breaking news
Swati murder case
-
నిఘా నీడలో పోస్టుమార్టం
సాక్షి, చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్ మృతదేహానికి ఎట్టకేలకు శనివారం పోస్టుమార్టం జరిగింది. ఈ ప్రక్రియ ఐదుగురు వైద్యులతో కూడిన బృందం తో పాటు తిరువళ్లూరు మెజిస్ట్రేట్ తమిళ్ సెల్వి సమక్షంలో జరిగింది. పూర్తిగా వీడియో చిత్రీకరణ చేశారు. ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో నిందితుడిగా పట్టుబడ్డ రామ్‌కుమార్ గత నెల పుళల్ కేంద్ర కారాగారంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తనయుడి మృతిలో అనుమానం ఉందంటూ రామ్‌కుమార్ తండ్రి పరమశివం కోర్టు మెట్లు ఎక్కడంతో పోస్టుమార్టం వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మృత దేహాన్ని చెన్నై రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పది రోజులకు పైగా ఉంచాల్సి వచ్చింది. ఎట్టకేలకు పరమశివం తరఫు వాదనల్ని కోర్టు పక్కన పెట్టడంతో పోస్టుమార్టం నిర్వహణకు తగ్గ చర్యలు చేపట్టారు. కోర్టు ఆదేశాల మేరకు ఐదుగురు వైద్యులతో కూడిన బృందం రంగంలోకి దిగింది. ఆ మేరకు శనివారం నిఘా నీడలో రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. నిఘానీడలో: రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహణ సమాచారంతో అందరి దృష్టి రాయపేట ప్రభుత్వ ఆసుపత్రి మీద పడింది. దీంతో ఆ పరిసరాల్లో క ట్టుదిట్టమైన భ ద్రతా ఏర్పాట్లు చేశారు. పది గంటల సమయంలో తిరువళ్లువర్ మెజిస్ట్రేట్ తమిళ్ సెల్వం సమక్షంలో రామ్‌కుమార్ మృతదేహాన్ని పరమశివం గుర్తించారు. ఈ సమయంలో వీసీకే నేత తిరుమావళవన్, న్యాయవాది రామ్రాజ్ అక్కడే ఉన్నారు. తదుపరి మెజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. గొంతు, చాతి మీద గాయాలు ఉండడాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలో ఆ గాయాలకు గల కారణాలను ప్రత్యేకంగా పరిశీలించే విధంగా వైద్య బృందానికి ఆదేశాల్ని మెజిస్ట్రేట్ జారీ చేశారు. పదిన్నర గంటల సమయంలో ఎయిమ్స్ వైద్యుడు డాక్టర్ కదిర్ కె.గుప్తా, రాయపేట, కీల్పాకం, స్టాన్లీ ఆసుపత్రులు వైద్యులు వినోద్, సెల్వకుమార్, మణి గండన్, రాజులతో కూడిన బృందం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. గంటన్నర పాటు సాగిన ఈ ప్రక్రియను రెండు కెమెరాల ద్వారా పూర్తిగా వీడియో చిత్రీకరించారు. వాగ్వివాదం: మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ముందుగా వైద్యులతో రామ్‌కుమార్ తరఫు న్యాయవాదులు వాగ్యుద్దానికి దిగారు. కోర్టు తమకు కల్పించిన అవకాశం మేరకు పోస్టుమార్టం నివేదిక నకలు, వీడియో దృశ్యాలు, ఫొటోలను తమకు పోస్టుమార్టం పూర్తయిన గంటన్నరలోపు ఇవ్వాల్సిందిగా వైద్యులకు సూచించారు. ఇందుకు వైద్య బృందం నిరాకరించడంతో వాగ్యుద్ధం చోటు చేసుకుంది. చివరకు వీసీకే నేత తిరుమావళవన్ జోక్యం చేసుకుని, రాత్రిలోపు తమకు సమర్పించాలని సూచించారు. లేని పక్షంలో మృతదేహాన్ని తీసుకోబోమని స్పష్టం చేశారు. అవసరం అయితే, రీ పోస్టుమార్టం చేయొచ్చని సూచించారు. తమకు అన్ని ప్రక్రియల్ని త్వరితగతిన ముగించి నకలు పత్రాలను చేతికిచ్చినప్పుడే మృతదేహానికి తీసుకుంటామని తేల్చారు. దీంతో పోస్టుమార్టం అనంతరం మృతదేహం మళ్లీ మార్చురీకి పరిమితమైంది. -
ఒకటిలోగా పోస్టుమార్టం నిర్వహించండి
