summons to Rahul Gandhi
-
Rahul Gandhi: ‘సుప్రీం’ మందలింపు.. ఆ వెంటనే చిక్కులు!
ముంబై/న్యూఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చిక్కుల్లో పడ్డారు. పరువు నష్టం కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ పుణే కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. స్వాతంత్ర సమరయోధుడు వీరసావర్కర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.ఏఎన్ఐ కథనం ప్రకారం.. 2023 మార్చి 5వ తేదీన లండన్ పర్యటనలో రాహుల్ గాంధీ వీరసావర్కర్(Veer Savarkar)ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలకు గానూ రాహుల్‌పై సావర్కర్ దగ్గరి బంధువు పుణే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. విచారణ జరిపిన కోర్టు.. మే 9వ తేదీన తమ ఎదుట హాజరు కావాల్సిందిగా రాహుల్‌కు సమన్లు జారీ చేసింది.మరోవైపు.. సావర్కర్‌పై మరో సందర్భంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలనుగానూ కేసు నమోదు అయ్యింది. అయితే.. తాజాగా ఆ కామెంట్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.2022లో.. భారత్ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్ర అకోల్‌లో రాహుల్ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నృపేంద్ర పాండే అనే వ్యక్తి యూపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు.అయితే, దీనిపై అనేకసార్లు విచారణకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని న్యాయస్థానం (ACJM) రాహుల్‌కు రూ.200 జరిమానా కూడా విధించింది. అయితే.. ఈ కేసులో తనకు జారీ చేసిన సమన్లను అలహాబాద్ హైకోర్టు రద్దు చేయడానికి నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. తాజాగా.. విచారణ జరిపిన సుప్రీం కోర్టు రాహుల్‌ను గట్టిగానే మందలించింది.వీర్ సావర్కర్‌కు (Vinayak Damodar Savarkar) మహారాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవం ఇస్తారని పేర్కొన్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం.. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని మందలించింది. స్వాతంత్ర్య సమరయోధులను ఎగతాళి చేయడం తగదని.. మళ్లీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులపై ఎవరూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి అనుమతించమని పేర్కొంది. ఇకనుంచి వాళ్లను అపహాస్యం చేస్తే ఇకపై కోర్టు సుమోటోగా విచారణ చేపడుతుందని తెలిపింది.అదే సమయంలో.. రాహుల్‌పై దాఖలైన కేసులో ఆయనపై క్రిమినల్ చర్యలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. రాహుల్‌పై ఫిర్యాదు చేసిన నృపేంద్ర పాండేకు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. -
మోదీ ఇంటిపేరు వివాదం.. రాహుల్‌కు మరో కోర్టు సమన్లు
పట్నా: మోదీ ఇంటిపేరు వివాదంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ వేసిన పరువునష్టం కేసులో ఏప్రిల్ 25న కోర్టు ఎదుట హాజరవ్వాలని రాహుల్‌గాంధీని బిహార్ కోర్టు బుధవారం సూచించింది. ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో వేసిన పిటిషన్ విచారణను బుధవారం కోర్టు ప్రత్యేక జుడీషియల్ మేజిస్ట్రేట్ ఆది దేవ్ చేపట్టారు. ఏప్రిల్ 12వ తేదీనే హాజరవ్వాలని గత నెల 18న ఆయన ఆదేశాలివ్వడం తెల్సిందే. హాజరుపై రాహుల్ తరఫు లాయర్లు తమ వాదనలు వినిపించారు. సూరత్ కోర్టు కేసులో రాహుల్ తరఫు లాయర్ల బృందం తలమునకలైనందున రాహుల్ హాజరవాల్సిన తేదీని మార్చాలని కోరారు. అందుకు అంగీకరించిన మేజిస్ట్రేట్ రాహుల్‌ను 25వ తేదీన హాజరుకావాలంటూ సమన్లు జారీచేశారు. మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్‌కు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు విధించడం, ఎంపీగా అనర్హత వేటు పడటం తెలిసిందే. -
నేడు అమేథీకి రాహుల్
అమేథీ (యూపీ)/అహ్మదాబాద్: తాజా సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీచేసి ఓడిన అమేథీ నియోజకవర్గంలో నేడు రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ప్రత్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓడారు. తన పర్యటన సందర్భంగా రాహుల్ పార్టీ ప్రతినిధులను కలుస్తారు. సలోన్, అమేథీ, గౌరిగంజ్, జగదీశ్‌పూర్, తిలోయి అసెంబ్లీ నియోజకవర్గ బూత్ అధ్యక్షులను కలుసుకుంటారు. అలాగే కొన్ని గ్రామాలను సందర్శించే అవకాశం ఉందని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తెలిపారు. రాహుల్ 1999 నుంచి అమేథీ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచారు. రాహుల్‌కి గుజరాత్ కోర్ట్ సమన్లు హోంమంత్రి అమిత్ షాను హత్య కేసులో నిందితుడిగా పేర్కొని ఆయన పరువుకు నష్టం కలిగించారన్న కేసులో రాహుల్‌కు గుజరాత్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. స్థానిక బీజేపీ నేత ఒకరు రాహుల్‌పై ఈ కేసువేశారు. ఈ కేసులో ఆగస్టు 9న హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో మే 1న ఇదే కేసులో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాహుల్‌కి సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన లోక్‌సభ సభ్యుడు కావడంతో లోక్‌సభ స్పీకర్ నోటీసును తిరస్కరించారు. దీంతో ఆగస్టు 9న హాజరు కావాలంటూ తాజాగా సమన్లు జారీ చేశారు. ఈ నోటీసును రాహుల్ నివాసంలో నేరుగా అందించనున్నారు. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ అమిత్ షాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆరోపించారు. సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో అమిత్‌ను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. -
రాహుల్ గాంధీకి పంజాబ్ కోర్టు సమన్లు
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంజాబ్‌లోని స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 19న తమ ఎదుట హాజరుకావాలని రాహుల్‌ను న్యాయస్థానం ఆదేశించింది. ఉత్తరప్రదేశ్, బీహార్ వాసులను అవమానపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారని దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. చండీగఢ్‌కు చెందిన శివమూర్తి యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2011, నవంబర్ 14న ఫుల్పూర్లో రాహుల్ గాంధీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ ఆరోపించారు. 'మీరు(యూపీ ప్రజలు) పనుల కోసం ఎన్నాళ్లు పాటు పంజాబ్, ఢిల్లీకి వలసవెళతారు. ఎన్నాళ్లు కూలీలుగా ఉంటారు. పని కోసం ఎన్నిరోజులు మహారాష్ట్రను వేడుకుంటారు' అని రాహుల్ వ్యాఖ్యానించినట్టు వెల్లడించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జ్యుడీషియల్ మేజిస్టేట్ జస్విందర్ సింగ్.. రాహుల్ గాంధీకి 'దస్తీ' సమన్లు జారీ చేశారు. గతనెల 17న సమన్లు జారీ చేసినప్పటికీ అవి రాహుల్ గాంధీకి చేరలేదు. దీంతో మరోసారి సమన్లు జారీ చేసింది.