breaking news
SV krishnareddy
-
ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా!
‘‘ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తటానికే ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ తీశాం. తెరమీద పాత్రలు మిమ్మల్ని (ప్రేక్షకులు) నవ్విస్తుంటే.. మీరు నవ్వుతూ ఉంటే చూసే రోజు కోసం(3వ తేదీ) ఎదురు చూస్తున్నాను’’ అని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. సోహైల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల కానుంది. మంగళవారం నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘మా మూవీ ట్రైలర్‌కి ఇక్కడున్న వారు కొట్టిన చప్పట్లతో సినిమా విజయంపై మరింత విశ్వాసం పెరిగింది. ఈ సినిమాకు అన్నీ చక్కగా కుదిరాయి’’ అన్నారు. నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ–‘‘నా దృష్టిలో తరాలు మారొచ్చు కానీ సినిమా అనేది నిరంతరం సాగే ప్రపంచం. మనసున్న ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చేలా సన్నివేశాలు తీశారు కృష్ణారెడ్డిగారు’’ అన్నారు. ‘‘ఇప్పటి ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కృష్ణారెడ్డిగారు’’ అని కె. అచ్చిరెడ్డి అన్నారు. ‘‘హీరోగా నిరూపించుకోవడానికి నాకు వచ్చిన మంచి అవకాశం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ చిత్రం అని గర్వంగా చెబుతున్నాను’’ అన్నారు సోహైల్. -
స్నేహమే మా బంధాన్ని నిలబెట్టింది
ప్రేమకు, అనుబంధాలకు పరిధులు ఉంటాయి. కానీ స్నేహానికి ఇవేం ఉండవు. ఇద్దరి మధ్య పరిచయం.. స్నేహం చిగురించడానికి కారణాలు అనేకం. అయితే ఆ స్నేహం కొనసాగాలంటే స్నేహమే కావాలి. అలాంటి ఇద్దరు స్నేహితుల రెండు మనసులు కూడా ఒకలా ఆలోచిస్తాయి. ఎంతలా అంటే ఇద్దరు మిత్రుల 43 ఏళ్ల స్నేహమంత. వారే ప్రముఖ దర్శక, నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వీరిని ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ‘సాక్షి’ పలకరించగా ఇలా స్పందించారు. ‘వెస్ట్ గోదావరి జిల్లా, ఆరవల్లి సూల్లో చదువుకున్నాం. అప్పట్నుంచి మా జర్నీ సాగుతోంది. మా స్నేహంలో ప్రతి సందర్భం మెమొరబుల్గానే ఉంటుందని’ అచ్చిరెడ్డి అంటే, ఇన్నాళ్లుగా స్నేహం కొనసాగడానికి ఇద్దరిలో ఎవరెక్కువ కారణమంటే.. అచ్చిరెడ్డిగారే అని జవాబిచ్చారు కృష్ణారెడ్డి. ఇలాంటి స్నేహితుడు దొరకడం నిజంగా నా అదృష్టమని సంబరపడిపోయారు. స్నేహం వల్లే ప్రొఫెషన్.. అచ్చిరెడ్డి: ప్రొఫెషన్‌ను అభిరుచులను తెలుసుకుని ఎంచుకున్నాం. నాకు సినిమా రంగం పట్ల ఆసక్తి మాత్రమే ఉండేది. కృష్ణారెడ్డికి సినిమా పట్ల ప్రత్యేకమైన క్లారిటీ, అవగాహన ఉండేది. అది గమనించి మేం సినిమా రంగంలోకి వస్తే బాగా రాణించగలం అనిపించింది. నాకన్నా గొప్ప వ్యక్తి.. కృష్ణారెడ్డి: సినిమాలంటే నాకు బాగా ఆసక్తి. నాలో నాకు తెలియని టాలెంట్‌ని గుర్తించి అచ్చిరెడ్డి నాకు సపోర్ట్‌గా నిలిచాడు. నేను ఫాంటసీలో ఉంటాను, ఆవేశం కూడా. కొన్నిసార్లు నేను తీసుకునే నిర్ణయాలు కూడా కరెక్ట్ కాకపోవచ్చు. అన్నింట్లో కరెక్ట్ చేస్తూ అచ్చిరెడ్డి నన్ను ముందుకు తీసుకువెళ్తాడు. అందుకే ఆయన నాకన్నా గొప్ప వ్యక్తి. మా స్నేహంలో స్వార్థం లేదు.. అచ్చిరెడ్డి: మా స్నేహంలో స్వార్థం లేదు. నువ్వు గొప్పా, నేను గొప్పా, అనే అహాలకు స్థానం లేదు. అదే ఉంటే మా స్నేహం ఇన్నేళ్లు నిలిచేది కాదు. కృష్ణారెడ్డి: చిన్న చిన్న విషయాల్లో ఇద్దరికీ వేర్వేరు అభిప్రాయాలు ఉండేవి. ఇద్దరం కలిసి మాట్లాడుకుని మంచి నిర్ణయం తీసుకుంటాం. అచ్చిరెడ్డి నాకన్నా మంచి వ్యక్తి. అభిప్రాయాలే వేరు.. భేదాలు రావు. అతనే మంచి మిత్రుడు.. అచ్చిరెడ్డి: నా వరకు కృష్టారెడ్డే మంచి మిత్రుడు. ఇది అనుభవంతో చెబుతున్నది. మనసులో ఆనందాన్ని ఇద్దరం పంచుకుంటాం. ఈ స్నేహం భగవంతుడిచ్చిన వరం. కృష్ణారెడ్డి: అనుక్షణం నా కోసం, నా కష్టాన్ని, ఇష్టాన్ని తీరుస్తూ ఉండే స్నేహితుడు మాత్రం అచ్చిరెడ్డే. నా కష్టాల్లో కూడా తోడుండే ఆప్తుడు ఆయన. స్నేహం కొనసాగాలంటే.. అచ్చిరెడ్డి: ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవించాలి. అభిప్రాయాలు కలవనప్పుడు వాటిని స్నేహంతో కలుపుకుపోవాలే కానీ కలతలు తెచ్చి పెట్టుకోకూడదు. అభిప్రాయాల మధ్య తేడా వచ్చినా స్నేహ బంధంతో కలవక తప్పదు. కృష్ణారెడ్డి: కలిసి తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పోరాడడం సైనికుల లక్షణం. అదే విధంగా స్నేహంలో రాజు ఎవరు, సైనికుడు ఎవరనేది వేరే విషయం. కానీ ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయానికి ఇద్దరూ కట్టుబడి పనిచెయ్యాలి. స్నేహాన్ని, స్నేహితుడిని గౌరవించాలి.