టీనగర్: స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్‌కుమార్ మృతదేహం పోస్టుమార్టం అక్టోబరు ఒకటవ తేదీలోగా నిర్వహించి, ఈనెల 30వ తేదీ వరకు మృతదేహాన్ని భద్రపరచాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. స్వాతి హత్య కేసులో అరెస్టయి పుళల్ జైల్లో ఉంచిన రామ్‌కుమార్ ఈనెల 18న విద్యుత్ వైరును కొరికి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే. అతని మృతదేహానికి ఆరు రోజులుగా పోస్టుమార్టం నిర్వహించకుండా రాయపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఇలావుండగా రామ్‌కుమార్ మృతిపై అనుమానం ఉన్నట్లు, పోస్టుమార్టంలో తమ తరఫు వైద్యుని అనుమంతించాలని కోరుతూ రామ్‌కుమార్ తండ్రి పరమశివన్ దాఖలు చేసిన కేసులో ముగ్గురు న్యాయమూర్తులు విభిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఉత్తర్వుల్లో పోస్టుమార్టంకు నలుగురు ప్రభుత్వ వైద్యులు, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఒకరిని నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇందులో రామ్‌కుమార్ తండ్రి తరఫు కోర్కెను ముగ్గురు న్యాయమూర్తుల తీర్పులో నెరవేరని కారణంగా శుక్రవారం ఐదుగురు న్యాయమూర్తులు ఈ కేసును విచారించాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి విన్నవించారు. ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు న్యాయమూర్తుల ఉత్తర్వుల తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. అంతవరకు పోస్టుమార్టంను నిలిపివేయాలని రామ్‌కుమార్ తరఫు వాదనను ముందుంచారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి బదులిస్తూ ఇదివరకే కేసులో ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తులను సంప్రదించాల్సిందిగా సూచించారు. దీంతో రామ్‌కుమార్ తండ్రి తరషు లాయర్లు న్యాయమూర్తి కృపాకరన్‌కు అప్పీల్ చేశారు. ఆ సమయంలో రామ్‌కుమార్ తరఫున ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులపై నమ్మకం లేదని తెలిపారు. అందుకు న్యాయమూర్తి అనేక కేసుల్లో ఎయిమ్స్ వైద్యులు వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన విషయం మరువలేమని తెలిపారు. అనంతరం ఆయన జోక్యం చేసుకుంటూ ఈ కేసులో రాజకీయ పక్షాలు తలదూర్చుతున్నాయని, ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. అనంతరం రామ్‌కుమార్ తండ్రి వద్ద అభిప్రాయాన్ని సేకరించేందుకు పిలిపించారు. అందుకు శంకరసుబ్బు తమరు అతని కోసమే వాదిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం తరఫున ఏ సమాధానం ఇస్తున్నారని ప్రశ్నించారు. అందుకు ప్రభుత్వ న్యాయవాది బదులిస్తూ రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం చేయనందున మిగతా పోస్టుమార్టం పనులు స్తంభించిపోయినట్లు పేర్కొన్నారు. ఇదివరకే రామ్‌కుమార్ తండ్రి తరపు ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించడాన్ని, అందుకాయన సుప్రీంకోర్టును సంప్రదించాల్సిందిగా సూచించినట్లు పేర్కొన్నారు. దీన్ని విన్న న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తిని కలిసి తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు. తర్వాత ఆయన ప్రధాన న్యాయమూర్తితో సమాలోచన జరిపిన రామ్‌కుమార్ మృతదేహాన్ని ఈ నెల 30వ తేదీ వరకు మార్చురీలో భద్రపరచాలని, అక్టోబర్ ఒకటవ తేదీలోగా పోస్టుమార్టం చేయాలని ఉత్తర్వులిచ్చారు. -
కొండముచ్చు అన్నందుకే స్వాతిని చంపా
