ఆంధ్రా ఉద్యోగులను స్వరాష్ట్రం పంపాలి
పంజగుట్ట: తెలంగాణ నుంచి రిలీవైన ఆంధ్రా స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులను తిరిగి తెలంగాణకు అటాచ్ చేస్తే ఉద్యమిస్తామని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఏ ప్రాంత ఉద్యోగులు అదే ప్రాంతంలో పనిచేయాలని వారు డిమాండ్ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అసోసియేషన్ అధ్యక్షుడు జి.సంపత్‌కుమార్, సెక్రటరీ జనరల్ రత్నాకర్ రావు మాట్లాడారు. తెలంగాణ నుంచి రిలీవ్ అయిన 1250 మంది ఆంధ్రాప్రాంత ఉద్యోగులకు గత ఎప్రిల్ నుంచి ప్రతినెలా తెలంగాణ ప్రభుత్వం 16 కోట్లు చెల్లిస్తోందని, ఇది ఇక్కడి ప్రజలపై ఆర్థికంగా ఎంతో భారమన్నారు. వీరిని వెంటనే రిలీవ్ చేయకపోతే ఇక్కడి పదోన్నతులకు నష్టం వాటిల్లుతుందన్నారు.
ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు 220 మందిని ఆక్కడి ప్రభుత్వం రిలీవ్ చేయగానే తెలంగాణ ప్రభుత్వం పోస్టులు లేకున్నప్పటికీ సూపర్‌మెమోరి పోస్టులు క్రియేట్ చేసి విధుల్లో చేర్చుకుందన్నారు. రిలీవ్ అయిన ఆంధ్రా ఉద్యోగులు తమను స్వ రాష్ట్రానికి పంపాలని 20 రోజులుగా విద్యుత్ సౌధలో రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం వారిని విధులో్లకి చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అడిషనల్ సెక్రటరీ జనరల్ కె.కిరణ్‌కుమార్, వెంకట నారాయణ, జనప్రియ, సూర్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.