breaking news
Tej Bahadur Singh
-
సిక్కులకు న్యాయం కోసం కృషి
నవీ ముంబై: సిక్కులకు గౌరవం, న్యాయం దక్కేలా కృషి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చెప్పారు. అందుకే, 1984లో ఇందిర మరణానంతరం సిక్కులపై జరిగిన దాడులపై ప్రత్యేక విచారణ జరిపేందుకు తమ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందన్నారు. మూసివేసిన ఎన్నో కేసులను తిరిగి తెరిచి, విచారణ చేపట్టామని తెలిపారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందజేశామన్నారు. జాతీయ మైనారిటీ కమిషన్‌లో సిక్కులకు మరింత ప్రాముఖ్యతను కల్పించామన్నారు. గురు తేజ్ బహదూర్ అమరత్వం పొంది 350 ఏళ్లయిన సందర్భంగా ముంబైలోని ఖర్గార్‌లో ఆదివారం జరిగిన ‘హింద్–ది–చదర్’ను ఉద్దేశించి ప్రధాని వర్చువల్‌గా మాట్లాడారు. అఫ్గానిస్తాన్‌లో పవిత్ర గురుగ్రంథ్ సాహిబ్ ప్రతులు, సిక్కు కుటుంబాల భద్రత ప్రమాదంలో పడగా ప్రభుత్వం తక్షణమే స్పందించి సురక్షితంగా స్వదేశానికి తరలించిందని గుర్తు చేశారు. అఫ్గాన్‌లో యాతనలు పడిన సిక్కులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పించామని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన సిక్కు కుటుంబాల పునరావాసానికి చర్యలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. వేలాది మంది సిక్కుల పేర్లను బ్లాక్ లిస్టు నుంచి తొలగించడంతోపాటు వీసా నిబంధనలను సడలించినట్లు ప్రధాని వివరించారు. భవిష్యత్తుకు బాటలు పరిచేవి..హింద్–ది–చాదర్ వంటి కార్యక్రమాలు కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడానికి కాకుండా భవిష్యత్తుకు దారులు వేస్తాయన్నారు. ‘గురు తేజ్ బహదూర్ కాలంలో ధైర్యం, సత్యసంధతకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో, నేటికీ అంతే సందర్భోచితంగా ఉంది. మన కొత్త తరం ఇటువంటి విలువలని అందిపుచ్చుకున్నప్పుడు, సంప్రదాయం అనేది కేవలం ఒక జ్ఞాపకంలా మిగిలిపోదు; అది భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారుతుంది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. మనం చరిత్రను కేవలం స్మరించుకోవడమే కాదు, దానిని మన జీవితాల్లోకి కూడా తెచ్చుకోవాలి’అని ప్రధాని మోదీ తన వర్చువల్ ప్రసంగంలో పేర్కొన్నారు.మన గురువుల త్యాగాలు..దేశ చరిత్ర పరాక్రమం, సమన్వయం మరియు సహకారంతో నిండి ఉందని ఆయన అన్నారు. గురువుల అత్యున్నత త్యాగం దేశ ఐక్యతను మరింత బలోపేతం చేసిందని ప్రధాని చెప్పారు. సమాజంలోని ప్రతి వర్గం వారి నుంచి స్ఫూర్తిని పొందిందని, అది సమాజం సత్య మార్గంలో ముందుకు స్థిరంగా సాగడానికి సాయపడిందని ప్రధాని తెలిపారు. ‘దేశానికి సామాజిక ఐక్యత ఎంతో అవసరమైన ఈ సమయంలో, మన గురువులు, సాధువుల ఆశీస్సులు మనకు ఉన్నాయనే నమ్మకాన్ని ఈ కార్యక్రమం కలిగిస్తోంది. ఈ ప్రయాణం గత ఏడాది నాగ్‌పూర్ నుంచి ప్రారంభమైంది, ఆ తర్వాత నాందేడ్ వరకు సాగింది. నేడు నవీ ముంబైలో ఈ ప్రయాణం ఒక ముఖ్యమైన దశకు చేరుకుంది’అని ప్రధాని అన్నారు. -
ఫ్యామిలీ కోర్టు జడ్జి ప్రపంచ రికార్డు!
ముజాఫర్ నగర్: ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ కుటుంబ న్యాయస్థానం ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ తేజ్ బహదుర్ సింగ్ అరుదైన ఘనత సాధించారు. తక్కువ సమయంలో ఎక్కువ కేసులు పరిష్కరించి గౌరవ న్యాయమూర్తి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన పేరును గిన్నిస్ బుక్ లో ఎక్కించనున్నారు. 327 రోజుల్లో 6,065 కేసులు పరిష్కరించి రికార్డు లిఖించారు. జిల్లాలో న్యాయవాదులు సమ్మె చేసినప్పటికీ ఆయన ఈ ఘనత సాధించడం విశేషం. పెండింగ్ కేసులను తగ్గించి, పిటిషనర్లకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో పనిచేసినట్టు జస్టిస్ తేజ్ బహదుర్ సింగ్ తెలిపారు. దేశంలో అత్యధిక కేసులు పరిష్కరించిన ఘనత తనదేనని చెప్పారు. విడిపోవాలనుకున్న 903 జంటలను మళ్లీ కలిపానని వెల్లడించారు. జస్టిస్ తేజ్ బహదుర్ సింగ్ పేరును ప్రపంచ రికార్డుల్లో నమోదు చేయనున్నట్టు గిన్నిస్ బుక్ నిర్వాహకులు తెలిపారు.