విచారణ వేగవంతం * కొండముచ్చు అన్నందుకే చంపా * దేవరాజన్ బృందంతో నిందితుడు * తల్లి, సోదరి వద్ద కూడా విచారణ * మీనాక్షిపురం ఇంట్లో తనిఖీలు సాక్షి, చెన్నై: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్‌ను పాళయం కోట్టై ఆసుపత్రి నుంచి చెన్నైకు తరలించారు. కట్టుదిట్టమైన భద్రత నడమ ప్రత్యేక అంబులెన్స్‌లో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తరలించారు. కాగా తన ప్రేమను తిరస్కరించడమే కాకుండా, కొండముచ్చు(దేవాంగు) వలే ఉన్నావని పదేపదే హేళన చేయడంతో తనలో ఉన్మాది బయటకు వచ్చినట్టు దేవరాజన్ నేతృత్వంలోని విచారణ బృందం ఎదుట రామ్‌కుమార్ వాంగ్ములం ఇచ్చాడు. ఇక, ఆత్మహత్యాయత్నం కేసును నమోదు చేసిన సెంగోట్టై పోలీసులు మీనాక్షిపురంలోని రామ్‌కుమార్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ప్రేమోన్మాదంతో స్వాతిని హతమార్చిన నిందితుడు రామ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడింది. ఈ కేసును విచారిస్తున్న ఐపీఎస్ అధికారి దేవరాజన్ నేతృత్వంలోని బృందం శనివారం రాత్రంతా పాళయం కోట్టై ప్రభుత్వ ఆసుపత్రిలో తిష్ట వేసింది. ఆసుపత్రి పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా అక్కడికి వచ్చే వాళ్లు ప్రతి ఒక్క రినీ తనిఖీల అనంతరం అనుమతించారు. రామ్‌కుమార్‌కు ఆస్పత్రి తరఫున బ్రెడ్, పాలు మాత్రం అందించారు. రాత్రంతా ఈ బృందం జరిపిన విచారణలో తనలోని ప్రేమికుడు, ఉన్మాది గురించి రామ్‌కుమార్ వివరించాడు. ఫేస్బుక్ ద్వారా స్వాతితో ఏర్పడ్డ పరిచయం, ఆమె కోసమే చెన్నై వచ్చినట్టుగా పేర్కొన్నాడు. తాను ప్రేమించమని ఒత్తిడి తెచ్చినప్పుడల్లా స్వాతి చీదరించుకునేదని పేర్కొన్నాడు. అయితే, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకపోవడంతో తన మీద ఆమెకు ప్రేమ ఉందని భావించినట్టు, అందుకే పదే పదే వెంటబడ్డట్టూ వివరించాడు. అదే సమయంలో తన ప్రేమకు మధ్యవర్తి ఓ మిత్రుడు వ్యవహరించినట్టు రామ్‌కుమార్ పేర్కొనడంతో అతగాడి కోసం విచారణ మొదలెట్టారు. చివరకు తనను తిరస్కరించిన స్వాతి కొండముచ్చు వలే ఉన్నావని పదే పదే వ్యాఖ్యానించడంతో తనలో ఉన్మాది బయటకు వచ్చాడని, మీనాక్షిపురానికి వచ్చి సమీపంలోని ఓ తోటలో అరటి గెలలు కోయడానికి ఉంచిన కత్తిని రహస్యంగా తీసుకుని చెన్నైకు వెళ్లినట్టు వాంగ్మూలం ఇచ్చాడు. ఆ రోజు ఆమెను హత్య చేయాలన్న ఉద్దేశం తనకు లేదు అని, ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించానని, అయితే, ఆమె మాటలు ఉన్మాదిని చేసినట్టు, హంతుకుడిగా మార్చేసినట్టు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. నుంగంబాక్కం స్టేషన్ నుంచి మేన్షనుకు రాగానే టీవీల్లో స్వాతి మృతి చెందినట్టు వచ్చిన వార్తతో అక్కడి నుంచి ఉడాయించి మీనాక్షిపురం చేరుకున్నట్టు వివరించాడు. రెండ్రోజులు బయటకు వెళ్లనప్పటికీ, తర్వాత మేకల మందల్ని తోలుకుని బయటకు వెళ్లినట్టు, క్రమంగా ఈ హత్య కేసు విచారణ గురించి పత్రికలు, టీవీల్లో తెలుసుకుంటూ వచ్చానని పేర్కొన్నాడు. తన ఇంటికి మఫ్టీలో మహిళా కానిస్టేబుల్ వెళ్లినప్పుడే పోలీసులు తనను సమీపించినట్టే అని భావించి ఆత్మహత్యాయత్నం చేసినట్టు వాంగ్మూలం ఇచ్చినట్టే మీడియాల్లో సమాచారాలు వెలువడుతుండడం గమనార్హం. ఇక, ప్రేమోన్మాది మీద సెంగోట్టై పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసును నమోదు చేసి, అతడి ఇంట్లో తనిఖీలు చేశారు. అక్కడ రక్తపు మరకతో ఉన్న చొక్కా, స్వాతి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అలాగే, స్వాతిని