breaking news
sweet chutney
-
రుచిని చాట్‌కుందాం!
టిఫిన్ అంటే ఎప్పుడూ తినే ఇడ్లీ, ఉప్మా, దోసె, పూరీలేనా? స్నాక్స్ అంటే ట్రెడిషనల్ కారప్పూస, బూందీ, పకోడీ, మిర్చి బజ్జీలేనా? వాటినే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామా.... భేల్‌పూరీ దహీపూరీ బఠాణీ చాట్ బఠాణీ చాట్లా చేసి వాటి రుచిని చాట్కుందామా... బఠాణీ చాట్ కావలసినవి తెల్ల బఠాణీ – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను + పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – ఒక టీ స్పూను + 2 టేబుల్ స్పూన్లు; ఉల్లి పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; టొమాటో పేస్ట్ – పావు కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను; చాట్ మసాలా – ఒక టీ స్పూను; నిమ్మ రసం– ఒక టీ స్పూను; కార్న్ ఫ్లేక్స్ – తగినన్ని తయారీ: ►బఠాణీలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి ►మరుసటి రోజు ఉదయం, కుకర్‌లో బఠాణీలు, పసుపు, ఉప్పు, తగినన్ని నీళ్లు, ఒక టీ స్పూను నూనె జత చేసి స్టౌ మీద ఉంచి సన్న మంట మీద ఉంచి మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►చల్లారాక సగం బఠాణీలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, ఉల్లి ముద్ద వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి పేస్ట్ జత చేసి వేయించాలి ►టొమాటో ముద్ద జత చేసి కొద్దిసేపు వేయించాక, బఠాణీ పేస్ట్, ఉడికించిన బఠాణీలు జత చేయాలి ►కొద్దిగా ఉప్పు జత చేయాలి ►మిరప కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా జత చేసి కలపాలి ►తగినన్ని నీళ్లు జత చేసి కొద్దిసేపు ఉడికించి దింపి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ►ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, టొమాటో తరుగులతో అలంకరించి, కొద్దిగా నిమ్మ రసం, కార్న్‌ఫ్లేక్స్‌తో అలంకరించి, అందించాలి. భేల్ పూరీ కావలసినవి స్వీట్ చట్నీ – రుచికి తగినంత; గ్రీన్ చట్నీ – రుచికి తగినంత; క్యారట్ తురుము – ఒక టేబుల్ స్పూను; కీర తురుము – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; టొమాటో తరుగు – పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; ఉడికించిన బంగాళ దుంప తురుము – ఒక టేబుల్ స్పూను; బూందీ – 2 టేబుల్ స్పూన్లు; సేవ్ – 2 టేబుల్ స్పూన్లు; అటుకులు – తగినన్ని చాట్ మసాలా – చిటికెడు; మిరప కారం – కొద్దిగా; మరమరాలు – పావు కేజీ తయారీ: ►ఒక పాత్రలో మరమరాలు వేసి, వాటికి మిగిలిన పదార్థాలన్నీ (స్వీట్ టామరిండ్ చట్నీ, గ్రీన్ చట్నీ కాకుండా) జత చేసి బాగా కలపాలి ►స్వీట్ టామరిండ్ చట్నీ, గ్రీన్ చట్నీ జత చేయాలి ►ప్లేటులోకి తీసుకుని, పైన స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీలను కొద్దికొద్దిగా వేసి, ఆ పైన కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు జత చేసి అందించాలి. సమోసా చాట్ కావలసినవి చెన్నా మసాలా – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; టొమాటో తరుగు – పావు కప్పు; బటర్ – ఒక టేబుల్ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; చాట్‌మసాలా – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; సమోసాలు – 2; పెద్ద సెనగలు (కాబూలీ చెన్నా) – ఒక