breaking news
Tangutoor
-
ఆ రోడ్డు.. 20 గ్రామాల సమస్య!
టంగుటూరు: ఓ 2 కిలోమీటర్ల రహదారి 20 గ్రామాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మర్లపాడు గ్రామంలో బస్టాండ్ నుంచి కొండల మీదుగా ఒంగోలుకు వెళ్లే సుమారు రెండు కిలోమీటర్ల వరకు పంచాయతీరాజ్ పరిధిలోని మట్టిరోడ్డులో రాళ్లు పైకి లేచి గుంతలమయంగా మారింది. ఈ రోడ్డులో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణం సాగిస్తుంటాయి.అయితే ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రోడ్డు చిన్నపాటి వర్షానికే పూర్తిగా బురద నీళ్లతో నిండి అధ్వారంగా తయారవుతోంది. దీంతో ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనచోదకులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం ఈ రోడ్డు నుంచే స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు ప్రయాణం సాగిస్తుంటాయి. అంతేకాకుండా మర్రిపూడి జువ్విగుంట, కొండపి, తంగెళ్ల, జాళ్లపాలెం దూరప్రాంతాల ప్రజలు తక్కువ సమయంలో ఒంగోలు వెళ్లేందుకు ఈ మార్గం ఎంతో అనువుగా ఉంటుంది.ఇలాంటి పరిస్థితుల్లో సుమారు రెండు కిలోమీటర్ల మట్టి రోడ్డు ఇలా గుంతలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ 2 కిలోమీటర్ల రోడ్డును తారురోడ్డుగా మారితే ఒంగోలుకు, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సురక్షితంగా దూరం తగ్గడంతో పాటు తక్కువ సమయం పడుతుందని ప్రయాణిలకంటున్నారు. అధికారులు రోడ్డుపై దృష్టి సారించి తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.ఇవి చదవండి: ఆ రెండు రోజులు వైన్స్ బంద్ : పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ -
దేవాలయాల్లో దొంగలు పడ్డారు
టంగుటూరు(రాజుపాళెం): దేవాలయాల్లో దొంగలు పడ్డారు. ఒకే రోజు మూడు ఆలయాల్లో చోరీ చేశారు. రాజుపాళెం మండలంలోని టంగుటూరులో రామాలయం, గంగమ్మ, వీరభద్ర దేవాలయాల తాళాలను ఆదివారం తెల్లవారుజామున పగులగొట్టి హుండీలను ఎత్తుకెళ్లారు. వాటిని కుందూ నదికి వెళ్లే రస్తాలో పగులగొట్టి అందులో ఉన్న నగదును దోచుకున్నారు. ఆ హుండీలను అక్కడే వదిలేసి వెళ్లారు. కుందూకు వెళ్లే దారిలో గంగమ్మ, వీరభద్రస్వామి దేవాలయాలు ఉన్నాయి. గంగమ్మ దేవాలయంలో తెల్లవారుజామున రెండు గంటల వరకు గ్రామస్తులు భజన కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాతనే ఈ ఘటన జరిగిందని వారు అనుకుంటున్నారు. గ్రామం మధ్యలో రామాలయం ఉంది. ఈ ఆలయాల చుట్టుపక్కల ఇళ్లు ఉన్నాయి. కడప నుంచి క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ మూర్తి పరిశీలించారు. ఈ మూడు ఆలయాల్లో కలిపి మొత్తం రూ.9 వేల వరకు దోచుకెళ్లినట్లు రామాంజనేయులరెడ్డి, నరసింహుడు, రాముడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. దేవాలయాలే టార్గెట్ ఇటీవల వరుసగా జరుగుతున్న చోరీలను పరిశీలిస్తే.. దొంగలు దేవాలయాలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. జిల్లాలో వీరపునాయినిపల్లె మండలంలోని అనిమెల సంగమేశ్వర ఆలయం, రాజుపాళెంలోని శివాలయం, వెల్లాలలోని శివాలయాల్లో ఇటీవల దొంగతనాలు జరిగాయి. వెల్లాలలోని శ్రీచెన్నకేశవ స్వామి ఆలయంలో హుండీ ఎంత సేపటికి తెరుచుకోక పోవడంతో దొంగలు వెనుతిరిగారు. సీసీ కెమెరాల్లో వారి చిత్రాలు నిక్షిప్తమయ్యాయి. దొంగల ఆచూకీపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచకపోతే మరికొన్ని దేవాలయాల్లో జరిగే అవకాశం ఉందని భక్తులు పేర్కొంటున్నారు. ఎక్కువగా గ్రామాల్లోనే జరుగుతున్నాయి. రాత్రి వేళలో పోలీసులు గస్తీని ముమ్మరం చేయాలని వారు కోరుతున్నారు.