breaking news
Swine flu control
-
'స్వైన్' విహారం
సాక్షి, నెట్వర్క్/అమరావతి: రాష్ట్రాన్ని స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట కేసులు నమోదవుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. పట్టణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పటివరకు అన్ని జిల్లాల్లో కలిపి 300 కేసులకు పైగా నమోదైనప్పటికీ సర్కారు మాత్రం ఆ సంఖ్యను తక్కువచేసి చూపిస్తోంది. రాష్ట్రంలోని చిత్తూరు, కర్నూలు, గుంటూరు, విశాఖ, విజయ నగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడంతో సాధారణ జ్వరాలు, జలుబు లక్షణాలున్నా బాధితులు భయంతో ఆస్పత్రులకు పరిగెడుతున్నారు. చిన్నారులు, పసికందులకు సైతం ఇది సోకుతుండడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. మరోవైపు.. వ్యాధి ప్రబలుతుండడంతో వైద్యులు, నర్సులు ఇతర సిబ్బంది తమకు ఎక్కడ సోకుతుందోనని భయాందోళన చెందుతున్నారు. పలుచోట్ల వైద్య సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో వైద్యుల సూచనల మేరకు బాధితులు హైదరాబాద్, బెంగళూరు, వెల్లూరులోని కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో వైరస్ ఎక్కువగా ఉండడంవల్ల ఇక్కడ ఆ ప్రభావం తీవ్రంగా ఉంటోందని.. అలాగే, చలితీవ్రత కూడా వ్యాధి ప్రబలడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. భారీగా కేసులు నమోదు స్వైన్‌ఫ్లూ లక్షణాలున్న కేసుల సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువయ్యింది. వీటిలో చాలా నిర్ధారితమవుతున్నాయి. ఉదాహరణకు.. చిత్తూరు జిల్లాలో 77మంది, విశాఖలో ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 64మంది, కర్నూలులో 49మంది, గుంటూరులో 35మంది, నెల్లూరులో 18మంది, విజయనగరంలో 13మంది, అనంతపురంలో 15మంది, శ్రీకాకుళంలో 11మంది వైఎస్సార్ జిల్లాలో 10మంది, ప్రకాశంలో నలుగురు, తూర్పుగోదావరి, కృష్ణాలో ముగ్గురేసి చొప్పున స్వైన్‌ఫ్లూ బారినపడ్డారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇంతకన్నా ఎక్కువ సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. కానీ, ఇక్కడ వైద్యం చాలా ఖరీదుతో కూడుకున్నదని, సామాన్యులకు అందుబాటులో ఉండడంలేదని బాధితులు వాపోతున్నారు. చికిత్స కోసం అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లాలో 3నెలలు, 11నెలలున్న ఇద్దరు మగ శిశువులకూ ఈ వ్యాధి సోకింది. పర్యాటక ప్రాంతాలైన విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో జనం తాకిడివల్ల ఎక్కువ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. సౌకర్యాలూ అంతంతమాత్రం స్వైన్‌ఫ్లూ బాధితులు పెద్ద సంఖ్యలో వస్తున్నా చాలాచోట్ల ఏర్పాట్లు మొక్కుబడిగా ఉంటున్నాయి. అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ), క్యాజువాలిటీ (ఎమర్జెన్సీ)లోని వైద్యులకు వ్యాక్సిన్, ఎన్95 మాస్కులు పలుచోట్ల అందుబాటులో లేవు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేస్తున్నప్పటికీ దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు అంతంతమాత్రంగా ఉంటున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వ్యాధి నిర్ధారణకు ఎటువంటి కేంద్రాలు లేకపోవడంతో బాధితులు విశాఖలోని కేజీహెచ్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. విజయనగరంలోని స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించకుండా నేరుగా విశాఖకు వెళ్తుండడం అక్కడి పరిస్థితికి అద్దంపడుతోంది. అలాగే, అనంతపురం జిల్లా కేంద్రంలోనే పరీక్షలు చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఆర్టీపీసీఆర్ పరికరాల్లేవు. అనుమానిత కేసులకు త్రోట్ స్వాప్ తీసేందుకు వైరల్ కిట్ అందుబాటులో లేదు. ఇక్కడ ముందస్తు చర్యలూ తీసుకోలేదు. తూతూమంత్రంగా కరపత్రాలు పంచి చేతులు దులుపుకున్నారు. వ్యాక్సిన్లు, మాస్క్‌లు లేక వైద్యులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చిన్నపిల్లల వార్డులో వెంటిలేటర్ ఏర్పాటుచేయలేదు. చిత్తూరు జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో బాధితులకు కనీసం మాస్క్‌లు ఇచ్చే పరిస్థితిలేదు. ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో రోగులు బెంగళూరు, చెన్నై, వేలూరులోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. మరణాలూ ఎక్కువే.. స్వైన్ ఫ్లూతో మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. వ్యాధిని సకాలంలో గుర్తించకపోవడం ఒక కారణమైతే.. సరైన వైద్యం అందక మృత్యువాత పడడం మరో కారణం. అంతేకాదు, మధుమేహం, గుండెజబ్బు, కిడ్నీ, నరాల సంబంధ వ్యాధుల వారు స్వైన్‌ఫ్లూతో రోగనిరోధక శక్తి కోల్పోయి మరణిస్తున్నారు. