Telangana IAS
-
మైనింగ్ కేసులో ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: యూపీ అక్రమ మైనింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ఐఏఎస్ అధికారిణి బి.చంద్రకళ, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్సీ రమేశ్ కుమార్ మిశ్రాతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీచేసింది. ఈడీ విచారణాధికారి ఎదుట జనవరి 24, 28న హాజరు కావాలని చంద్రకళ, రమేశ్ మిశ్రాలను ఆదేశించింది. మిగిలిన ఇద్దరు అధికారులకు వచ్చేవారం సమన్లు జారీచేస్తామని పేర్కొంది. 2012–16 మధ్యకాలంలో యూపీలోని హామీర్పూర్ జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగినట్లు సీబీఐ కేసు నమోదుచేసింది. అప్పట్లో యూపీ సీఎంగా ఉన్న అఖిలేశ్ యాదవ్ తన వద్ద గనుల శాఖను అట్టిపెట్టుకున్నారనీ, అనుమతుల జారీలో నిబంధనలు ఉల్లంఘించారని సీబీఐ ఆరోపించింది. తాజాగా సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా అక్రమ నగదు చెలామణి చట్టం(పీఎంఎల్ఏ) కింద ఈడీ క్రిమినల్ కేసు నమోదుచేసింది. మైనింగ్ అనుమతుల జారీకి నిందితులు అందుకున్న అవినీతి సొమ్ము హవాలా మార్గాల ద్వారా వచ్చిందా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి. విచారణలో భాగంగా నిందితుల స్థిర, చరాస్తులను జప్తు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. -
అఖిలేశ్ మెడకు మైనింగ్ కేసు!
న్యూఢిల్లీ: అక్రమ మైనింగ్ కేసులో యూపీ మాజీ సీఎం అఖిలేశ్ సీబీఐ విచారణ ఎదుర్కొనే చాన్సుంది. ఈ మేరకు నమోదైన కేసు వివరాల్ని సీబీఐ వెల్లడించింది. ఐఏఎస్ అధికారిణి బి.చంద్రకళ, ఎస్పీ ఎమ్మెల్సీ రమేశ్ కుమార్ మిశ్రా, బీఎస్పీ నాయకుడు సంజయ్ దీక్షిత్ సహా మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి శనివారం సీబీఐ అధికారులు.. యూపీ, ఢిల్లీలో నిందితులకు చెందిన 14 చోట్ల సోదాలు నిర్వహించారు. 2012–16 మధ్య కాలంలో హమీర్పూర్ జిల్లాలో ఇసుక, కంకర లాంటి ఖనిజాల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయన్నది తాజా కేసులో ప్రధాన ఆరోపణ. 2012–17 మధ్య కాలంలో నాటి సీఎం అఖిలేశ్ 2012–13లో గనుల శాఖను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. అందుకే ఆయన పాత్రపై సీబీఐ దృష్టిసారించే వీలుంది. అక్రమంగా కాంట్రాక్టులిచ్చారు.. 2012–14 మధ్య కాలంలో హమీర్పూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన చంద్రకళ ఈ–టెండర్ నిబంధనల్ని ఉల్లంఘించి కాంట్రాక్టులు కట్టబెట్టారని సీబీఐ ఆరోపించింది. ఆమె అక్రమంగా కొత్త అనుమతులిచ్చారని, పాత వాటిని పునరుద్ధరించారని పేర్కొంది. అక్రమ మైనింగ్‌కు అనుమతిచ్చిన చంద్రకళ, ఇతర అధికారులు.. గుత్తేదారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన చంద్రకళ 2008లో ఐఏఎస్‌కు ఎంపికై, యూపీ కేడర్ అధికారిగా నియమితులయ్యారు. -
అధికారులకు కీలకశాఖల అదనపు బాధ్యతలు
హైదరాబాద్ : తెలంగాణకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు విదేశీ పర్యటనకు వెళుతున్న సందర్భంగా పలువురు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విదేశీ పర్యటనలో భాగంగా ఉన్నతాధికారులు యూఎస్, యూకే దేశాలు సందర్శించనున్నారు. అక్కడి మోడ్రన్ పోలీసింగ్, సీసీ కెమెరాల వ్యవస్థ ఇతర అంశాలపై అధ్యయనం చేయనున్నారు. *రామకృష్ణారావు ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ స్థానంలో శివశంకర్ కు అదనపు బాధ్యతలు. *రాజీవ్ త్రివేదీ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ స్థానంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హాకు అదనపు బాధ్యతలు. *అనురాగ్ శర్మ డీజీపీ స్థానంలో అదనపు డీజీ సుదీప్ లక్టాకియాకు అదనపు బాధ్యతలు. *మహేందర్ రెడ్డి పోలీస్ కమిషనర్, హైదరాబాద్ స్థానంలో అదనపు కమిషనర్ జితేందర్ కు అదనపు బాధ్యతలు.. వీరంతా పదిరోజుల పాటు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. -
కలెక్టరమ్మ.. తప్పును నిలబెట్టి నిలదీసింది!!
