breaking news
tamil tiger
-
ఎవరీ ప్రభాకరన్? నెడుమారన్ ప్రకటనతో కలకలం.. నిజంగా బతికే ఉన్నాడా?
వేలుపిళ్లై ప్రభాకరన్. తమిళులకు ఆరాధ్యుడు. శ్రీలంక ప్రభుత్వం దృష్టిలో రక్తపుటేర్లు పారించిన ఉగ్రవాది. భారత్ దృష్టిలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని పొట్టన పెట్టుకున్న హంతకుడు. 2009లో శ్రీలంక సైన్యం దాడిలో హతమైనట్టు ప్రపంచమంతా నమ్ముతుండగా, ఆయన బతికే ఉన్నారంటూ తమిళ నేత నెడుమారన్ తాజాగా చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది... పెద్దపులిగా పేరుబడ్డ ప్రభాకరన్‌ది ఆద్యంతం ఆసక్తికర ప్రస్థానం. శ్రీలంకలోని తమిళులకు ప్రత్యేక దేశం కావాలన్న ఆశయ సాధనకు మూడు దశాబ్దాలకు పైగా లంక సైన్యంపై సాయుధ పోరాటం సాగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు ఆరాధ్య నాయకుడిగా కీర్తి పొందిన ప్రభాకరన్ 1954 నవంబర్ 26న శ్రీలంకలోని ఉత్తర తీర ప్రాంత పట్టణం వల్వెత్తితురైలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. స్థానిక సింహళీయులు, లంక సైనికుల అరాచకాలను కళ్లారా చూసిన ప్రభాకరన్ తట్టుకోలేకపోయారు. బడి మానేసి విప్లవోద్యమం వైపు అడుగులేశారు. ఎల్టీటీఈ... ‘త్రివిధ’ ఉగ్ర సంస్థ! ప్రభాకరన్ తొలుత తమిళుల ఆందోళన కార్యక్రమాలు, నిరసనల్లో పాల్గొన్నారు. నెమ్మదిగా తమిళ యువకులను చేరదీసి 1972లో ‘తమిళ్ న్యూ టైగర్స్’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశారు. 1975లో దాని పేరును లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ)గా మార్చారు. అప్పటినుంచి మూడు దశాబ్దాల పాటు ఎల్టీటీఈ పేరు ప్రపంచమంతటా మారుమోగింది. టైగర్స్, సీ టైగర్స్ (నావికాదళం), ఎయిర్ టైగర్స్ (వైమానిక దళం) పేరిట త్రివిధ దళాలున్న ఏకైక ఉగ్రవాద సంస్థగా ఎల్టీటీఈ చరిత్ర సృష్టించింది! అంతేగాక ఎల్టీటీఈలో ఆత్మాహుతి దళాలను, ‘సైనేడ్ మరణాల’ను ప్రవేశపెట్టి ప్రభాకరన్ సంచలనం సృష్టించారు. తమిళులకు ప్రత్యేక దేశం కోసం లంక సైన్యంతో ఎల్టీటీఈ దళాలు ఏళ్ల తరబడి హోరాహోరీ తలపడ్డాయి. ఈ యుద్ధంలో లక్ష మందికి పైగా బలయ్యారు. బాధితుల్లో సింహళ జాతీయులతో పాటు తమిళులు కూడా ఉన్నారు. తమిళులు ముద్దుగా ‘తంబి’ అని పిలుచుకొనే ప్రభాకరన్ ఆయుధాలతో పాటు కొన్నిసార్లు దౌత్య మార్గాన్ని కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. 1985లో భారత చొరవతో, 2002లో నార్వే మధ్యవర్తిగా శ్రీలంక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ఇంటర్‌పోల్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దర్యాప్తు సంస్థలు ప్రభాకరన్‌ను మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించాయి. రాజీవ్ హత్య ప్రముఖ నేతలను పాశవికంగా పొట్టన పెట్టుకున్న తీరు ఎల్టీటీఈ రక్తచరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయం. భారత ప్రధాని రాజీవ్‌గాంధీ శాంతి పరిరక్షణ పేరిట లంకకు భారత సైన్యాన్ని పంపడంతో ప్రభాకరన్ తీవ్రంగా మండిపడ్డారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూరులో మానవ బాంబు దాడితో ఆయనను బలి తీసుకున్నారు. అనంతరం 1993లో శ్రీలంక అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస కూడా ఎల్టీటీఈ ఆత్మాహుతి బాంబు దాడికి బలయ్యారు. అంతేగాక చంద్రికా కుమారతుంగ, మైత్రిపాల సిరిసేన సహా పలువురు లంక అధ్యక్షులను, ప్రధానులను హతమార్చేందుకు ఎల్టీటీఈ విఫలయత్నం చేసింది. ఇక దాని దాడుల్లో బలైన శ్రీలంక మంత్రులు, రాజకీయ నాయకులు, సైనిక ఉన్నతాధికారుల జాబితాకైతే అంతు లేదు! వెంటాడి, వేటాడి... దశాబ్దాలపాటు నెత్తుటేర్లు పారించిన ఎల్టీటీఈపై మహింద రాజపక్సె హయాంలో లంక సైన్యం ఉక్కుపాదం మోపింది. ముప్పేట దాడితో సంస్థను నిర్వీర్యం చేసింది. మిగిలిన కొద్దిమందీ చెల్లాచెదురయ్యారు. ప్రభాకరన్ కూడా మారుమూల ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది! ఆయన కోసం సైన్యం కనీవినీ ఎరగని రీతిలో వేటకు దిగింది. చివరికి 2009 మే 18న శ్రీలంకలోని ముల్లైతీవులో హోరాహోరీ పోరాటంలో ప్రభాకరన్‌ను మట్టుబెట్టినట్టు ప్రకటించింది. మృతదేహం ఫొటోలను కూడా విడుదల చేసింది. దాడిలో అతని కుమారుడు బాలచంద్రన్ కూడా చనిపోయినట్టు పేర్కొంది. కొడుకు, కూతురు సజీవమే? ప్రభాకరన్ వ్యక్తిగత జీవితం గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. 1984 అక్టోబర్ 1న చెన్నై సమీపంలోని తిరుపోరూర్‌లో మదివదనిని ఆయన పెళ్లి చేసుకున్నారు. వారికి కుమార్తె ద్వారక, కుమారులు చార్లెస్ ఆంథోనీ, బాలచంద్రన్ ఉన్నా రు. బాలచంద్రన్ లంక సైనికుల చేతిలో మరణించగా మిగతా వారి ఆచూకీ తెలియదు. వారు లంకలో లేరని, విదేశాల్లో తలదాచుకుంటున్నారని తమిళులు నమ్ముతుంటారు. ప్రభాకరన్ బతికే ఉన్నారు త్వరలోనే జనం ముందుకొస్తారు తమిళ జాతీయోద్యమ నేత నెడుమారన్ సాక్షి, చెన్నై/తంజావూర్: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈళం(ఎల్టీటీఈ) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారని తమిళ జాతీయోద్యమ నేత పాళ నెడుమారన్ సంచలన ప్రకటన చేశారు. ‘‘ప్రభాకరన్ గురించి కొందరు పథకం ప్రకారం రేకెత్తించిన అనుమానాలకు నేను తెరదించుతున్నా. భార్యా కూతురితో సహా ప్రభాకరన్ క్షేమంగా ఉన్నారు. ఆయన జనం ముందుకు రావడానికి ఇప్పుడు పూర్తి అనుకూల వాతావరణముంది’’ అని నెడుమారన్ సోమవారం తమిళనాడులో మీడియాకు వెల్లడించారు. ‘‘శ్రీలంకలో ఈళం తమిళుల పునఃప్రవేశంపై ప్రభాకరన్ త్వరలోనే ప్రకటన చేయబోతున్నారు. నేను చెప్పిందంతా వంద శాతం నిజమే’’ అని ఉద్ఘాటించారు. ప్రభాకరన్ ఇప్పుడెక్కడ ఉన్నదీ మాత్రం ఇప్పుడే చెప్పనన్నారు. శ్రీలంకతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రభాకరన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎల్టీటీఈ ఏనాడూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. ప్రభాకరన్ బతికుంటే అంతకన్నా సంతోషకరమైన వార్త మరొకటి ఉండదని డీఎండీకే అధినేత వైగో, పలు పార్టీల నేతలన్నారు. పెద్ద జోక్: శ్రీలంక కొలంబో: ప్రభాకరన్ బతికే ఉన్నాడనడాన్ని పెద్ద జోక్‌గా శ్రీలంక రక్షణ శాఖ అధికార ప్రతినిధి నళిన్ హెరాత్ అభివర్ణించారు. ‘‘ప్రభాకరన్ 2009 మే 18న హతమయ్యాడు. ఇది డీఎన్ఏ పరీక్షలోనూ నిర్ధారణ అయింది’’ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎవరీ టైగర్ ప్రభాకరన్.. హీరోనా? విలనా?