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు కర్నూలులో అత్యధికంగా 17మంది, ఆ తర్వాత స్థానంలో గుంటూరు 10మంది, చిత్తూరు జిల్లాలో 8మంది, విజయనగరంలో ఐదుగురు, విశాఖలో నలుగురు, ప్రకాశం, నెల్లూరులలో ముగ్గురేసి, తూర్పు గోదావరి, శ్రీకాకుళంలో ఇద్దరేసి, కృష్ణా, వైఎస్సార్ జిల్లాల్లో ఒకరేసి చొప్పున మృత్యువాతపడ్డారు. కాగా, నెల్లూరు జిల్లాలో మృతిచెందిన ముగ్గురికీ స్వైన్‌ఫ్లూ ఉన్నా వారు వేరే కారణాలతో మృతిచెందినట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత లక్షణాలు – విపరీతంగా ఆయాసం వస్తుంది – రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గడంవల్ల ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది – నాలుక, గోళ్లు నీలిరంగులోకి మారతాయి – ముక్కులోంచి నీళ్లు కారడం.. దగ్గు ఎక్కువగా వస్తుంది – కళ్లు బాగా ఎర్రబడతాయి ఎవరెవరికి ఎక్కువ ప్రమాదం.. – మూడేళ్ల లోపు చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు, గుండెజబ్బు, మధుమేహం, కిడ్నీ, నరాల సంబంధిత సమస్యలున్న వారికి ఈ వ్యాధి సోకితే ఎక్కువ ఇబ్బంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు – వ్యాధి లక్షణాలు సోకిన 48 గంటల్లోనే చికిత్స మొదలుపెట్టాలి – బాధితుల్ని ప్రత్యేక వార్డులో, ఇంట్లో అయితే ప్రత్యేక గదిలో ఉంచాలి – దగ్గు వచ్చినప్పుడు రెండు చేతులు అడ్డుపెట్టుకుని దగ్గాలి.. ఆ తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి – ముక్కు ప్రాంతాన్ని ఎక్కువగా చేతితో తాకకూడదు – బాధితులు నలుగురిలోకి వెళ్లడం మంచిది కాదు – వ్యాధి సోకిన వారు కనీసం వారం రోజులపాటు బయటకు వెళ్లకూడదు. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం ఇప్పటివరకూ రాష్ట్రం మొత్తం మీద 288 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. పదమూడు మంది బాధితులు మృతిచెందారు. నియంత్రణ కోసం చర్యలు తీసుకున్నాం. నిర్ధారణకుగానీ, చికిత్సకుగానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లుచేశాం. తగినన్ని వెంటిలేటర్లు ఏర్పాటుచేశాం. స్వైన్‌ఫ్లూ నియంత్రణకు కావాల్సిన అన్ని మందులూ అందుబాటులో ఉంచాం. త్వరలోనే వైరస్ అదుపులోకి వస్తుందని భావిస్తున్నాం. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంవల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. తెలంగాణ, తమిళనాడుల్లోనూ ఈ వైరస్ తీవ్రంగా ఉంది. – డా. అరుణకుమారి, ప్రజారోగ్య సంచాలకులు రూ.6 లక్షలకు పైగా ఖర్చు పెట్టాం నా భార్య ఆశాలత కర్నూలు సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో వార్డెన్‌గా పనిస్తోంది. ఆమెకు దగ్గు, ఆయాసం రావడంతో స్థానిక ప్రైవేటు వైద్యుని వద్దకు వెళ్తే వెంటనే హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. నిమ్స్‌కు వెళ్తే అక్కడ వెంటిలేటర్లు సరిపడా లేవని పంపించేశారు. దీంతో అక్కడే ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. ఆమె వైద్యం కోసం రూ.6 లక్షలకు పైగా ఖర్చు పెట్టాం. – మద్దిలేటి, స్వైన్‌ఫ్లూ మృతురాలు ఆశాలత భర్త, కర్నూలు -
స్వైన్‌ఫ్లూ నియంత్రణకు ఏర్పాట్లు
మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ నియంత్రణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా, టీజీఎంఎస్ఐడీసీ చైర్మన్ వేణుగోపాలరావు ఇతర అధికారులతో కలిసి బుధవారం గాంధీ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ, డిజాస్టర్, మెడికల్ తదితర వార్డులను మంత్రి సందర్శించారు. స్వైన్‌ఫ్లూ రోగులకు అందిస్తున్న సేవలు, ప్రాథమిక సదుపాయాలపై సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూ, డెంగీ వంటి జ్వరాలను అదుపు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతనెలలో 130 మంది స్వైన్‌ఫ్లూ అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలు జరపగా 13 మందికే పాజిటివ్ వచ్చిందని, ఈ నెలలో 221 మందిలో 35 మందికి పాజిటివ్ వచ్చిందని, మూడు మరణాలు సంభవించాయన్నారు. వారి మృతికి, స్వైన్‌ఫ్లూతో పాటు ఇతర వ్యాధులు కూడా కారణమన్నారు. స్వైన్‌ఫ్లూ ఒక్కటే వస్తే వందశాతం రికవరీ అవుతుందనీ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. నారాయణగూడ ఐపీఎంతోపాటు ఫీవర్ ఆస్పత్రిలో కూడా స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రోగులంటే ఇంత చులకనా... గాంధీ ఆస్పత్రిలో రోగులంటే వైద్యులు, సిబ్బంది చాలా చులకనగా చూస్తూ ఈసడించుకుంటున్నారని పలువురు రోగులు మంత్రి లక్ష్మారెడ్డి వద్ద మొరపెట్టుకున్నారు. కల్వకుర్తి పోల్కంపల్లికి చెందిన వి. దయాకర్ అనే రోగి తీరుపట్ల అక్కడి సిబ్బంది వ్యవహరించిన తీరును అతని బంధువులు మంత్రి దృష్టికి తెచ్చారు. అయితే అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మంత్రి ఆర్ఐసీయును సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.