హతమార్చిన విషయం ముందుగా తమకు తెలియదని రామ్‌కుమార్ తల్లి పుష్ప పోలీసులు వద్ద స్పష్టం చేశారు. తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు, ఫేస్బుక్ పరిచయం గురించి తమకు తెలియదంటూ రామ్‌కుమార్‌తో సన్నిహితంగా ఉండే మీనాక్షిపురం మిత్రులు తెలియజేయడం గమనార్హం. అయితే, అవసరం మేరకు తప్ప, ఎవరితోనూ పెద్దగా మాట్లాడడని, అలాంటి వాడా, ఇలా అన్న విషయాన్ని జీర్ణించుకోలేకున్నామని వ్యాఖ్యానిస్తున్నారు. చెన్నైకి రామ్‌కుమార్: రాత్రంతా సాగిన విచారణతో ఆదివారం ఉదయం రామ్‌కుమార్‌కు వైద్య పరీక్షల్ని అందించారు. కొంత మేరకు కోలుకున్న దృష్ట్యా, ఇక, చెన్నైకు తీసుకెళ్లవచ్చని వైద్యులు సూచించారు. దీంతో ప్రత్యేక అంబులెన్స్, వైద్యబృందం, ముందు రెండు, వెనుక రెండు పోలీసు వాహనాలను సిద్ధం చేసి భద్రత నడమ చెన్నైకు తరలించే ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం చెన్నైకు తరలించే ప్రయత్నం చేసినా, అక్కడి కోర్టు న్యాయమూర్తి సెలవు మీద వెళ్లి ఉండడంతో సమస్యలు తప్పనట్టు సమాచారం. చెన్నైకు రామ్‌కుమార్‌ను తరలించే క్రమంలో అతడ్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున ఆసుపత్రి ఆవరణలో చుట్టుముట్టడంతో కాసేపు ఉత్కంఠ నెలకొంది. చివరకు న్యాయ పర సమస్యల్ని అధిగమించి, గట్టి భద్రత నడమ సరిగ్గా ఐదు గంటల సమయంలో అంబులెన్స్ పాళయం కోట్టై ఆసుపత్రి నుంచి జాతీయ రహదారి గుండా చెన్నై వైపుగా దూసుకెళ్లింది. ఆరు వందల కి.మీ దూరం పయనం కాబట్టి, సోమవారం వేకువ జామున చెన్నైకు చేరుకోనున్నారు. నేరుగా రామ్‌కుమార్‌ను రాయపేట ఆసుపత్రికి తరలించనున్నారు. అక్కడ ప్రత్యేక వార్డులో వైద్య చికిత్సలు అందించి, వైద్యుల సలహా మేరకు తదుపరి విచారణను వేగవంతం చేయనున్నారు. ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనలు స్వాతి హత్యతో సమాప్తం కావాలని, మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే, రామ్‌కుమార్ కఠినంగా శిక్షించబడాలని స్వాతి చిన్నాన్న గోవిందరాజన్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అలాగే, స్వాతి స్నేహితుడు మహ్మద్ బిలాల్ సిద్ధిక్ పేర్కొంటూ, వేధింపుల విషయాన్ని స్వాతి ఎవరి దృష్టికైనా తీసుకొచ్చి ఉంటే, ఇంత అనర్ధం జరిగి ఉండేది కాదు అని వ్యాఖ్యానించాడు. స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం, ఏ సమస్యనైనా నేరుగా ఢీకొట్టే ధైర్యం, శక్తి ఆమెకు ఉండబట్టే ఎవరి దృష్టికి తీసుకు రాలేదని పేర్కొంటూ, నిందితుడు కఠినంగా శిక్షించ బడాలని విన్నవించాడు. ఇళ్ల వద్ద నిఘా..నిఘా నేత్రాల మీద ప్రస్తుతం అందరి దృష్టి మళ్లింది. స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్‌ను గుర్తించడంలో నిఘా నేత్రాలు ఎంతగానో దోహదపడ్డాయి. రైల్వే స్టేషన్లలో నిఘా నేత్రాలు కన్పించనప్పటికీ, నుంగబాక్కం రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా నిందితుడు ఉడాయిస్తుండడాన్ని బందించింది. ఇది పోలీసుల విచారణకు ఎంతగానో దోహదపడింది. ఈ పరిస్థితుల్లో తమ ఇళ్ల వద్ద నిఘా నేత్రాల ఏర్పాటు మీద జనం దృష్టి పెట్టారు. సొంత ఇళ్లు కల్గిన వాళ్లతో పాటు అపార్ట్మెంట్స్, పలు ప్రాంతాల్లోని దుకాణాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు మీద ఆయా యజమానులు దృష్టి పెట్టి ఉండడం విశేషం. ఇందుకు తగ్గట్టుగా సీసీ కెమెరాల విక్రయ ఏజెన్సీలు రంగంలోకి దిగి ఉండడం గమనార్హం.