కప్పు; నీళ్లు – తగినన్ని; పెరుగు – ఒక కప్పు; గ్రీన్ చట్నీ – కొద్దిగా; స్వీట్ చట్నీ – కొద్దిగా; కొత్తిమీర – ఒక కట్ట తయారీ: ►పెద్ద సెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి ►మరుసటి రోజు నీళ్లు ఒంపేసి, శుభ్రంగా కడిగి, కుకర్‌లో సెనగలకు తగినన్ని నీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►బాణలిలో బటర్ వేసి వేడి చేయాలి ►ఉడికించిన పెద్ద సెనగలు, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, ఉప్పు, మిరప కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి కొద్దిసేపు వేయించాలి ►తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ►సమోసాలను ముక్కలుగా చేసి, ఉడికించిన చాట్‌లో వేసి కలపాలి ►పెరుగు, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ వేసి, ఒకసారి కలిపి దింపేసి, కొద్దిగా కొత్తిమీరతో అలంకరించి, వేడి వేడి సమోసా చాట్ అందించాలి. దహీ పూరీ కావలసినవి ఉడికించిన బంగాళ దుంపలు – 3 (మీడియం సైజువి); ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; కొత్తిమీర తరుగు – కొద్దిగా; పెరుగు – ఒక కప్పు; గ్రీన్ చట్నీ – అర కప్పు; స్వీట్ చట్నీ – అర కప్పు; ఎండు మిర్చి + వెల్లుల్లి చట్నీ – అర కప్పు; పూరీలు (గోల్గప్పాలు) – 30; సన్న సేవ్ (నైలాన్ సేవ్) – తగినంత; మిరప కారం – తగినంత; చాట్ మసాలా – తగినంత; వేయించిన జీలకర్ర పొడి – తగినంత; నల్ల ఉప్పు లేదా రాళ్ల ఉప్పు – తగినంత తయారీ: ►ముందుగా చట్నీలు తయారు చేసి పక్కన ఉంచాలి ►బంగాళ దుంపలను ఉడికించి, చల్లారబెట్టి, మెత్తగా చిదమాలి ►ఒక ప్లేట్లో గోల్గప్పాలను ఉంచి, మధ్య భాగంలో చిన్నగా చిదమాలి ►బంగాళ దుంప ముద్దను స్టఫ్ చేయాలి ∙ఉల్లి తరుగు, టొమాటో తరుగును పైన ఉంచాలి ►కొద్దిగా చాట్ మసాలా, జీలకర్ర పొడి, మిరప కారం, ఉప్పు... ఒకదాని తరవాత ఒకటి కొద్దికొద్దిగా చల్లాలి ►గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీలు కొద్దికొద్దిగా వేయాలి ►పైన పెరుగు వేయాలి ►ఆ పైన మళ్లీ చాట్ మసాలా, జీలకర్ర పొడి, మిరపకారం, ఉప్పు చల్లాలి ►తగినంత సేవ్ వేసి, చివరగా కొత్తిమీరతో అలంకరించి అందించాలి. గ్రీన్ చట్నీ కావలసినవి కొత్తిమీర ఆకులు – 2 కప్పులు; పుదీనా ఆకులు – ఒక కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి – 4; వెల్లుల్లి రెబ్బలు – 2; అల్లం – చిన్న ముక్క; నిమ్మ రసం – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత తయారీ: ►కొత్తిమీర, పుదీనా ఆకులను శుభ్రంగా కడగాలి ►మిక్సీలో అన్ని పదార్థాలను వేసి మెత్తగా ముద్దలా చేయాలి ►గాలిచొరని జాడీలో నిల్వ ఉంచుకోవాలి ►ఫ్రిజ్‌లో ఉంచి, కావలసినప్పుడు ఉపయోగించుకోవచ్చు. స్వీట్ చట్నీ కావలసినవి ఖర్జూరాలు – 10 (గింజలు లేనివి); బెల్లం తురుము – అర కప్పు; చింతపండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్లు మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని తయారీ: ►ఒకపాత్రలో బెల్లం పొడి, పావు కప్పు వేడి నీళ్లు పోసి కలియబెట్టాలి ►చింతపండు గుజ్జు, ఖర్జూరాల గుజ్జు జత చేసి, స్టౌ మీద ఉంచి ఉడికించాలి ►ఉప్పు, జీలకర్ర పొడి, మిరపకారం జత చేసి కలియబెట్టి కొద్దిసేపు ఉడికించి దింపేయాలి ►గాలి చొరని సీసాలోకి తీసుకుని, నిల్వ చేసుకోవాలి. -
రుచికి చేవ... ఆవ!