అణచివేత ఏ రూపంలో ఉన్నా.. ఏదోఒకనాటికి అగ్గిని రాజేయడం ఖాయం!. అలా లంక గడ్డపై అక్కడి సింహళీయుల చేతుల్లో దారుణంగా అవమానాలకు గురైన తమిళులకు ఆరాధ్య దైవంగా మారాడు వేలుపిళ్లై ప్రభాకరన్. యావత్ తమిళ సమాజం దృష్టిలో.. ప్రత్యేకించి తమిళ సాహిత్య-సంస్కృతికి గుండెకాయ లాంటి జాఫ్నా(శ్రీలంక) నేల తమిళులకు ఆయన మాత్రం తలైవర్(నాయకుడు). ఇంతకీ ప్రభాకరన్ నేపథ్యం ఏంటి? హీరోగా కొందరు.. విలన్‌గా మరికొందరు ఎందుకు ఆయన్ని ఎందుకు బేరీజు వేసుకుంటారు?. డీఎన్ఏ టెస్ట్‌లోనూ ఆయన మరణించారనే ధృవీకరణ ప్రకటన వెలువడినప్పటికీ.. ఇంకా సజీవంగా ఉన్నాడని, తిరిగి వస్తాడనే ఆశలు ఎందుకు పెట్టుకుంటున్నారు?.. వేలుపిళ్లై ప్రభాకరన్.. ఉత్తర తీర పట్టణం వాల్వెట్టితురైలో 26 నవంబర్ 1954 న జన్మించాడు. నలుగురు పిల్లలలో చిన్నోడు. తండ్రి ప్రభుత్వ అధికారి. సంపన్న కుటుంబం వాళ్లది. కానీ, లంక ప్రభుత్వాలు తమిళులపై చూపించే వివక్ష ఆయన్ని బడి చదువును పక్కన పెట్టించింది. పదిహేనేళ్ల వయసులో.. సత్యసీలన్ ఏర్పాటు చేసిన తమిళ మనవర్ పెరవై అనే గ్రూప్‌లో చేరాడు. ఆపై తమిళులకు స్వయంప్రతిపత్తిని పిలుపుతో ముందుకు సాగాడు. పెరవై నుంచి విడిపోయి.. తమిళ న్యూ టైగర్స్ పేరుతో భాగస్వామ్య కూటమిని ఏర్పాటు చేశాడు. అదే సమయంలో.. తమిళులకు సింహళీయులతో సమానంగా హక్కులను కల్పించాలని, తమిళులు అధికంగా ఉండే చోట్లను స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతాలుగా మార్చాలని ఒక వర్గం వారు కోరగా.. ఇంకో వర్గం ఏకంగా తమిళ ప్రాంతాన్నిటినీ కలిపి తమిళ్ ఈళం అనే ప్రత్యేక దేశాన్ని తమకు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టాలతో అగ్గి.. హక్కుల్లో అసమానతలు, జాతి వివక్ష, దేశ అంతర్యుద్ధంలో జరిగిన అకృత్యాలు, అఘాయిత్యాలు. శ్రీలంకలో తమిళులు కొందరు ఎన్నో శతాబ్దాలుగా ఉన్నా, అధిక శాతం వారు బ్రిటిషర్ల పాలనలో వలస కూలీలుగా తీసుకురాబడినవారే. వీరు ఎక్కువగా ఉండేది ఉత్తర, తూర్పు శ్రీలంకలో. శ్రీలంకకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 1970 వరకూ అందరికీ సమాన హక్కులు ఉండేవి. కానీ 1970లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వం రెండు కొత్త చట్టాలను అమలులోకి తెచ్చింది. అవి రెండూ శ్రీలంక తమిళులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకటి.. యూనివర్సిటీల్లో అడ్మిషన్లు ఆ యూనివర్సిటీ ఎక్కడైతే ఉంటుందో ఆ లొకాలిటీలో ఉండేవారికి 40% కేటాయించాలి. శ్రీలంకలో సింహళీయులు ఎక్కువగా ఉంటారు కాబట్టి సీట్లన్నీ వారికే వెళ్ళేవి. దీని వల్ల తమిళులకు సీట్లు రావాలంటే సింహళ విద్యార్థి కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే తప్ప సీట్ దొరికే అవకాశం లేదు. రెండు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా సింహళం వచ్చినవారికి మాత్రమే ఉద్యోగం. అంతే కాకుండా సింహళాన్ని జాతీయ భాషగా ప్రకటించి తమిళానికి కనీసం అధికారిక భాషగా కూడా గుర్తింపు ఇవ్వలేదు.