breaking news
telangana pensions
-
పండుటాకు.. ఎండు రొట్టె..!
తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ కోసం వృద్ధులు పడుతున్న పాట్లకు సజీవ సాక్ష్యం ఈ చిత్రం. తమకు పింఛన్ రావడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ను కలసి తమ గోడు చెప్పుకోవాలని నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి మల్లయ్య (75), అంజయ్య(80), రామస్వామి అమసమ్మ(74), సూసమ్మ (85) (తన భర్త ఫించన్ కోసం) హైదరాబాద్ వచ్చారు. సీఎంకు వినతిపత్రం ఇస్తే ఆయన స్పందించి పింఛన్ ఇప్పిస్తాడని కాళ్లీడ్చుకుంటూ వచ్చిన వారికి నిరాశే ఎదురైంది. వారు ఇచ్చే వినతిపత్రం ముఖ్యమంత్రి తీసుకోరని, విచారణ కేంద్రంలో దానిని ఇవ్వాలని అక్కడివారు చెప్పడంతో చేసేదేమీ లేక అడ్కడ వినతిపత్రం ఇచ్చి నలుగురూ వెనుదిరిగారు. ఈ సమయంలో ఆకలికి తాళలేని ఓ అవ్వ తాను జోలిలో తెచ్చుకున్న ఎండిన రొట్టెను సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎదురుగా కూర్చుని తినింది. ఈ దృశ్యం అక్కడి వారి హృదయాలను కలచివేసింది. - సాక్షి, హైదరాబాద్ - ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్ -
ఒకేసారి రెండు నెలల పింఛన్లు
అక్టోబర్, నవంబర్ నెలల పింఛన్లు రెండింటినీ ఒకేసారి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 10 నుంచి 15వ తేదీ మధ్య పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని, గ్రామ పంచాయతీల వారీగానే పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. పింఛన్ల పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ సోమవారం భేటీ అయ్యారు. పింఛన్ల కోసం ఇప్పటివరకు 25.68 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. గుర్తించిన లబ్ధిదారులను పంచాయతీల వారీగా జాబితా విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.