breaking news
summer trainning
-
ఒకటే లక్ష్యం..!
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కఠోర సాధన, క్రమశిక్షణతో పాటు క్రీడల్లో రాణించాలన్న తపన ఉన్న వారికి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. నగరంలోని డీఎస్ఏ క్రీడామైదానంలో మే నెల 1 వ తేదీ నుంచి క్రికెట్ సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఏసీఏ కోచ్‌ల పర్యవేక్షణలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అంశాలతో పాటు మానసిక, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకునేలా శిక్షణ ఇస్తున్నారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి, కార్యదర్శి డి. నాగేశ్వరరాజు ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. అలాగే హాజరయ్యే క్రీడాకారులకు ఎలాంటి రుసుం లేకుండా శిక్షణ ఇస్తున్నారు. ఏఏ అంశాల్లో శిక్షణ.. ఏ క్రీడకైనా ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో ముఖ్యమన్న విషయం తెలిసిందే. ఇందుకోసం తొలుత శిక్షణ శిబిరాలకు హాజరయ్యే క్రీడాకారులతో తొలుత జాగింగ్ చేయిస్తారు. అనంతరం ఫిట్నెస్కోసం స్ట్రెచ్చింగ్, వార్మ్అప్గేమ్స్, స్ప్రింట్స్ తదితర వ్యాయామాలను చేయిస్తారు. అనంతరం వారు ఎన్నుకున్న రంగంలో అంటే బౌలింగ్, బ్యాటింగ్, కీపింగ్ ఇలా వేర్వేరు విభాగాల్లో సీనియర్స్, జూనియర్స్‌కు వేర్వేరుగా మెళకువలు నేర్పుతారు. ఇందులో క్రీడాకారులకు ఫార్వర్డ్ డిఫెన్స్, బ్యాక్వర్డ్ డిఫెన్స్, షాడో ప్రాక్టీస్, డ్రాప్బాల్స్, స్పాట్బౌలింగ్, లాంగ్ బ్యారియర్ ఫీల్డింగ్, మ్యాన్ టు మ్యాన్ క్యాచెస్ తదితర అంశాల్లో తర్ఫీదు ఇస్తారు. కష్టపడే తత్వం ఉండాలి.. క్రీడాకారుల్లో కష్టపడేతత్వం, క్రమశిక్షణ, రెగ్యులారిటీ ఉంటే క్రికెట్లో రాణించవచ్చు. ప్రతిరోజు సాధన చేయడం ద్వారా క్రీడాకారుల్లోని బలహీనతలను అధిగమించే అవకాశం ఉంటుంది. క్రికెట్లో తీవ్రమైన పోటీ నెలకొని ఉన్నందున బాగా సాధన చేయడంతో పాటు ఫిట్నెస్ కూడా కాపాడుకోవడం ముఖ్యం. - ఖదీర్, ఏసీఏ లెవల్ 1 కోచ్ మంచి క్రీడాకారుల కోసం అన్వేషణ జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించేందుకు ఈ శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయి. ప్రతిభ కలిగిన ఏ ఒక్క క్రీడాకారుడు అవకాశం కోల్పోకూడదనే ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్నాం. జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంపూర్ణ సహకారం అందిస్తోంది. శిబిరం తర్వాత కూడా రెగ్యులర్‌గా క్రీడాకారులు సాధనకు రావచ్చు. - ఖాజామైనుద్దీన్, శిక్షణ శిబిరం ఇన్చార్జి, ఏసీఏ లెవల్ ‘ఓ’ కోచ్ -
క్విజ్‌లో నెగ్గిన తనుష్, అబ్దుల్లా
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా సెంట్రల్ జోన్ స్పోర్ట్స్ క్విజ్‌లో తనుష్ గాంధీ, నాసిర్ అబ్దుల్లా విజేతలుగా నిలిచారు. ఇందిరా పార్క్ స్కేటింగ్ రింక్‌లో రోలర్ స్కేటింగ్ శిక్షణ తీసుకుంటున్న వీరిద్దరూ బుధవారం విక్టరీ ప్లే గ్రౌండ్స్‌లో నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలిచారు. ఇందులో అభిలాష్, ప్రేమ్ జంట రెండో స్థానం పొందారు. వీళ్లు లాల్‌బహదూర్ ప్లే గ్రౌండ్లో క్రికెట్ నేర్చుకుంటున్నారు. విక్టరీ ప్లేగ్రౌండ్‌లో సెపక్తక్రా శిక్షణ తీసుకుంటున్న అభిరూప్-శశాంక్ జోడి మూడో స్థానంలో నిలిచింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (స్పోర్ట్స్), ఎ.అన్నపూర్ణ, సుల్తాన్ బజార్ కార్పొరేటర్ శ్రీరాంచందర్ రాజు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ డెరైక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్, అసిస్టెంట్ డెరైక్టర్ ఫ్రాన్సిస్ రొసారియో పాల్గొన్నారు.