అంతే కాకుండా సామాజికంగా కూడా తమిళులను నిమ్నభావంతో చూడటం కూడా మొదలైంది. ఇవన్నీ శ్రీలంక తమిళుల స్వాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఉండటం వల్ల శ్రీలంక ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. హత్యతో మొదలై.. ప్రభాకరన్ ఉడుకు రక్తం.. అప్పటి లంక రాజకీయాలు ఆయన్ని తీవ్ర నిర్ణయాలపై అడుగులు వేయించింది. ఆ సమయంలోనే 1975లో తమిళ ఉద్యమంలో పాల్గొని.. ఆపై జాఫ్నా మేయర్ దురైప్పాను హత్య చేయడం ద్వారా సంచలనానికి తెర తీశాడు ప్రభాకరన్. ఆ దెబ్బకి ప్రభాకరన్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. తమిళులు హీరోగా అభివర్ణించసాగారు. ఆపై మే 5, 1976లో తమిళ న్యూ టైగర్స్ టీఎన్టీని.. ఎల్టీటీఈగా మార్చేశాడు. సింపుల్‌గా దీన్నే తమిళ టైగర్స్ అని కూడా పిలుస్తారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈళం వర్గానికి నాయకుడు వేలుపిళ్ళై ప్రభాకరన్. దీనిని 32 దేశాలు తీవ్రవాద సంస్థగా ముద్ర వేశాయి. అనధికారికంగా ఉత్తర, తూర్పు లంకలో తమ సొంత ప్రభుత్వాన్నే నడిపేది. వీరు సొంత పోలీస్ స్టేషన్, కోర్టు, హాస్పిటల్, రేడియో, టీ.వీ చానెల్, దినపత్రిక, ఎయిర్ ఫోర్స్, నేవీ వంటివి కూడా నడిపేవారు. వన్యప్రాణులను పెంచుకునేవాడు ప్రభాకరన్. వీటన్నింటికీ నిధులు కెనడా, సింగపూర్ లో స్థిరపడ్డ తమిళులు, భారతీయ తమిళులు కూడా పంపేవారు. ప్రభాకరన్ తమిళులు నివసించే ప్రాంతాలన్నీ తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. తమకు కావలసిన ఆయుధాలను, డబ్బును విదేశాలనుండి సమకూర్చుకున్నారు. మారణహోమానికి ఆద్యుడా? నరనరాన నిండిన తమిళ జాతీయ వాదం.. విప్లవ స్ఫూర్తిని రాజేసి ఏకంగా లంక సైన్యంతో అంతర్యుద్ధం వైపుగా ఆయన్ని అడుగులు వేయించింది. ఇక శ్రీలంక సైన్యం జరిపిన మెరుపు దాడి.. ఏకంగా దేశంలో హింసకే దారి తీసింది. శాంతి చర్చలు జరిపినప్పటికీ.. అవి విఫలం కావడం, అప్పటికే ఎల్టీటీఈపై ఆగ్రహంతో ఊగిపోతున్న లంక సైన్యం ఎదురు దాడికి దిగడంతో ఘోర కలి జరిగింది. మూడేళ్ల పాటు అలాగే కొనసాగింది.. ఎంతోమంది శ్రీలంక సైనికులు, ఎల్టీటీఈ సైన్యం చనిపోసాగారు, గొడవలు జరిగే చోట లంక ప్రభుత్వం నీరు, భోజన సరఫరాను నిలిపివేసేది. దాని వల్ల ప్రజలు వలసలు పోయేవారు. ఈ వలసల వల్ల చాలా కుటుంబాలు తమ సొంత ఇళ్ళనీ, ఆస్తులనీ కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబంలో చనిపోకుండా మిగిలిన వారు పగతీర్చుకోడానికని ఎల్టీటీఈలో చేరేవారు. వలస వెళ్ళే వాళ్ళను ఎల్టీటీఈ ఆపేసే యత్నం చేసేది. శ్రీలంక సైనికులకు ఎవరు ప్రజలో ఎవరు తమిళ టైగర్స్ గుర్తించలేక ఆ స్థలాల్లో కనబడిన వారినందరినీ చంపేసే వారు. కొన్ని చోట్ల ఎల్టీటీఈ వాళ్ళు ఆత్మాహుతి దాడులు చేసేవారు. అలా.. పరీక్షల్లో తేలినా.. ముల్లైటివులోని వెల్లముల్లివాయికల్లో 2009 మే 18వ తేదీన లంక సైన్యం ఘోరంగా విరుచుకుపడింది. వంద మంది ఎల్టీటీఈ సైన్యం మృతి చెందింది. అందులో ప్రధాన నేతలు కూడా ఉన్నారని, ప్రభాకరన్ కూడా ఉన్నాడని లంక సైన్యం ప్రకటించింది. శ్రీలంక రక్షణ దళాల నుండి తప్పించుకోబోయి హతుడయ్యాడని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఆ మరుసటి రోజు స్వర్ణవహిని చానెల్లో డెడ్‌బాడీని చూపించారు. డీఎన్ఏ పరీక్షలో ప్రభాకరన్ మరణం ధృవీకరణ కూడా అయ్యింది!. కానీ, ఆయనతో అనుబంధం ఉన్నవాళ్లు ఆయన మరణించలేదని చెబుతుంటారు. ఇంకొందరు ఆయన్ని ఘోరంగా చంపారని, ఉరి తీశారని, సహజంగా మరణించారని.. ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తారు. కొన్నాళ్లకు ఎల్టీటీఈ కొత్త చీఫ్ సెల్వరస పధ్మనాథన్ ప్రభాకరన్ మరణాన్ని ధృవీకరించాడు. రెండు వారాల తరువాత డీఎన్ఏ పరీక్షలో ప్రభాకరన్, అతని కుమారుడు చార్లెస్ అంటోనీలు చనిపోయినట్లు ధ్రువీకరించారు. అలా సాయుధ పోరాటం ఆగిపోయింది. శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసింది. దీని వల్ల దాదాపు లక్ష మంది చనిపోయారు వారిలో ఆ దేశ ప్రజలు, భారత సైనికులు, LTTE వర్గం వారు, లంక సైనికులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో లంక ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న మనదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా LTTE ఆత్మాహుతి దాడిలో మరణించారు. ప్రభాకరన్ కుటుంబం తుడిచిపెట్టుకుపోయిందనేది లంక ఆర్మీ విశ్వాసం. ఆయన తల్లిదండ్రులు తిరువెంకటం, పార్వతిలను సైన్యం అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి చనిపోయే వరకు సైన్యం అదుపులోనే ఉన్నారు. చె గువేరా ఆఫ్ లంక 80వ దశకం ప్రారంభం నాటికి.. పోలీస్ దళాలపై ఎల్టీటీఈ దాడులు పెరిగిపోయాయి. ఆపై సైన్యంపై పెట్రోలింగ్ దాడి.. ఈలం యుద్ధానికి దారి తీసింది. మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లోకి చేరిపోయాడు ప్రభాకరన్. శత్రువు చేత సజీవంగా పట్టుబడకుండా గౌరవంగా చనిపోవటానికి నేను ఇష్టపడతాను లాంటి కొన్ని ఆయన మాటలు.. తమిళులను తీవ్రంగా ప్రభావితం చేసేవి. ఆ సమయంలో చే గువేరాతో ప్రభాకరన్‌ను పోల్చింది ఓ ప్రముఖ పత్రిక. ఆపై రాజీవ్ గాంధీ హత్యకు. ఎల్టీటీఐకు సంబంధం ఉందనే వాదన తెరపైకి వచ్చింది. కానీ, ప్రభాకరన్ మాత్రం అది అంతర్జాతీయ కుట్ర అనేవారు. మరణాంతరం ఆ అభియోగాలకు మన దగ్గరి టాడా కోర్టు ఎత్తేసింది. ఘోరాలే.. ఇదిలా ఉంటే, యుద్ధంలో శ్రీలంక సైనికుల చేతిలో చిక్కిన LTTE వారిని, వాళ్ల కుటుంబ సభ్యులను చాలా ఘోరాతి ఘోరంగా హింసించి చంపిన ఉదంతాలను కొన్ని మీడియా సంస్థలు, ఫొటోగ్రాఫర్లు బయటపట్టారు. వారి బట్టలు ఊడదీసి అవమానించి, కళ్ళకు గంతలు కట్టి సుత్తులతో నెత్తిన కొట్టి, ఆడవారిని మానభంగం చేసి అతిక్రూరంగా కాల్చి చంపేవారు. ఇదంతా ఎవరో తీసిన వీడియో టేపు లీక్ అయిన తర్వాత బయటపడ్డ విషయాలు. దీని మీద ప్రపంచ మానవహక్కుల పరిరక్షణ సమితిలో కేసు నమోదు చేయగా, ఇప్పటికీ శ్రీలంక ప్రభుత్వం ఆ వీడియోలో ఉన్న వ్యక్తులను గుర్తించటానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారే తప్ప ఏ చర్య తీసుకోలేదు. ప్రభాకరన్ 12 ఏళ్ల కుమారుడు బాలచంద్రన్‌ను శ్రీలంక సైన్యం పట్టుకుని అత్యంత దారుణంగా హింసించి చంపిన తీరుకు అద్దం పట్టే ఫోటోలు బయటకు వచ్చాయి. జయలలిత సైతం ఆ ఘోర కలిని ఖండించారు అప్పట్లో. కానీ, లంక ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. భారత్ ప్రమేయం ఎంతవరకంటే.. లంక తమిళ వేర్పాటువాద ఉగ్ర సంస్థలు వర్సెస్ ప్రభుత్వం మధ్య అంతర్యుద్ధం. ఎంతో మంది అమాయక ప్రజలు చనిపోతున్నారు, ఇంత జరుగుతుంటే పక్కనే ఉన్న మనదేశం ఊరుకోదుగదా! అప్పట్లో భారత ప్రధానమంత్రైన రాజీవ్ గాంధీ మొదట్లో ఎల్టీటీఈ కి మద్దతుగా ఉన్నట్లు కథనాలు వచ్చాయి. అయితే.. 1987లో శ్రీలంక సైనికు దళం ప్రభాకరన్ దళం ఉన్న దాదాపు అన్ని ప్రాంతాలను తమ అదుపులోకి తెచ్చుకుంది. ఇక లొంగిపోవడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. అంతలో భారత ప్రభుత్వం ఆహారాన్ని, కొన్ని ఆయుధాలను హెలికాప్టర్ల ద్వారా తమిళ టైగర్లకు అందించిందట. ఈ విషయం లంక ప్రభుత్వానికి తెలిసి, భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అదేంటంటే తమిళ తీవ్రవాదుల ఆయుధాలన్నీ తమకు అప్పగించాలని, తమిళులకు ప్రత్యేక దేశం ఇవ్వడం తప్ప మిగిలిన షరతులను అంగీకరిస్తామని చెప్పింది. ఆ ఒప్పందం మీద Indian peace keeping force అనే పేరు మీద ఒక సైనిక బలగాన్ని లంకకు పంపింది ఇండియా. అప్పటి వరకు తమకు అనుకూలంగా ఉన్న ఇండియా ఒకే సారి వ్యతిరేకం అవ్వడం ప్రభాకరన్ సైన్యానికి పెద్ద అడ్డంకిగా అయ్యింది. ఈ ఒప్పందం తమిళ ప్రజలకు అనుకూలంగా లేదని, ఒక్కసారి ఆయుధాలను అప్పగిస్తే భారత సైన్యం తిరిగి వెళ్ళాక ఎల్టీటీఈనే కాదు.. తమిళ జాతి మొత్తాన్ని లంక సైన్యం అంతం చేసేస్తుందని భావించి ప్రభాకరన్ ఈ ఒప్పందాన్ని సమ్మతించలేదు. ఇక చేసేదేమీ లేక భారత సైన్యం కూడా ప్రభాకరన్ ను పట్టుకునే పనిలో పడింది. దాంతో భారతీయ సైనికులు కూడా చాలా మంది దాడుల్లో మరణించిసాగారు. భారత్.. ప్రమేయం శ్రీలంక వాసులకి నచ్చలేదు. పొరుగు దేశం వచ్చి తమ దేశ విషయాల్లో తలదూర్చడమేంటని లంక ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, అప్పుడు లంక మన సైన్యాన్ని తిరిగి వెళ్ళిపోయింది కోరింది. ఈలోపు భారత్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి సైన్యాన్ని వెనక్కి రప్పించుకుంది. సోర్స్: వివిధ రకాల సైట్లు.. పాత అంతర్జాతీయ కథనాల ఆధారంగా.. క్రూరుడు.. మూర్ఖుడు.. మొండివాడు ప్రభాకరన్ శ్రీలంక తమిళ ప్రజల దృష్టిలో అమరవీరుడు. కానీ, విమర్శకులు ఆయన్ని అత్యంత క్రూరుడిగా, మూర్ఖుడిగా, అధునాతన తిరుగుబాటులల్లో ఆద్యుడిగా పేర్కొంటారు. రాజకీయ ఉగ్రవాద గ్రూపులను ప్రభావితం చేయటానికి అనేక వ్యూహాలతో ముందుకొచ్చిన ఉగ్రవాది అంటారు. 1976 లో స్థాపించబడిన ఎల్టీటీఈ 1983 లో జాఫ్నా వెలుపల శ్రీలంక సైన్యం పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో మెరుపుదాడికి దిగింది. ఫలితంగా 13 మంది సైనికులు మరణించగా.. ఆపై చెలరేగిన హింసతో పాటు వేలాది మంది తమిళ పౌరులు మరణించారు. ఇది ప్రభాకరన్ ఏకపక్ష నిర్ణయమనేది కొంది వాదన. అయితే.. తన మార్గాన్ని ఆయన ఎప్పుడూ సమర్థించుకునేవాడు. అహింసా మార్గాలు పనికిరానివి వాడుకలో లేవని గమనించిన తరువాత మాత్రమే తాను విప్లవ మార్గాలను ఎంచుకున్నానని ప్రభాకరన్ వాదించాడు. ముఖ్యంగా 1987 లో తమిళ ఈలం విప్లవకారుడు తిలీపాన్ ఆమరణ నిరాహార దీక్ష.. ఫలితం లేకుండా ముగియడం ఆయన్ని ప్రభావితం చేసిందట. లక్ష్యం లేని ఆ మార్గాన్ని పక్కన పెట్టాడని చెప్తాడాయన. అన్నింటికి మించి.. ‘‘చిన్నతనంలో అలెగ్జాండర్, నెపోలియన్ వంటి యుధ్ధ వీరుల గురించి తెలిసింది పుస్తకాల ద్వారానే. భారత జాతీయోద్యమం తోనూ, సుభాస్ చంద్రబోస్, భగత్ సింగ్, బాలగంగాధర తిలక్ వంటి నాయకులతోనూ గాఢమైన మానసిక సాన్నిహిత్యాన్ని ఏర్పరచినవీ పుస్తకాలే. నేను విప్లవకారుడిగా మారటానికి పునాది వేసినవి ఆ పుస్తకాలే. భారత జాతీయోద్యమం నా అంతరాంతరాలను కదిలించి విదేశీ దోపిడీ మీదా, పెత్తనం మీదా తీవ్రమైన ఆగ్రహాన్ని రగిలించింది. 1958 లో శ్రీలంకలో చెలరేగిన జాతుల ఘర్షణలు, వాటి ఫలితంగా తమిళులు అనుభవించిన వేదనా నన్ను సాయుధ పోరాటం వైపుకు నడిపాయి. దినపత్రికల్లో వార్తలను చూస్తుంటే ఆగ్రహావేశాలు నా హృదయాన్ని తుపాను వలె చుట్టు ముట్టేవి. తమిళ రచయితలు కాశియన్ (పామినిప్ పావై), శాండిల్యన్ (కాదత్ పురా), కల్కి (పొన్నియన్ సెల్వన్) ల రచనలు చదివాక మన పూర్వీకులు ఎంత స్వతంత్రంతో, స్వయం నిర్ణయాధికారం తో పాలన సాగించారో అర్ధమైంది. మన జాతి ప్రజలు ఈ బానిసత్వం నుంచి విముక్తులై తమ స్వతంత్ర దేశంలో ఆత్మ గౌరవంతో, స్వేఛ్చతో జీవించే రోజులు మళ్ళీ రావాలన్న గాఢమైన కాంక్షను నాలో కలిగించాయి ఈ పుస్తకాలు. “ఫలితాన్ని గురించి ఆలోచించక నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు” అనే భగవద్గీతా ప్రబోధం కూడా నన్ను చాలా ఆకర్షించింది. క్రమశిక్షణ కలిగిన ఉత్తమ జీవితాన్ని గడపాలని, నా జాతి ప్రయోజనాలకు కట్టుబడి పనిచేయాలని బాల్యం లోనే నిశ్చయించుకునేందుకు తోడ్పడినవి నేను చదివిన సందేశాత్మక గ్రంథాలే. సుభాస్ చంద్రబోస్ జీవితం నాకు దారి చూపిన వేగుచుక్క. క్రమశిక్షణా యుతమైన ఆయన జీవితమూ, దేశ స్వాతంత్ర్యం కొరకు ఆయన నిబద్ధత నన్ను తీవ్రంగా ప్రభావితం చేసి, మార్గ నిర్దేశం చేశాయి. నేను చదివిన పుస్తకాలే నన్ను ప్రజా విముక్తి పోరాటం లోకి నడిపించాయని చెబుతాను. జాఫ్నాకు చెందిన తమిళ సాహిత్య పత్రిక “వెలిచ్చమ్” కోసం 1994 లో ప్రభాకరన్ ఇచ్చిన ఇంటర్వ్యూ.. దానికి కాత్యాయని చేసిన అనువాదం -
ఆ పులికి స్పెషల్ క్లాసులు ఎందుకో తెలుసా?
అది తమిళ పులి.. పేరు రామ. ఉండేది చెన్నై వండలూరు జూపార్క్. కానీ దానిని ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్ జూపార్కుకు తరలించారు. కానీ, పుట్టకతో తమిళం మాత్రమే తెలిసిన ఈ పులికి ఒక్కసారిగా ఉత్తరాదికి వెళ్లడంతో కొత్తగా భాషతో చిక్కొచ్చిపడింది. స్థానిక హిందీ అర్థం కాక .. ఆ హిందీలో ఆదేశాలిస్తే గ్రాండించి గుర్రున చూస్తున్న ఆ పులి తాజాగా స్పెషల్ క్లాసులు పెట్టి మరీ హిందీని నేర్పిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లోని సజ్జన్ఘర్ జూపార్కులో 'ధామిని' అనే ఆడ తెల్లపులి ఉంది. అది ఈ మధ్య ఈడుకొచ్చింది. దానికి సరైన మగ జోడీ కోసం దేశంలోని అన్ని జూపార్కులను అన్వేషించిన అధికారులు.. చివరకు చెన్నై వండలూరు జూపార్కులో ఉన్న 'రామ' అనే మగపులిని గుర్తించారు. జంతుమార్పిడి విధానం కింద ఉదయ్‌పూర్ జూ అధికారులు తెల్ల మగపులిని స్వీకరించి ఇందుకు బదులుగా రెండు నక్కలను వండలూరు జూపార్కుకు అందించారు. అయితే, 2011లో వండలూరు జూలో జన్మించిన 'రామ' పులి తమిళం మాత్రమే అర్థం చేసుకుంటుంది. ‘ఇంగెవా...