breaking news
tarigoppala
-
విద్య, విజ్ఞానం మాత్రమే చాలదు! నిత్య జీవితానికి..
విద్య, విజ్ఞానం ఉన్నంత మాత్రాన చాలదు. నిత్య జీవితానికి లోకజ్ఞానం, ఇంగిత జ్ఞానం చాలా అవసరం. విద్యావంతులమని విర్రవీగరాదు. ప్రతి వ్యక్తి దగ్గర నేర్చుకోవలసినవి ఎన్నో వుంటాయని గుర్తించాలి. ఎంత విజ్ఞానికైనా ఒక్కొక్కసారి సామాన్య విషయం తెలియక పోవచ్చు, స్ఫురించక పోవచ్చు. ఎంతటి మేధావులైనా, కొన్నిసార్లు అతి సంక్లిష్టమైన విషయాల గురించి ఆలోచిస్తూ నిత్యజీవితంలోని చాలా సాధారణమైన విషయాలను గమనించలేకపోవచ్చు.న్యూటన్ గొప్ప వైజ్ఞానిక శాస్త్రవేత్త. భూమికి గల ఆకర్షణ శక్తిని కనిపెట్టినవాడు న్యూటన్. నిరంతరం తన పరిశోధనాంశానికి సంబంధించిన ఆలోచనలోనే నిమగ్నుడై ఉండేవాడు. పరిశోధనలే అతని లోకం. ఇతర విషయాలను అతను ఏమీ పట్టించుకోలేదు.న్యూటన్ ఎంతో ప్రీతిగా ఒక పిల్లిని పెంచేవాడు, అతను తలుపు వేసుకొని పరిశోధనలో నిమగ్నుడై ఉన్నప్పుడు పిల్లి తలుపు దగ్గర చేరి ‘మ్యావ్ మ్యావ్ ’ అని అరిచేది. ఇది చూసి జాలి వేసి తలుపులో ఒక రంధ్రం చేయించాడు. దానికి అవసరమైనప్పుడంతా ఆ పిల్లి ఆ రంధ్రంనుండి లోపలికి వచ్చి, పోతూ వుండేది. కొంత కాలానికి ఆ పిల్లికి రెండు పిల్లలు పుట్టాయి.న్యూటన్ వడ్రంగిని పిలిపించి మరో రెండు రంధ్రాలు చేయమన్నాడు. వడ్రంగి రెండు రంధ్రాలు ‘దేనికి’ అని అడిగాడు. అప్పుడు న్యూటన్ ‘ఇన్నాళ్ళు ఒకే పెద్ద పిల్లి వుండేది. ఇప్పుడు దానికి రెండు పిల్లలు పుట్టాయి. వాటికోసం మరో రెండు కన్నాలు కావాలి కదా!‘ అన్నాడు. ‘‘ఏమండీ! ఉన్న ఒక రంధ్రంలో నుండే ఆ రెండు పిల్లలు దూరవచ్చు. ఒకదాని తరువాత మరొకటి వెళ్తాయి కదా’ అన్నాడు. ‘‘వడ్రంగికి వున్న తెలివి నాకు లేకపోయిందే. నేనీవేళ ఒక గుణపాఠం నేర్చుకున్నాను.’’ అని న్యూటన్ అనుకున్నాడు.విద్య, హోదాతో సంబంధం లేకుండా.. చిన్న పిల్లల నుండి, సామాన్య వృత్తుల వారి వరకు ప్రతి ఒక్కరి దగ్గరి నుండి మనం నేర్చుకోవడానికి ఏదోకటి ఉంటుంది. ఈ కథలో న్యూట¯Œ కు పిల్లి పట్ల ఉన్న జాలి, ప్రేమ కూడా మనకు కనిపిస్తాయి. పరిశోధనల్లో ఎంత మునిగిపోయినా, ఆ మూగజీవి ఇబ్బంది పడకూడదనే అతని ఆలోచన గొప్పది. ‘విద్య వినయాన్ని ఇస్తుంది’ అంటారు. ఈ కథ న్యూటన్ మేధస్సునే కాకుండా, అతనిలోని వినయాన్ని, నిరంతర అభ్యాసకుడిని మనకు పరిచయం చేస్తుంది.పుస్తక జ్ఞానం ఎంత ఉన్నా, లోకజ్ఞానం లేదా కామన్ సెన్స్ అనేది అంతే ముఖ్యం. తాను ప్రపంచం గర్వించదగ్గ మహా శాస్త్రవేత్తనని న్యూటన్ అహంకరించలేదు. ఒక సామాన్య వడ్రంగి చెప్పిన మాటలోని నిజాన్ని గ్రహించి, ‘ఈ రోజు ఒక గుణపాఠం నేర్చుకున్నాన’ని ఒప్పుకోవడం అతని గొప్పతనానికి, వినమ్రతకు నిదర్శనం. – తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి -
పదేళ్లుగా మంచినీళ్లు ముట్టని ముసలవ్వ
