నూతన టెక్నాలజీతో ఆలయం తరలింపు
పురాతన కట్టడాలను ధ్వంసం చేసే పరిస్థితి మారి ప్రస్తుతం అదే కట్టడాలను వేరే ప్రాంతాలకు తరలించే విధంగా నూతన టెక్నాలజీ వచ్చింది. ఈ టెక్నాలజీ ఉపయోగించి ఆంబూరు సమీపంలోని ఒక ఆలయాన్ని వేరే చోటుకు మార్చే పనుల్లో హర్యానాకు చెందిన కార్మికులు నిమగ్నమయ్యారు.
వేలూరు: చెన్నై-బెంగళూరుకు జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రస్తుతం ఆంబూరు సమీపంలో జరుగుతున్నాయి. వేలూరు జిల్లా ఆంబూరు సమీపంలోని అయ్యనూర్ గ్రామంలోని జాతీయ రహదారిని ఆనుకొని ఆది పెద్దపల్లె గంగమ్మ పురాతన ఆలయం ఉంది. ప్రస్తుతం జాతీయ రహదారి పనులను విస్తరిస్తుండడంతో హైవే అధికారులు ఆలయాన్ని తొల గించాలని గ్రామస్తులకు తెలిపారు. ఇందుకు గ్రామస్తులు చర్చించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయాన్ని తొలగించరాదని అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
అయినప్పటికీ అధికారులు స్పందించక పోవడంతో గ్రామస్తులు ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు పంచాయతీలో చర్చించి ఆలయాన్ని ధ్వంసం చేయకుండా వేరే ప్రాంతానికి మార్చేందుకు సుమారు రూ.3 లక్షలు ఖర్చు అవుతుం దని తెలిపారు. దీంతో గ్రామస్తులు ప్రతి చందాలు వసూలు చేసి రూ. 3 లక్షల నగదు సేకరించారు.
హర్యానాకు చెందిన ఇంజినీరింగ్ సంస్థచే ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నాయి. వందేళ్ల ఆలయాన్ని ధ్వంసం చేయకుండా వేరే ప్రాంతానికి మార్చడం సంతోష కరమని ఆలయ కమిటీ చైర్మన్ మూర్తి, కార్యదర్శి బాలాజీ తెలిపారు.