-
కాంట్రాక్టర్లకు క్లాస్ పీకిన చంద్రకళ
* ఉత్తరప్రదేశ్‌లో సత్తా చాటుతున్న తెలంగాణ ఐఏఎస్ చంద్రకళ * నాణ్యతలేని రహదారి పనులు చేసిన అధికారులు, కాంట్రాక్టర్లు * స్కూల్ విద్యార్థుల్లా వారిని నిలబెట్టి మరీ క్లాస్ పీకిన వైనం * సామాజిక సంబంధాల వెబ్సైట్లలో వీడియో హల్చల్ బులంద్‌షహర్ (యూపీ): తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి బి.చంద్రకళ ఉత్తరప్రదేశ్‌లో సత్తా చాటుతున్నారు. అక్రమాలకు పాల్పడే అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లపై ఉక్కుపాదం మోపడం ద్వారా నిజాయితీకి మారు పేరుగా నిలుస్తున్నారు. బులంద్‌షహర్ జిల్లా కలెక్టర్ అయిన చంద్రకళ... రహదారి పనుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లను స్కూల్ పిల్లల్లా వరుసలో నిలబెట్టి మరీ క్లాస్ పీకారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక వెబ్సైట్లలో హల్చల్ చేస్తోంది. ఫేస్బుక్లో ఇప్పటివరకూ 6 లక్షల మంది ఈ వీడియోను చూశారు! దాంతో ఆమె ఒక్కసారిగా జాతీయస్థాయి వార్తల్లో నిలిచారు. బుధవారం బులంద్‌షహర్ జిల్లాలో పలు రహదారుల పనుల తీరును ఆమె పర్యవేక్షించారు. నాసిరకం ఇటుకలు, టైల్స్ వాడినట్టు ఈ సందర్భంగా గుర్తించారు. దాంతో జూనియర్ ఇంజనీర్లు, మున్సిపల్ అధికారులు, ఇతర సిబ్బందితోపాటు కాంట్రాక్టర్లపైనా ప్రజల సమక్షంలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై విచారణకు ఆదేశించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 17 కాంట్రాక్టులను రద్దు చేశారు. ‘‘మీరు చేసే పని ఇదేనా? మీరు జైలుకు వెళ్లడం ఖాయం. మీలో కొద్దిగైనా నైతికత అనేది ఉందా? మీరు సిగ్గుతో తలదించుకోవాలి’’ అంటూ వారిపై మండిపడ్డారు. యూపీ కేడర్‌కు చెందిన చంద్రకళ గతంలో మథుర కలెక్టర్‌గా చేశారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారా అక్కడి ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఈ మధ్య ఆమె బులంద్‌షహర్‌కు బదిలీ కావడంతో మథుర జిల్లా ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నందు వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఆమెను బదిలీ చేసినట్టు చెబుతున్నారు. గిరిజన తెగకు చెందిన బుఖ్యా చంద్రకళ స్వస్థలం కరీంనగర్ జిల్లా రామగుండం. పాఠశాల విద్యను రామగుండంలోనే అభ్యసించిన ఆమె డిగ్రీ, పీజీలను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. 2008లో సివిల్స్ పరీక్షల్లో 409వ ర్యాం కు సాధించారు. ఆమె భర్త ఎ.రాములు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వీరికి తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది.