్డి కూడా సీమాంధ్ర నేతలపై దాడికి యత్నించారు. తెలంగాణ మీడియా ప్రతినిధులు కూడా దాడిలో పాలుపంచుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అటు మండలి మీడియా పాయింట్ వద్ద జరిగిన తోపులాటలో టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కింద పడిపోయారు. టీడీపీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ దురుసుగా ప్రవర్తించారు. సతీష్‌రెడ్డి బిల్లు ప్రతులను చించేందుకు ప్రయత్నించగా అడ్డుకుని, ఆయనపై దాడి చేసినంత పని చేశారు. పోలీసులు కల్పించుకోవడంతో ఆయన శాంతించారు. రాష్ట్రం విడిపోక ముందే పరిస్థితి ఇలా ఉంటే తర్వాత ఏమవుతుందోనని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో తమకే రక్షణ లేకపోతే సామాన్య సీమాంధ్ర ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రజల మనోభావాలను అసెంబ్లీ వేదికగా తెలిపితే దాడి చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులను తామెప్పుడూ అడ్డుకోలేదని గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తమకు రక్షణ ఉంటుందా అని ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్రుల భద్రతకు పూర్తి భరోసా ఇచ్చిన తర్వాతే తెలంగాణ ప్రక్రియపై ముందుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. -
9 నుంచి 11 గంటల వరకు ఉద్రిక్తత
-
9 నుంచి 11 గంటల వరకు ఉద్రిక్తత
హైదరాబాద్: గందరగోళం నడుమ తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బిల్లు ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ ఎమ్మెల్యేలు స్వాగతించగా, సీమాంధ్ర సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. అసెంబ్లీలో ఈ ఉదయం 9 నుంచి 11 గంటలకు వరకు చోటు చేసుకున్న సంఘటనల వరుస క్రమమిది. * ఈ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం * సభ ప్రారంభంకాగానే ఇరు ప్రాంతాల సభ్యుల నినాదాలు * స్పీకర్ పోడియం వద్ద సీమాంధ్ర, తెలంగాణ సభ్యుల ఆందోళన * సభను గంట పాటు వాయిదా వేసిన స్పీకర్ * 10 గంటలకు తిరిగి సమావేశమయిన అసెంబ్లీ * గందరగోళం నడుమ విభజనను బిల్లును సభలో ప్రవేశపెట్టిన స్పీకర్ * బిల్లును శాసనసభ వెబ్సైట్లో పెట్టినట్టు వెల్లడించిన స్పీకర్ * బిల్లును చదివి వినింపించిన అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం * తర్వాత సభను అర గంట వాయిదా వేసిన స్పీకర్ * బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో సభలో లేని సీఎం, చంద్రబాబు * సభ వెలుపల మీడియా పాయింట్ వద్ద ఉద్రికత్త * బిల్లు ప్రతులను చించేసిన టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ * ఉమను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల యత్నం * బిల్లు ప్రతులను తగులబెట్టిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు * వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై పోలీసుల సాక్షిగా టీఆర్ఎస్ నేతల దాడి * మీడియా పాయింట్ వద్ద ఆందోళన కొనసాగించిన వైఎస్సార్ సీపీ సభ్యులు