అంగెపో’ (ఇక్కడికి రా...అక్కడికి పో) అనే తమిళ మాటలే దానికి తెలుసు. అలాంటి 'పులిరాజ'కు ఒక్కసారిగా ‘యహా ఆవో... వహా జావో’ అంటూ హిందీలో ఆదేశాలు ఇస్తే ఎలా ఉంటుంది. ఒళ్లు మండుకొస్తుంది. అందుకే సజ్జన్గార్ జూపార్కు సిబ్బంది హిందీలోనూ, స్థానిక భాషలోనూ ఆదేశాలిస్తే వారిని 'రామ' గుర్రున చూస్తోంది. వారి గుండెలదిరేలా గాండ్రిస్తోంది. ఇక దీంతో వేగలేమని భావించిన జూపార్కు సిబ్బంది.. చెన్నై వండలూరు జూపార్కు అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో వండలూరు జూపార్క్‌కు చెందిన శిక్షకుడు సెల్లయ్య ప్రత్యేకంగా ఉదయ్‌పూర్‌కు పంపించారు. ఇది చిన్నపిల్లగా ఉన్ననాటి నుంచి దాని పెంపకం బాధ్యతను సెల్లయ్యనే చూశారు. ‘వా’ (ఇటురా), ‘పో’ (అటు వెళ్లు) వంటి తమిళ మాటలకు అది అలవాటుపడేలా చేశారు. ప్రస్తుతం ఉదయపూర్‌లో ఉన్న సెల్లయ్య అక్కడి సిబ్బంది సహకారంతో రామకు ‘ఆవో.. జావో’ వంటి మాటల్ని నేర్పించే పనిలో నిమగ్నమయ్యారు. మొదట తమిళంలో ఆదేశాలిస్తూనే.. ఆ తర్వాత హిందీ ఆదేశాలను దానికి ఒంటబట్టిస్తున్నారు. -
'రామ'కు హిందీలో చెప్తే.. అంతే సంగతులు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: హిందీ ఉత్తరాది భాష. దక్షిణాదిలో ఉన్న చాలామందికి హిందీ రాదు. ఎవరైనా హిందీలో అదే పనిగా మాట్లాడితే.. రానివారికి చిరాకు వేస్తోంది. మరీ తమిళ భాషకు అలవాటు పడిన ఓ పులికి అదే పనిగా హిందీలో ఆదేశాలిస్తే అది ఊరుకుంటుందా?.. ఇంతకు ఆ కథ ఏమిటంటే.. రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లోని సజ్జన్ఘర్ జూపార్కులో 'ధామిని' అనే ఆడ తెల్లపులి ఉంది. అది ఈ మధ్య ఈడుకొచ్చింది. దానికి సరైన మగ జోడీ కోసం దేశంలోని అన్ని జూపార్కులను అన్వేషించిన అధికారులు.. చివరకు చెన్నై వండలూరు జూపార్కులో ఉన్న 'రామ' అనే మగపులిని గుర్తించారు. జంతుమార్పిడి విధానం కింద ఉదయ్‌పూర్ జూ అధికారులు తెల్ల మగపులిని స్వీకరించి ఇందుకు బదులుగా రెండు నక్కలను వండలూరు జూపార్కుకు అందించారు. ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు ఇటీవలే ముగిశాయి. 2011లో వండలూరు జూలో జన్మించిన 'రామ' పులి తమిళం మాత్రమే అర్థం చేసుకుంటుంది. ‘ఇంగెవా...అంగెపో’ (ఇక్కడికి రా...అక్కడికి పో) అనే తమిళ మాటలే దానికి తెలుసు. అలాంటి 'పులిరాజ'కు ఒక్కసారిగా ‘యహా ఆవో... వహా జావో’ అంటూ హిందీలో ఆదేశాలు ఇస్తే ఎలా ఉంటుంది. ఒళ్లు మండుకొస్తుంది. అందుకే సజ్జన్గార్ జూపార్కు సిబ్బంది హిందీలోనూ, స్థానిక భాషలోనూ ఆదేశాలిస్తే వారిని 'రామ' గుర్రున చూస్తోంది. వారి గుండెలదిరేలా గాండ్రిస్తోంది. తమిళ తెల్లపులితో వేగడం ఇక తమవల్ల కాదని, తమిళం తెలిసిన సిబ్బందిని తమకు కేటాయించామని జూపార్కు సూపరింటెండెంట్ మోహన్‌రాజ్ ఇటీవల చెన్నై వండలూరు జూపార్కు అధికారులకు ఉత్తరం రాశారు.