ఆవ ఓ పెద్ద హైజాకరు... ఓ మహా దోపిడీదారు. ఏం... పచ్చట్లో నూనె పోయడం లేదా? కారం వేయడం లేదా? ఆ మాటకొస్తే అల్లం, వెల్లుల్లీ లాంటివి వాడటం లేదా? మిగతా వాటన్నింటినీ హైజాక్ చేసేస్తుంది ఆవ. అలా చేసేసి ‘మామిడికాయ’ పచ్చడికి ‘ఆవకాయ’ అంటూ తన పేరే పెట్టించేలా చేస్తుంది. ఆవకాయనాడే నామకరణోత్సవం చేయిస్తుంది. ఏమిటీ దౌర్జన్యం? ఎందుకీ పేరు దోపిడీ? ఎందుకంటే... ‘ఆవ’ రుచికి చేవనిస్తుంది. మా‘మిడిమిడి’ రుచి సంపూర్ణమయ్యేలా సేవ చేస్తుంది. పచ్చడిని రుచుల తోవ నడిపిస్తుంది. అందుకే కొత్త ఆవకాయను చూడగానే జనమంతా ఆకలిని అర్జెంటుగా అద్దెకు తెచ్చుకుంటారు. కమ్మటి వాసన రాగానే కంచం ముందేసుకుంటారు. ఆవకాయ కనిపించగానే ‘ఆవ’క్కటే వేయమంటారు. అల్లం, మసాలా, నువ్వు, కొబ్బరి ఆవకాయల్ని ఇక్కడ మీ ముందుంచుతున్నాం. కొత్త ఆవకాయ పెట్టుకున్నాం కదా... అందుకే ఇవ్వాళ్టికి... ‘ఆవ’క్కటే వేసుకు తిందాం. ‘ఆవ’క్కటే చాలునందాం. మసాలా ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - కేజీ నువ్వుల నూనె - పావు కేజీ, కారం - పావు కేజీ అల్లం + వెల్లుల్లి ముద్ద - పావు కేజీ, పసుపు - టీ స్పూను, ఉప్పు - పావు కేజీ జీలకర్ర పొడి - 50 గ్రా., ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి - టేబుల్ స్పూను, మెంతి పొడి - టీ స్పూను, పసుపు - టేబుల్ స్పూను, జీలకర్ర + మెంతులు - టీ స్పూను ఇంగువ - టీ స్పూను, ఎండుమిర్చి - 10 తయారీ: మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి మామిడికాయ ముక్కలు జత చేయాలి మరో గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి బాగా వేగినతర్వాత దింపేయాలి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి చల్లారాక మామిడికాయ ముక్కలు, మసాలా పొడులు వేసి బాగా కలపాలి శుభ్రమైన జాడీలోకి తీసుకోవాలి ఈ ఆవకాయ మామూలు ఆవకాయ కంటె కాస్త ఘాటుగా ఉంటుంది. చట్నీ ఆవకాయ కావలసినవి: మామిడికాయ గుజ్జు - కేజీ, ఉప్పు - పావు కేజీ పసుపు - టేబుల్ స్పూను, కారం - 125 గ్రా. అల్లం వెల్లుల్లి ముద్ద - పావు కేజీ, నువ్వుల నూనె - పావు కేజీ జీలకర్ర పొడి - 2 టేబుల్ స్పూన్లు మెంతి పొడి - టేబుల్ స్పూను, ఇంగువ - టీ స్పూను ఆవాలు, జీలకర్ర, మెంతులు - ఒకటి న్నర టీ స్పూన్లు తయారీ: బాగా కండ ఉన్న మామిడికాయలు తీసుకుని కడిగి తుడిచి తగినంత నీళ్లు జతచేసి కుకర్‌లో ఉడికించాలి చల్లారిన తర్వాత పై చెక్కు తీసి చెంచాతో లోపలి గుజ్జుంతా తీసి పెట్టుకోవాలి ఈ గుజ్జు కొలతతోనే మిగతా దినుసులన్నీ కలుపుకోవాలి ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, పచ్చళ్ల కారం, జీలకర్ర పొడి, మెంతిపొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి మరో గిన్నెలో నువ్వులనూనె వేసి వేడి చేయాలి ఇందులో ఇంగువ వేసి కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఎర్రబడ్డాక దింపేయాలి నూనె చల్లారి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న పొడుల మిశ్రమం, మామిడిగుజ్జు వేసి బాగా కలియబెట్టాలి శుభ్రమైన జాడీలోకి తీసి పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత మళ్లీ కలపాలి ఈ ఆవకాయను అన్నంలోకే కాకుండా, చట్నీలా ఇడ్లీ, దోసె, ఉప్మాలకు కూడా వాడుకోవచ్చు. స్వీట్ పచ్చడి కావలసినవి: మామిడి తురుము - 3 కప్పులు (తీపిగా ఉండే తోతాపురి కాయలు ఎంచుకోవడం మంచిది); పంచదార - కప్పు; ఏలకుల పొడి - టీ స్పూను; జీడిపప్పు - 10 బాదంపప్పు - 10; నెయ్యి - టీ స్పూను; కిస్మిస్ - 20 తయారీ: జీడిపప్పు, బాదం పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు ముక్కలు, బాదంపప్పు ముక్కలు, కిస్మిస్ వేసి వేయించి పక్కన ఉంచాలి ఒక గిన్నెలో మామిడికాయ తురుము, పంచదార వేసి స్టౌ మీద ఉంచి నెమ్మదిగా ఉడికించాలి పూర్తిగా ఉడికిన తర్వాత వేయించి ఉంచుకున్న పప్పుల పలుకులు, ఏలకుల పొడి వేసి కలిపి దించేయాలి దీన్ని మరీ చిక్కగా కాకుండా, మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి దీన్ని జామ్లా బ్రెడ్, పూరీ, చపాతీలతో తినవచ్చు. అల్లం ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - కిలో ఉప్పు - 125 గ్రా., కారం - 125 గ్రా. నువ్వుల నూనె - పావు కిలో; అల్లం ముద్ద - 125 గ్రా. వెల్లుల్లి ముద్ద - 125 గ్రా.; పసుపు - టీ స్పూను జీలకర్ర పొడి - 50 గ్రా.; మెంతిపొడి - టీ స్పూను ఇంగువ - టీ స్పూను; ఆవాలు, జీలకర్ర, మెంతులు - టీ స్పూను తయారీ: మామిడికాయ ముక్కలను తుడిచి పెట్టుకోవాలి ఒక గిన్నెలో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మెంతిపొడి, పసుపు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి వేరే గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి ఆవాలు, జీలకర్ర, మెంతులు జత చేసి బాగా వేయించి దింపేయాలి నూనె చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దలు వేసి కలపాలి పూర్తిగా చల్లారాక, కలిపి ఉంచుకున్న మసాలా పొడులు వేసి కలపాలి మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి శుభ్రమైన జాడీలోకి తీసుకోవాలి మూడు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవాలి. కొబ్బరి ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - కిలో; ఉప్పు - పావు కిలో, పసుపు - టేబుల్ స్పూను; కారం - 125 గ్రా., ఎండుకొబ్బరి పొడి - పావు కిలో; ఆవ పొడి - 50 గ్రా., జీలకర్ర పొడి - 25 గ్రా.; మెంతి పొడి - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - పావు కిలో నువ్వుల నూనె - పావు కేజీ కంటె కొద్దిగా ఎక్కువ; ఇంగువ - టీ స్పూను, జీలకర్ర , మెంతులు - టీ స్పూను తయారీ: మామిడికాయ ముక్కలను తగినంత పరిమాణంలో కట్ చేసి లోపలి జీడి తీసేసి తుడిచి పెట్టుకోవాలి ఒక గిన్నెలో పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఎండుకొబ్బరి పొడి, ఆవ పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి వేరే గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి జీలకర్ర, మెంతులు వేసి వేగిన తర్వాత దింపేయాలి నూనె చల్లారాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి పూర్తిగా చల్లారిన తర్వాత మసాలా పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి మూడు నాలుగు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవాలి. నువ్వు ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - కిలో; నువ్వులు - పావు కిలో, ఉప్పు - పావు కిలో; నువ్వుల పొడి - అర కిలో; అల్లం వెల్లుల్లి ముద్ద - పావు కిలో; ఆవ పొడి - 50 గ్రా., పసుపు - టీ స్పూను; జీలకర్ర పొడి - 25 గ్రా., మెంతి పొడి - టేబుల్ స్పూను; ఇంగువ - చిటికెడు; ఆవాలు, జీలకర్ర - ఒకటిన్నర టీస్పూన్లు తయారీ: మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి నువ్వులను దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి ఒక గిన్నెలో నువ్వుల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతి పొడి, పసుపు, ఆవ పొడి వేసి బాగా కలపాలి వేరే గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి ఇంగువ కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక దించేయాలి నూనె చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి (ఇలా చేయడం వల్ల అందులోని పచ్చివాసన పోయి కమ్మగా ఉంటుంది) పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి అన్నిముక్కలకూ మసాలా పట్టిన తర్వాత శుభ్రమైన జాడీలోకి తీసుకుని మూత పెట్టాలి మూడు నాలుగు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవచ్చు ఇందులో కారం వేయలేదు కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. కర్టెసీ:జ్యోతి వలబోజు హిమాయత్ నగర్ హైదరాబాద్ www.shadruchulu.com సేకరణ:డా. వైజయంతి ఫొటోలు: అనిల్‌కుమార్ మోర్ల