సాక్షి, తరిగొప్పుల(వరంగల్) : ఈ ఫొటోలో ఉన్న అవ్వను చూశారా.. ఓ విలక్షణ లక్షణం ఆమె సొంతం. అదేంటో తెలిస్తే.. ఎవరైనా, ఔరా.. అనక మానరు! దాహమంటే.. ఏమిటో ఆమెకు తెలియదు. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా పదేళ్లపాటు ఆమె చుక్కనీరు ముట్టితే ఒట్టు! బుక్కెడు బువ్వ తినకుండా ఉపాసం ఉండొచ్చుకానీ.. గుక్కెడు మంచి నీళ్లు తాగకుండా ఉండలేం. అలాంటిది పదేళ్లుగా చుక్క నీరు తాగకుండా ఉంటోంది జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన పింగిళి ప్రమీల (70). ఆకలేసినప్పుడు అన్నం తిన్నా మంచినీళ్లు మాత్రం తాగదు. అన్నం తిన్నప్పుడు ఛాతీ భాగంలో తట్టుకున్నట్టు అనిపిస్తే.. నాలుకపై కొంచెం కారం వేసుకుంటే సరిపోతుందని ఈమె చెబుతోంది. పదేళ్ల క్రితం వరకు మంచినీళ్లు తాగిన ప్రమీలకు ఒక్కసారిగా తాగునీటిపై అనాసక్తి ఏర్పడటంతో మానేసినట్లు చెబుతోంది. చదవండి: చికెన్.. చికెన్.. మటన్.. చికెన్ చదవండి: కరోనా సోకితే 8 నెలలు సేఫ్? -
పిడుగు పాటుకు ఇద్దరి మృతి
తరిగొప్పుల: కంకుల కోసం చేనులోకి వెళ్లిన ఇద్దరిని మృత్యు వు కబలించింది. అకస్మాత్తుగా పిడుగు పడడంతో ఓ యువ కుడితో పాటు బాలుడు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొంతగట్టునాగారం గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బొంతగట్టునాగారానికి చెందిన సుంకరి రాజు, మంజుల దంపతుల కుమారుడు సుంకరి సతీష్ (20) పదో తరగతి పూర్తి చేసి మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు. అలాగే, సాంబయ్య, స్వరూప దంపతుల కుమారుడు పొగాకుల దినేష్ (15) తొమ్మిదో తరగతి పూర్తయింది. ఇద్దరూ మంచి మిత్రులు కాగా, వేసవి సెలవులు రావడంతో ఆదివారం సాయంత్రం కంకుల కోసం ఇద్దరూ కలిసి గ్రామంలోని మొక్కజొన్న చేనులోకి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడడంతో సతీష్, దినేష్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాలు చేసిన రోదనలు మిన్నంటాయి. ఎస్సై రాజేష్‌నాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
శిథిలావస్థలో గ్రంథాలయం
తరిగొప్పుల(నర్మెట) : పది రోజుల క్రితం కురిసన వర్షాలకు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు పూర్తిగా తడిసిపోయాయి. గురువారం ఆ పుస్తకాలను గ్రంథాలయ సిబ్బంది భవనం ముందు ఆరబెట్టడంతో ‘సాక్షి’ కంటపడింది. తరిగొప్పుల గ్రామ గ్రంథాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో పాఠకులు ఎప్పుడూ కూలుతుందోనని భయపడుతున్నారు. భవనం పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. దీంతో గ్రంథాలయానికి రావడానికి పాఠకులు జంకుతున్నారు. ఎంతో సమాచారం, చరిత్ర కలిగిన పుస్తకాలు పూర్తిగా నానిపోవడంతో సంచుల్లో ఓ గదిలో భద్రపరిచారు. మరికొన్ని వర్షానికి నానిపోయి చినిగిపోయాయి. సంబంధిత అధికారులు కాని, ప్రజాప్రతినిధులు కాని స్పందించి గ్రంథాలయానికి నూతన భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


