మిట్టమధ్యాహ్నం... కలకలం
కడప అర్బన్ : కడప నడిబొడ్డున ఏడురోడ్ల కూడలిలోని సుజాత హోటల్ వెనుక భవనమంతా శుక్రవారం మిట్టమధ్యాహ్నం 12.45 గంటల నుంచి 1.00 మధ్య సమయంలో కుప్పకూలింది. ఈ సంఘటన నగరంలో కలకలం రేపింది. హోటల్లో పని చేస్తున్న ఇద్దరు మహిళా కూలీలు శిథిలాల కింద ఇరుక్కుపోయారు. వారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అలాగే గడిపారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. కడపకు వచ్చిన వారిలో అధిక మంది ఏదో ఒక సమయంలో కాఫీ, టీ, టిఫిన్ వంటి ఫలహారాలు, భోజనాలు చేసేందుకు ఈ హోటల్‌కు వచ్చి ఉంటారు. కడపలో ఈ హోటల్‌ను చూడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. దాదా పు వంద ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో భారీగా ప్రాణనష్టం జరిగి ఉంటుంద ని మొదట ఆందోళన వ్యక్తం చేశారు. వంట గదిగా ఉండే వెనుకభాగం పైకప్పు నుంచి పూర్తిగా కుప్పకూలడంతో ఒక్కసారిగా ప్రజలు అటు వైపుగా పరుగు తీశారు. సమాచారాన్ని వెంటనే అగ్నిమాపక శాఖ వారికి, పోలీసులకు తెలియజేశారు.
శిథిలాల మధ్య ఇరుక్కున్న మహిళలు
సంఘటన జరిగిన వెంటనే అక్కడ పని చేస్తున్న కూలీలు, వంట మాస్టర్లు ఏం జరిగిందోనని బయటికి పరుగులు తీశారు. వంట గదిలో సామాన్లు కడుగుతున్న ఇద్దరు మహిళలు పార్వతి, చౌడమ్మ మాత్రం బయటికి పరుగెత్తుకుని వచ్చేలోపే భవనం వారిపై కూలింది. వారు అరుపులు, కేకలు వినిపించినా బయటకు తీయ డం కష్టమైంది. వారి ఆక్రందనలు కొన్ని నిమిషాల పా టు అరణ్యరోదనగా మారాయి. స్థానికంగా ఉన్న జనా లు, అగ్నిమాపక సిబ్బంది రాగానే వారికి లోపల మనుషులు ఇరుక్కున్నారని చెప్పడంతో.. సహాయక చర్యలు చేపట్టారు. మొదట పార్వతి అనే మహిళను రక్షించి హుటాహుటిన 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు.
గంటకు పైగా సహాయక చర్యలు
వెంటనే మరో మహిళ ఆర్తనాదం వినిపించడంతో ఆమె ను ఎలా రక్షించాలని అగ్నిమాపక శాఖ సిబ్బంది తమ వంతు ప్రయత్నాలు సాగించారు. ఇంతలోపు కడప నగ ర పాలక సంస్థ కమిషనర్ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, కడప ఆర్డీఓ చిన్నరాముడు, ఓఎస్డీ (ఆపరేషన్స్) సత్య ఏసుబాబు, కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి విజయ్‌కుమార్ పర్యవేక్షణలో సహా యక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. మహిళ ఇరుక్కు న్న విధానాన్ని పరిశీలించి.. గ్యాస్ కటింగ్ చేసి ఆమెను రక్షించాలని భావించారు. వెంటనే ఆక్సిజన్ సిలిండర్‌ను తెప్పించి సహాయక చర్యలు చేపట్టి చౌడమ్మను బయటికి తీసుకు వచ్చారు. 108లో రిమ్స్‌కు తరలించారు.